
ఐపీఎల్-2025 సీజన్ మధ్యలో నిలిచిపోవడంతో ప్రస్తుతం అందరి దృష్టి భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌పై మళ్లింది. ఈ ఏడాది జూన్‌లో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు ఇంగ్లండ్ పర్యటనకు భారత జట్టు వెళ్లనుంది. ఈ రెడ్ బాల్ క్రికెట్ సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ సిరీస్‌కు భారత జట్టును మే 23న బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించనుంది.
అదే రోజున భారత కొత్త టెస్టు కెప్టెన్ పేరును కూడా బీసీసీఐ వెల్లడించింది. రోహిత్ శర్మ టెస్టు క్రికెట్ విడ్కోలు పలకడంతో కెప్టెన్ ఎంపిక ఇప్పుడు అనివార్యమైంది. టీమిండియా టెస్టు కెప్టెన్‌గా స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఎంపిక దాదాపు ఖాయమైంది. గిల్ ఇప్పటికే హెడ్ కోచ్ గౌతం గంభీర్, ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో సమావేశమయ్యాడు.
ఇక ఇది ఇలా ఉండగా.. ఇంగ్లండ్ సిరీస్‌కు భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. షమీ వైట్‌బాల్ క్రికెట్‌లో ఆడుతున్నప్పటికీ, సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడేంత ఫిట్‌నెస్ ఇంకా సాధించలేదని పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. వన్డే ప్రపంచకప్-2023 తర్వాత గాయం కారణంగా ఏడాది పాటు ఆటకు షమీ దూరంగా ఉన్నాడు.
ఆ తర్వాత ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌తో పునరాగమనం చేశాడు. అనంతరం ఛాంపియన్స్ ట్రోఫీలో ఫర్వాలేదన్పించాడు. వికెట్లు పడగొట్టినప్పటికి అంత రిథమ్‌లో మాత్రం షమీ కన్పించలేదు. అదేవిధంగా ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న షమీ.. అక్కడ కూడా పూర్తిగా తేలిపోతున్నాడు.
నెట్ ప్రాక్టీస్‌లో షమీ బాగా అలిసిపోతున్నాడని, తన రన్-అప్‌లను పూర్తి చేయడానికి ఇబ్బంది పడుతున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తమ కథనంలో పేర్కొంది. అంతేకాకుండా చిన్న స్పెల్‌ల తర్వాత డగౌట్‌లకు తిరిగి వస్తున్నాడని, అందుకే ఇంగ్లండ్ టూర్‌కు అతడి ఎంపికయ్యేది అనుమానంగా మారిందని టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. షమీ స్దానంలో ప్రసిద్ద్ కృష్ణను సెలక్టర్లు ఎంపిక చేసే అవకాశముంది.
చదవండి: IPL 2025: ఆటగాళ్లను రప్పించండి.. ఫ్రాంఛైజీలకు బీసీసీఐ ఆదేశాలు?