వీల్‌చైర్‌ నుంచి విక్టరీ పోడియం వరకు... | Alexander Zverevs dream comes true on his fourth attempt | Sakshi
Sakshi News home page

వీల్‌చైర్‌ నుంచి విక్టరీ పోడియం వరకు...

Jun 8 2026 2:29 AM | Updated on Jun 8 2026 2:29 AM

Alexander Zverevs dream comes true on his fourth attempt

అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ ‘గ్రాండ్‌’ ప్రస్థానం

ఎట్టకేలకు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సొంతం

నాలుగో ప్రయత్నంలో స్వప్నం సాకారం  

రాకెట్‌ పట్టిన ప్రతి చిన్నారి కల ఒక్కటే... ఏనాటికైనా ఏ విభాగంలోనైనా గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించాలని... అయితే తమ లక్ష్యం నెరవేరకుండానే... దానికి సమీపంలోకి రాకుండానే... ఎంతోమంది రాకెట్‌ వదిలేస్తారు.... కానీ కొందరుంటారు... ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా... ఎన్నిసార్లు విఫలమైనా... తమకంటూ ఒక రోజు వస్తుందనే నమ్మకంతో టైటిల్‌ వేటను కొనసాగిస్తుంటారు. 

ఆలస్యమైనా వారు జీవిత లక్ష్యం అందుకుంటారు... జీవన స్వప్నం సాకారం చేసుకుంటారు... ఆ కోవలోకే వస్తాడు జర్మనీకి చెందిన 29 ఏళ్ల అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌. పుష్కరకాలం నుంచి ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ ఆడుతున్న జ్వెరెవ్‌ నాలుగో ప్రయత్నంలో తన గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ కలను నిజం చేసుకున్నాడు. పట్టుదల ఉంటే సాధ్యం కానిది లేదని నిరూపించాడు. నాలుగేళ్ల క్రితం ఏ వేదిక నుంచి గాయపడి వీల్‌చైర్‌లో బయటకు వెళ్లాడో... ఇప్పుడు అదే వేదికపై సగర్వంగా విన్నర్స్‌ ట్రోఫీని ఎత్తుకున్నాడు. – సాక్షి క్రీడా విభాగం

ఆరేళ్ల క్రితమే తొలి ప్రయత్నంలోనే అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ ట్రోఫీని ముద్దాడాల్సింది. డొమినిక్‌ థీమ్‌ (ఆ్రస్టియా)తో జరిగిన 2020 యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో జ్వెరెవ్‌ తొలి రెండు సెట్‌లు గెల్చుకున్నాడు. విన్నర్స్‌ ట్రోఫీకి కేవలం ఒక్క సెట్‌ దూరంలో ఉన్నాడు. అయితే జ్వెరెవ్‌ కలను థీమ్‌ భగ్నం చేశాడు. తొలి రెండు సెట్‌లు కోల్పోయినా... పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడిన థీమ్‌ వరుసగా మూడు సెట్‌లు గెలిచి యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌గా అవతరించాడు. జ్వెరెవ్‌ నిరాశగా వెనుదిరిగాడు. 

నాలుగేళ్లు గడిచాయి... 2024లో జ్వెరెవ్‌కు మరో ‘గ్రాండ్‌’ టైటిల్‌ అవకాశం లభించింది. ఈసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌లో... కానీ స్పెయిన్‌ రైజింగ్‌ స్టార్‌ కార్లోస్‌ అల్‌కరాజ్‌ అసాధారణ ప్రదర్శన ముందు జ్వెరెవ్‌ ఎదురునిలువ లేకపోయాడు. చివరి రెండు సెట్‌లు చేజార్చుకున్న జ్వెరెవ్‌ టైటిల్‌ను కూడా వదులుకున్నాడు. ఏడాది తిరిగేలోపు 2025 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో జ్వెరెవ్‌ ముచ్చటగా మూడో ‘గ్రాండ్‌’ చాన్స్‌ లభించింది. కానీ ఇటలీ స్టార్‌ యానిక్‌ సినెర్‌ ధాటికి జ్వెరెవ్‌ వరుస సెట్‌లలో చేతులెత్తేశాడు. మూడోసారి నిరాశతో ఇంటిదారి పట్టాడు.  

ఈసారి వదల్లేదు... 
కెరీర్‌లో 41వసారి గ్రాండ్‌స్లామ్‌ ఆడేందుకు జ్వెరెవ్‌ 11వసారి పారిస్‌కు వచ్చాడు. డిఫెండింగ్‌ చాంపియన్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌) గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. ప్రపంచ నంబర్‌వన్‌ యానిక్‌ సినెర్‌ (ఇటలీ) రెండో రౌండ్‌లోనే నిష్క్రమించాడు. సెర్బియా దిగ్గజం, 24 గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ నెగ్గిన జొకోవిచ్‌ మూడో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. దాంతో జ్వెరెవ్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ ఈసారి నెరవేరడం లాంఛనమే అనిపించింది.

అనుకున్నట్లే... తన అనుభవాన్నంతా రంగరించి పోరాడిన జ్వెరెవ్‌ కెరీర్‌లో ఆడిన 41వ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో విజేత ట్రోఫీని అందుకున్నాడు. 2022 ఫ్రెంచ్‌ ఓపెన్‌ సెమీఫైనల్‌ సందర్భంగా స్పెయిన్‌ దిగ్గజం రాఫెల్‌ నాదల్‌థో సెమీఫైనల్‌ ఆడుతూ జ్వెరెవ్‌ జారిపడ్డాడు. గాయంతో చక్రాల కుర్చీతో మైదానాన్ని వీడాడు. ఇప్పుడు అదే మట్టికోర్టులో కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచాడు. జ్వెరెవ్‌ అద్భుత ప్రస్థానంలో కొన్ని ఆసక్తికర విషయాలను పరిశీలిస్తే...  

టెన్నిస్‌ ఫ్యామిలీ... 
జ్వెరెవ్‌ది అసలు సిసలు టెన్నిస్‌ కుటుంబం. అతడి తల్లిదండ్రులు ఇరినా జ్వెరెవా, అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ సీనియర్‌ ఇద్దరూ ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ ప్లేయర్లే. ఈ జంట సోవియట్‌ యూనియన్‌ తరఫున ఆడింది. ఇక జ్వెరెవ్‌ సోదరుడు మిషా జ్వెరెవ్‌ కూడా ప్రొఫెషనల్‌ ఆటగాడే. అతడు ఏటీపీ టూర్‌లో పలు విజయాలు సాధించాడు. అతడి కుటుంబం భిన్న సంస్కృతులకు నెలవు. జ్వెరెవ్‌ ఇంట్లో మూడు భాషలు మాట్లాడుతారు. జర్మనీలో పుట్టి పెరగడంతో జర్మన్‌తో పాటు మూలాల కారణంగా రష్యన్, ఇంగ్లిష్ లో ధారాళంగా మాట్లాడగలరు. 

అమ్మ దిద్దిన చాంపియన్‌... 
ఇంట్లో అందరూ టెన్నిస్‌ ప్లేయర్‌లే కాగా... జ్వెరెవ్‌ ఆది గురువు మాత్రం తల్లే! శరీర దారుఢ్యంపై తండ్రి దృష్టి పెడితే... తల్లి ఇరినా మాత్రం అతడికి టెన్నిస్‌లో ఓనమాలు నేర్పింది. సుదీర్ఘ కాలం ఆటలో కొనసాగాలంటే తనకంటూ కొన్ని ప్రత్యేక షాట్‌లు ఉండాలని బలంగా నమ్మిన ఇరినా... జ్వెరెవ్‌కు బ్యాక్‌హ్యాండ్‌ షాట్‌ను పదేపదే ప్రాక్టీస్‌ చేయించేది. ఆమె కృషి వల్లే బ్యాక్‌హ్యాండ్‌ పవర్‌ ఫుల్‌ షాట్‌ తనకు అలవడిందని జ్వెరెవ్‌ గతంలో పలుమార్లు వెల్లడించాడు. చిన్నప్పుడు బాగా చురుకుగా ఉండే జ్వెరెవ్‌... ఓటమిని అస్సలు అంగీకరించలేకపోయేవాడని సోదరుడు మిషా తెలిపాడు. పసితనంలో జ్వెరెవ్‌ తన చేతిలో ఓడిపోతే... గెలిచే వరకు టెన్నిస్‌ కోర్టు వీడేవాడు కాదని గుర్తుచేసుకున్నాడు. 

