ప్రతీకారం తీర్చుకున్న సిరాజ్‌.. ఓవల్‌లో భారత్‌ చారిత్రాత్మక విజయం | Mohammed Siraj picks 5-wicket haul as IND beat ENG by 6 runs | Sakshi
Sakshi News home page

IND vs ENG: ప్రతీకారం తీర్చుకున్న సిరాజ్‌.. ఓవల్‌లో భారత్‌ చారిత్రాత్మక విజయం

Aug 4 2025 5:38 PM | Updated on Aug 4 2025 8:15 PM

Mohammed Siraj picks 5-wicket haul as IND beat ENG by 6 runs

ఆండ‌ర్స‌న్‌-టెండూల్క‌ర్ ట్రోఫీలోని ఆఖరి మ్యాచ్ అభిమానుల‌కు అస‌లు సిస‌లైన టెస్టు క్రికెట్‌ మ‌జాను అందించింది. చివ‌రి వ‌ర‌కు నువ్వా నేనా అన్న‌ట్లు సాగిన ఐదో టెస్టులో ఇంగ్లండ్‌పై 6 ప‌రుగుల తేడాతో టీమిండియా సంచ‌ల‌న విజ‌యం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల‌ టెస్టు సిరీస్ 2-2తో స‌మమైంది. ఈ విజ‌యంలో టీమిండియా పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్‌ది కీల‌క పాత్ర‌.

సిరాజ్ అద్భుతం..
లార్డ్స్ టెస్టులో బ్యాట్‌తో జ‌ట్టును గెలిపించ‌లేక‌పోయిన సిరాజ్‌.. ఓవ‌ల్‌లో మాత్రం బంతితో త‌న జ‌ట్టుకు చారిత్ర‌త్మ‌క విజ‌యాన్ని అందించాడు. ఈ కీల‌క పోరులో సిరాజ్ సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. బుమ్రా లేని లోటును తెలియ‌నివ్వ‌లేదు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టిన సిరాజ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల‌తో స‌త్తాచాటాడు. మొత్తంగా 9 వికెట్లు ప‌డ‌గొట్టి ప్లేయ‌ర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు.

తొలి ఓవ‌ర్‌లోనే.. 
ఆఖ‌రి రోజు ఆట‌లో ఇంగ్లండ్ విజ‌యానికి 35 ప‌రుగులు అవ‌స‌ర‌మవ్వ‌గా.. భార‌త్ 4 వికెట్లు కావాల్సి వ‌చ్చాయి. క్రీజులో జేమీ ఓవ‌ర్ట‌న్‌, స్మిత్ ఉండ‌గా.. తొలి ఓవ‌ర్ వేసే బాధ్య‌త‌ను ప్ర‌సిద్ద్ కృష్ణకు గిల్ అప్పగించాడు. అయితే ఆ ఓవర్‌లో ప్రసిద్ద్ వేసిన తొలి బంతినే ఓవర్టన్ బౌండరీకి తరలించాడు. 

ఆ తర్వాత నాలుగో బంతికి ఫోర్ రావడంతో ఓ ఓవర్‌లో ఇంగ్లండ్‌కు 8 పరుగులు లభించాయి.  ఇంగ్లండ్ విజయసమీకరణం 27 పరుగులు మారింది. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌తో పాటు అభిమానుల్లో టెన్షన్ నెలకొంది.

మియా ఎంట్రీ..
ఈ సమయంలో ఎంట్రీ ఇచ్చిన సిరాజ్ మియా.. తన వేసిన తొలి ఓవర్‌లోనే స్మిత్‌ను ఔట్ చేసి భారత శిబిరంలో గెలుపు ఆశలు చిగురించేలా చేశాడు. ఆ తర్వాత జేమీ ఓవర్టన్‌ను సిరాజ్ అద్బుతమైన ఎల్బీగా పెవిలియన్‌కు పంపాడు. ఈ సమయంలో సిరాజ్‌కు ప్రసిద్ద్ తోడయ్యాడు.

సంచలన బంతితో టెయిలాండర్ టంగ్‌ను ప్రసిద్ద్  బోల్తా కొట్టించాడు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో గాయపడిన క్రిస్ వోక్స్ బ్యాటింగ్‌కు వచ్చాడు. భుజం ఎముక విరిగినప్పటికి తన జట్టు కోసం వోక్స్ మైదానంలో అడుగుపెట్టాడు. 

England Vs India: ఉత్కంఠ పోరులో భారత్ ఘనవిజయం

నొప్పిని భరిస్తూనే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో అట్కిన్సన్‌కు సపోర్ట్‌గా వోక్స్ నిలిచాడు. అనంతరం 84వ ఓవర్‌లో సిరాజ్ బౌలింగ్‌లో అట్కిన్సన్   సిక్సర్ కొట్టడంతో మళ్లీ టెన్షన్ నెలకొంది. అంతకుతోడు ధ్రువ్ జురెల్ రనౌట్ మిస్‌ చేయడంతో ఉత్కంఠ మరింత పెరిగింది.

కానీ 86వ ఓవర్ వేసిన సిరాజ్ మియా.. అద్బుతమైన బంతితో అట్కిన్సన్‌ను బౌల్డ్ చేసి అభిమానుల ఉత్కంఠకు తెరదించాడు. దీంతో 374 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 367 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో సిరాజ్‌తో పాటు ప్రసిద్ద్‌ కృష్ణ 8 వికెట్లతో సత్తాచాటాడు.
చదవండి: ENG Vs IND: క్రికెట్‌ చరిత్రలో అత్యంత సాహసోపేతమైన ఎంట్రీ.. ఒంటిచేత్తో బ్యాటింగ్‌కు దిగిన వోక్స్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement