జయహో జ్వెరెవ్‌ | Alexander Zverev wins French Open | Sakshi
Sakshi News home page

జయహో జ్వెరెవ్‌

Jun 8 2026 2:22 AM | Updated on Jun 8 2026 2:22 AM

Alexander Zverev wins French Open

తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సొంతం

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచిన జర్మనీ స్టార్‌

ఫైనల్లో ఇటలీ ప్లేయర్‌ కొబోలిపై ఐదు సెట్‌లలో విజయం

రూ. 30 కోట్ల 62 లక్షల ప్రైజ్‌మనీ సొంతం  

పారిస్‌: నిరీక్షణ ముగిసింది.... జర్మనీ టెన్నిస్‌ స్టార్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ తన కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను గెల్చుకున్నాడు. టెన్నిస్‌ సీజన్‌ రెండో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రెండో సీడ్‌ జ్వెరెవ్‌ విజేతగా అవతరించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ జ్వెరెవ్‌ 6–1, 4–6, 6–4, 6–7 (5/7), 6–1తో ప్రపంచ 14వ ర్యాంకర్, పదో సీడ్‌ ఫ్లావియో కొబోలి (ఇటలీ)పై గెలిచాడు. 

4 గంటల 16 నిమిషాలపాటు జరిగిన తుది సమరంలో జ్వెరెవ్‌ నిర్ణాయక ఐదో సెట్‌లో తన అనుభవాన్నంతా రంగరించి పోరాడి విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ ఆడిన కొబోలి చివరి సెట్‌లో తడబడ్డాడు. ఈ సెట్‌లో జ్వెరెవ్‌ మూడుసార్లు కొబోలి సర్వీస్‌ను బ్రేక్‌ చేశాడు. డిఫెండింగ్‌ చాంపియన్‌ అల్‌కరాజ్‌ గాయంతో వైదొలగడం... ప్రపంచ నంబర్‌వన్‌ సినెర్‌ రెండో రౌండ్‌లోనే వెనుదిరగడం... సెర్బియా దిగ్గజం జొకోవిచ్‌ మూడో రౌండ్‌లోనే ఓడిపోవడం .... వెరసి జ్వెరెవ్‌కు తన ‘గ్రాండ్‌’ కలను నిజం చేసుకునేందుకు సువర్ణావకాశం లభించింది.  

నాలుగో ప్రయత్నంలో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌నుకైవసం చేసుకున్నాడు. 2020 యూఎస్‌ ఓపెన్, 2024 ఫ్రెంచ్‌ ఓపెన్, 2025 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్స్‌లో ఓడిపోయిన జ్వెరెవ్‌ ఈసారి మాత్రం వదల్లేదు. కాస్త ఒత్తిడికి లోనైనా... కీలకదశలో తన అనుభవంతో గట్టెక్కి ‘గ్రాండ్‌’ స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. విజేతగా నిలిచిన జ్వెరెవ్‌కు 28 లక్షల యూరోలు (రూ. 30 కోట్ల 62 లక్షలు), రన్నరప్‌ కొబోలికి 14 లక్షల యూరోలు (రూ. 15 కోట్ల 31 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. బోరిస్‌ బెకర్‌ (1996లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌) తర్వాత గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ నెగ్గిన జర్మనీ ప్లేయర్‌గా జ్వెరెవ్‌ గుర్తింపు పొందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement