India lost final T20I match against West Indies - Sakshi
Sakshi News home page

IND vs WI: ఐదో టీ20లో టీమిండియా ఓటమి.. సిరీస్‌ సమర్పయామి

Aug 14 2023 2:33 AM | Updated on Aug 14 2023 9:51 AM

ndia lost in the last T20 match - Sakshi

లాడెర్‌హిల్‌ (ఫ్లొరిడా): బ్యాటింగ్‌కు స్వర్గధామమైన పిచ్‌పై బ్యాటర్ల నిర్లక్ష్యం, పసలేని బౌలింగ్‌తో భారత్‌ కరీబియన్‌ పర్యటనను నిరాశతో ముగించింది. టెస్టు, వన్డే సిరీస్‌లను సొంతం చేసుకున్న భారత జట్టు టి20 సిరీస్‌ను మాత్రం కోల్పోయింది. చివరిదైన ఐదో టి20 మ్యాచ్‌లో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది.

ఈ గెలుపుతో వెస్టిండీస్‌ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3–2తో చేజిక్కించుకుంది. మొదట భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. తిలక్‌ వర్మ (18 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కాసేపు మెరిపిస్తే... సూర్యకుమార్‌ (45 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) నడిపించాడు.

విండీస్‌ సీమర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రొమారియో షెఫర్డ్‌ (4/31) భారత్‌ జోరుకు ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన వెస్టిండీస్‌ 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసి గెలిచింది. బ్రాండన్‌ కింగ్‌ (55 బంతుల్లో 85 నాటౌట్‌; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), నికోలస్‌ పూరన్‌ (35 బంతుల్లో 47; 1 ఫోర్, 4 సిక్సర్లు) చెలరేగారు.  

ఆదుకున్న సూర్య 
టాస్‌ నెగ్గిన భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. కానీ తీరా బ్యాటింగ్‌కు దిగగానే కష్టాలు ఎదురయ్యాయి. హోసీన్‌ వరుస ఓవర్లలో ఓపెనర్లు యశస్వి (5), గిల్‌ (9) వికెట్లను పడేశాడు. ఈ దశలో సూర్యకుమార్‌కు జతయిన తిలక్‌ వర్మ ధనాధన్‌ ఆటాడాడు. కానీ కాసేపట్లోనే చేజ్‌ అతని మెరుపులకు రిటర్న్‌ క్యాచ్‌తో ముగింపు పలికాడు. సంజూ సామ్సన్‌ (13) నిరాశపరచగా, తనశైలి షాట్లతో సూర్యకుమార్‌ జట్టును ఆదుకున్నాడు.

భారీ సిక్సర్‌తో సూర్య ఫిఫ్టీ 38 బంతుల్లో పూర్తయ్యింది. అయితే వానొచ్చి కాసేపు ఆటను ఆపేసింది. తర్వాత ఆట మొదలవగానే కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (18 బంతుల్లో 14; 1 సిక్స్‌) షెఫర్డ్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి లాంగాన్‌లో హోల్డర్‌ చేతికి చిక్కాడు. తర్వాత సూర్యకుమార్‌ను హోల్డర్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. యార్కర్‌ లెంత్‌ బాల్‌ నేరుగా వికెట్ల ముందున్న అతని ప్యాడ్లకు తగిలినా... ఫీల్డ్‌ అంపైర్‌ అప్పీల్‌ను తోసిపుచ్చాడు.

బంతి గమనం ఇన్‌లైన్‌లో ఉండటంతో విండీస్‌ డీఆర్‌ఎస్‌కు వెళ్లి ఫలితాన్ని రాబట్టింది. సరిగ్గా ఇలాగే మరో రివ్యూ (డీఆర్‌ఎస్‌)తో కుల్దీప్‌ (0) వికెట్‌ను షెఫర్డ్‌ దక్కించుకున్నాడు. భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసేందుకు ఇంకో రెండు బంతులు ఉండగా మళ్లీ వర్షమొచ్చి ఆగినా... వెంటనే మొదలైంది. కానీ అక్షర్‌ పటేల్‌ (10 బంతుల్లో 13; 1 సిక్స్‌) అవుట్‌కాగా ఆఖరి బంతిని ముకేశ్‌ కీపర్‌ తలపైనుంచి బౌండరీకి తరలించాడు. 

