
భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఎంట్రీకి వేదికైంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాడు క్రిస్ వోక్స్ భుజం విరిగినప్పటికీ ఒంటిచేత్తో బ్యాటింగ్‌కు దిగి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆట చివరి రోజు ఇంగ్లండ్ గెలుపుకు 18 పరుగులు అవసరమైన దశలో వోక్స్ 11వ నంబర్ ఆటగాడిగా ఎంట్రీ ఇచ్చాడు. అతని ఎంట్రీ సినిమా ఎలివేషన్‌ను తలపించింది.
వోక్స్ బ్యాటింగ్ చేయలేకపోయినా స్ట్రయిక్ రొటేట్ చేసి ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నించాడు. అయితే దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ భారత్ చేతిలో 6 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఫలితంగా భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసుకుంది.
ఇదే సిరీస్ నాలుగో టెస్ట్‌లో టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్ కూడా పాదం ఫ్రాక్చర్ అయినప్పటికీ జట్టు ప్రయోజనాల కోసం బరిలోకి దిగి అందరి మన్ననలు అందుకున్నాడు. 1984లో విండీస్ ఆటగాడు మాల్కమ్ మార్షల్ కూడా వోక్స్ తరహాలోనే ఒంటిచేత్తో బ్యాటింగ్‌కు దిగాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో మార్షల్ ఒంటిచేత్తో బౌండరీ బాదిన సన్నివేశాన్ని క్రికెట్ ప్రపంచం ఎన్నటికీ మరిచిపోదు.
Arm in a sling, Chris Woakes has arrived to the crease 😱 pic.twitter.com/D4QDscnfXE
— Sky Sports Cricket (@SkyCricket) August 4, 2025
మ్యాచ్ విషయానికొస్తే.. ఓవల్ వేదికగా జరిగిన ఐదో టెస్ట్ హోరాహోరీగా సాగింది. 374 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ వీరోచితంగా పోరాడినప్పటికీ లక్ష్యానికి 8 పరుగుల దూరంలో నిలిచిపోయింది. హ్యారీ బ్రూక్ (111), జో రూట్ (105) అద్బుతమైన శతకాలతో గెలుపుకు గట్టి పునాది వేసినా చివరి వరుస బ్యాటర్లు విఫలం కావడంతో ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు.
టీమిండియా పేసర్లు అద్బుతంగా బౌలింగ్ చేసి ఇంగ్లండ్ బ్యాటర్లను కట్టడి చేశారు. ముఖ్యంగా సిరాజ్ చివరి రోజు సింహంలా గర్జించి ముగ్గురు ఇంగ్లండ్ బ్యాటర్లను ఔట్ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో సిరాజ్ మొత్తంగా ఐదు వికెట్లు తీశాడు. అతనికి ప్రసిద్ద్ కృష్ణ (27-3-126-4), ఆకాశ్‌దీప్ (20-4-85-1) సహకరించాడు.
అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్‌దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.
దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ 1,3 మ్యాచ్‌లు గెలువగా.. భారత్ 2, 5 మ్యాచ్‌ల్లో నెగ్గింది. నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది.