రొలాండ్‌ గారోస్‌లో నాదల్‌కు ప్రత్యేక సన్మానం | Nadal receives special honor at Roland Garros | Sakshi
Sakshi News home page

రొలాండ్‌ గారోస్‌లో నాదల్‌కు ప్రత్యేక సన్మానం

Apr 19 2025 2:03 AM | Updated on Apr 19 2025 2:03 AM

Nadal receives special honor at Roland Garros

పారిస్‌: సీజన్‌ రెండో గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ ప్రారంభానికి ముందు స్పెయిన్‌ దిగ్గజం రాఫెల్‌ నాదల్‌ను ప్రత్యేకంగా సన్మానించనున్నారు. మరే ఆటగాడికీ సాధ్యంకాని రీతిలో... 14 సార్లు ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ కైవసం చేసుకున్న నాదల్‌... ఓవరాల్‌గా 22 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ గెలిచాడు. ఈ ఏడాది మే 25 నుంచి ఫ్రెంచ్‌ ఓపెన్‌ ప్రారంభం కానుండగా... తొలి రోజు నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో నాదల్‌ను సన్మానించనున్నారు. ‘రొలాండ్‌ గారోస్‌కు, నాదల్‌కు విడదీయరాని అనుబంధం ఉంది. 

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో అతడు చరిత్ర సృష్టించాడు. నాదల్‌ గౌరవార్థం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తాం. అది అభిమానులతో పాటు ప్రేక్షకులను ఆశ్చర్యానికి లోను చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం’ అని ఫ్రెంచ్‌ ఓపెన్‌ డైరెక్టర్‌ అమెలీ మౌరెస్మో గురువారం అన్నారు. 2024 ఫ్రెంచ్‌ ఓపెన్‌ తొలి రౌండ్‌లో అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ చేతిలో పరాజయం పాలైన నాదల్‌... అదే సమయంలో సన్మానించాలని నిర్వాహకులు భావించినా... దానికి అతడు అంగీకరించలేదు. శరీరం సహకరిస్తే మరోసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌లో బరిలోకి దిగాలని 38 ఏళ్ల నాదల్‌ భావించాడు. 

కాగా... వరుస గాయాల కారణంగా గతేడాది నవంబర్‌లో నాదల్‌ కెరీర్‌కు వీడ్కోలు పలకడంతో... నిర్వాహకులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. నాదల్‌తో పాటు మేరీ పియర్స్, రిచర్డ్‌ గాస్కె్వట్‌ను కూడా సన్మానించనున్నారు. 25 ఏళ్ల క్రితం ఫ్రెంచ్‌ ఓపెన్‌లో పియర్స్‌ మహిళల సింగిల్స్, మహిళల డబుల్స్‌లో టైటిల్స్‌ సాధించింది. ఈ ఏడాది జూన్‌ 5న మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్స్‌కు ముందు ఆమెను సన్మానించనున్నారు. 50 ఏళ్ల పియర్స్‌ 2019లో టెన్నిస్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లోనూ చోటు దక్కించుకుంది.  

Advertisement
 
Advertisement
Advertisement