హాకీ, ఫుట్‌బాల్‌ వదిలేసి... 
అందరు పిల్లల్లాగే చిన్నప్పుడు వేర్వేరు క్రీడలను ఇష్టపడ్డ జ్వెరెవ్‌.. టెన్నిస్‌తో పాటు హాకీ, ఫుట్‌బాల్‌ కూడా ఆడేవాడు. అయితే 12 ఏళ్ల ప్రాయంలో ఫ్లోరిడాలో జరిగిన ఒక జూనియర్‌ టోర్నమెంట్‌లో జ్వెరెవ్‌ తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు. దీంతో టెన్నిస్‌పై కసి పెంచుకున్న అతడు ... మిగిలిన క్రీడలను పక్కనపెట్టి వంద శాతం టెన్నిస్‌పైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడు.  

ఫ్యాషన్‌లోనూ తనదైన శైలి 
కోర్టులో ఆటతో పాటు... కోర్టు బయట ఫ్యాషన్‌తోనూ జ్వెరెవ్‌ భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా 2017 యూఎస్‌ ఓపెన్‌ సందర్భంగా అతడి ఫ్యాషన్‌... సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయింది. 1970 నాటి స్టయిల్‌లో అతడి డ్రెస్సింగ్‌ స్టయిల్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. ప్రముఖ సంగీత కళాకారుడు, డిజైనర్‌ ఫారెట్‌ విలియమ్స్‌ జ్వెరెవ్‌ కోసం ప్రత్యేకంగా దుస్తువులు డిజైన్‌ చేస్తాడు.  

ప్రత్యేక అతిథిలా....
జ్వెరెవ్‌కు కుక్కలంటే చాలా ఇష్టం. ఏటీపీ టూర్‌ టోర్నమెంట్‌లలో జ్వెరెవ్‌ తరచూ తన పెంపుడు కుక్క ‘లోవిక్‌’తో దర్శనమిస్తాడు. లోవిక్‌కు అతడి జీవితంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఎంతగానంటే... తనతో పాటు కోర్టులో తిరగడానికి దానికి ప్రత్యేక అతిథిగా అనుమతి పత్రాలు సైతం తీసుకున్నాడు.

ముందే ఒలింపిక్‌ స్వర్ణం
గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలవడానికి ముందే జ్వెరెవ్‌... ఒలింపిక్‌ స్వర్ణం నెగ్గాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో జ్వెరెవ్‌ పసిడి పతకం సాధించి... పురుషుల సింగిల్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి జర్మనీ ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో సెమీఫైనల్లో అతడు... సెర్బియా దిగ్గజం జొకోవిచ్‌ను ఓడించి ముందంజ వేశాడు. 

డయాబెటీస్‌తో పోరాడుతూ
నాలుగేళ్ల వయసు నుంచే టైప్‌–1 డయాబెటీస్‌తో ఇబ్బందిపడుతున్న జ్వెరెవ్‌... ఆ విషయాన్ని 2022లో బహిరంగంగా వెల్లడించాడు. కెరీర్‌లో చాలా వరకు మ్యాచ్‌ల విరామంలో వైద్యుల సూచన మేరకు ఇన్సులిన్‌ తీసుకున్నట్లు తెలిపాడు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని పిల్ల్లలకు ఇన్సులిన్‌తో పాటు మరికొన్ని అత్యవసర మందులు అందించాలనే లక్ష్యంతో అతడు ‘అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌’ ఫౌండేషన్‌ను స్థాపించాడు.  

Advertisement
 
Advertisement
Advertisement