కింగ్, పూరన్‌ల జోరుతో 
లక్ష్యఛేదనకు దిగగానే అర్ష్దీప్‌ సింగ్‌ ఓపెనర్‌ మేయర్స్‌ వికెట్‌ను పడగొట్టడంతో భారత్‌ సంబరమైతే చేసుకుంది. కానీ ఈ ఆనందం అంతటితోనే ఆవిరైంది. మరో ఓపెనర్‌ బ్రాండన్‌ కింగ్, నికోలస్‌ పూరన్‌ స్కోరు బోర్డును భారీ సిక్సర్లు, బౌండరీలతో పరుగు పెట్టించారు. పేస్, స్పిన్‌ ఇలా ఎవరు వేసినా రన్‌రేట్‌ మాత్రం ఓవర్‌కు 9 పరుగుల చొప్పున దూసుకెళ్లింది.

హిట్టర్లు ఇద్దరూ పాతుకుపోవడంతో వికెట్‌ పడగొట్టడం భారత బౌలర్ల వల్ల కాలేకపోయింది. వర్షం మళ్లీ చికాకు పెట్టినా విరామం తర్వాత మొదలైంది. పూరన్‌ను తిలక్‌ వర్మ బోల్తా కొట్టించాడు. కానీ మిగతా లాంఛనాన్ని 38 బంతుల్లో అర్థసెంచరీ పూర్తిచేసుకున్న కింగ్, షై హోప్‌ (13 బంతుల్లో 22 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) పూర్తి చేశారు. పాండ్యా ఏకంగా 8 మందిని బౌలింగ్‌కు దించినా 2 వికెట్లనే పడగొట్టగలిగాడు. 

స్కోరు వివరాలు
భారత్‌ ఇన్నింగ్స్‌: యశస్వి (సి అండ్‌ బి) హోసీన్‌ 5; గిల్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) హోసీన్‌ 9; సూర్యకుమార్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) హోల్డర్‌ 61; తిలక్‌వర్మ (సి అండ్‌ బి) చేజ్‌ 27; సామ్సన్‌ (సి) పూరన్‌ (బి) షెఫర్డ్‌ 13; పాండ్యా (సి) హోల్డర్‌ (బి) షెఫర్డ్‌ 14; అక్షర్‌ (సి) షెఫర్డ్‌ (బి) హోల్డర్‌ 13; అర్ష్దీప్‌ (బి) షెఫర్డ్‌ 8; కుల్దీప్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) షెఫర్డ్‌ 0; చహల్‌ (నాటౌట్‌) 0; ముకేశ్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి) 165. వికెట్ల పతనం: 1–6, 2–17, 3–66, 4–87, 5–130, 6–140, 7–149, 8–149, 9–161. బౌలింగ్‌: అకిల్‌ హోసీన్‌ 4–0–24–2, మేయర్స్‌ 1–0–4–0, హోల్డర్‌ 4–0–36–2, జోసెఫ్‌ 3–0–41–0, చేజ్‌ 4–0–25–1, షెఫర్డ్‌ 4–0–31–4. 
వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: కింగ్‌ (నాటౌట్‌) 85; మేయర్స్‌ (సి) యశస్వి (బి) అర్ష్దీప్‌ 10; పూరన్‌ (సి) పాండ్యా (బి) తిలక్‌ వర్మ 47; షై హోప్‌ (నాటౌట్‌) 22; ఎక్స్‌ట్రాలు 7. మొత్తం (18 ఓవర్లలో 2 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–12, 2–119. బౌలింగ్‌: పాండ్యా 3–0–32–0, అర్ష్దీప్‌ 2–0–20–1, కుల్దీప్‌ 4–0–18–0, చహల్‌ 4–0–51–0, ముకేశ్‌ 1–0–10–0, తిలక్‌ వర్మ 2–0–17–1, అక్షర్‌ 1–0–8–0, యశస్వి 1–0–11–0  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement