
కావ్యా మారన్ నేతృత్వంలోని సన్ గ్రూప్ ఇంగ్లండ్ వేదికగా జరిగే ద హండ్రెడ్ లీగ్‌లో నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ అనే ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. ఈ ఫ్రాంచైజీలో మొత్తం వాటాను సన్ గ్రూప్ రూ. 1,094 కోట్లకు చేజిక్కించుకుంది. హండ్రెడ్ లీగ్‌లోని 8 ఫ్రాంచైజీల్లో నాలుగింటిని భారత కంపెనీలు (ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్లు కూడా) కొనుగోలు చేయగా.. మరో రెండు ఫ్రాంచైజీలను భారతీయ-అమెరికన్ పెట్టుబడిదారులు సొంతం చేసుకున్నారు.
ఇంతవరకు అంతా బాగానే ఉంది. ఇవాల్టి నుంచి (ఆగస్ట్ 5) ప్రారంభం కాబోయే 2025 సీజన్ కోసం కావ్యా మారన్ ఓనర్షిప్లోని నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ ఇద్దరు పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లను ఎంపిక చేసుకోవడంతో వివాదం మొదలైంది. నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ బెన్ డ్వార్షుయిస్ (ఆస్ట్రేలియా), మిచెల్ సాంట్నర్‌కు (న్యూజిలాండ్) ప్రత్యామ్నాయంగా పాక్ మాజీలు మొహమ్మద్ ఆమిర్, ఇమాద్ వసీంలను ఎంపిక చేసుకొని భారత అభిమానులచే సోషల్మీడియా వేదికగా ట్రోలింగ్ను ఎదుర్కొంటుంది.
ఈ సీజన్కు ముందు మెజార్టీ శాతం ఫ్రాంచైజీలను భారత ఇన్వెస్టర్లు చేజిక్కించుకోవడంతో వేలంలో ఏ పాకిస్తాన్ ఆటగాడికి అవకాశం దక్కలేదు. ఫ్రాంచైజీలు పరోక్షంగా పాక్ ఆటగాళ్లను బ్యాన్ చేశాయి. అయితే మధ్యలో నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ పాక్ ఆటగాళ్లను అక్కున చేర్చుకోవడంతో భారతీయులు మండిపడుతున్నారు.
పహల్లాం దాడి తర్వాత పాక్తో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ అన్ని క్రీడా విభాగాల్లో దాయాదిని బ్యాన్ చేసింది. ఇటీవల ఇంగ్లండ్లో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలోనూ గ్రూప్ దశ, సెమీస్లో మ్యాచ్లను బాయ్‌కాట్ చేసింది.
ఇలాంటి పరిస్థితుల్లో కావ్యా మారన్ జట్టు పాక్ ఆటగాళ్లను అక్కున చేర్చుకోవడం భారతీయులకు అస్సలు నచ్చడం లేదు. భారతీయ పెట్టుబడి దారులు లేదా ఐపీఎల్ ఓనర్లు కొనుగోలు చేసిన వేర్వేరు లీగ్ల్లోని ఏ ఫ్రాంచైజీలో కూడా పాక్ ఆటగాళ్లకు ప్రవేశం లేదు. ఐపీఎల్ ఓనర్లు కొనుగోలు చేసిన సౌతాఫ్రికా టీ20 లీగ్ ఫ్రాంచైజీల్లో అయితే పాక్ ఆటగాళ్ల ఊసే లేదు.
కావ్యా మారన్ పాక్ ఆటగాళ్లను జట్టులో చేర్చుకొని పెద్ద తప్పే చేసిందని భారతీయులు అంటున్నారు. ఈ సీజన్లో నార్త్రన్ సూపర్ ఛార్జర్స్‌కు ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ నాయకత్వం వహిస్తున్నాడు. జట్టులో డేవిడ్ మిల్లర్, డేవిడ్ మలాన్ లాంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. ఈ సీజన్లో నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ ఆగస్ట్ 7న తమ తొలి మ్యాచ్ ఆడనుంది.