ఫ్రాంచైజీ క్రికెట్‌లోకి మరో సూపర్ జెయింట్ వచ్చింది. హండ్రెడ్ లీగ్‌లో మాంచెస్టర్ ఒరిజినల్స్ మాంచెస్టర్ సూపర్ జెయింట్స్‌గా మారింది. ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఇప్పటికే రెండు సూపర్ జెయింట్స్ ఉన్నాయి. ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్. ఈ రెండు సహా మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ ఆధినేత సంజీవ్ గొయెంకా చేతుల్లో ఉన్నాయి.
మాంచెస్టర్ ఒరిజినల్స్ మాంచెస్టర్ సూపర్ జెయింట్స్‌గా రూపాంతరం చెందిన తర్వాత కొత్త లోగోను గురువారం ఆవిష్కరించారు. ఇదే సందర్భంలో ఇంగ్లండ్ స్టార్ వికెట్‌కీపర్ జోస్ బట్లర్ (పురుషుల హండ్రెడ్), అదే దేశానికి చెందిన స్పిన్ బౌలర్ సోఫీ ఎక్ల్‌స్టోన్ (మహిళల హండ్రెడ్)ను రిటైన్ చేసుకుంటున్నట్లు ఫ్రాంచైజీ యాజమాన్యం ప్రకటించింది. బట్లర్ మరో సూపర్ జెయింట్‌లోనూ (డర్బన్ సూపర్ జెయింట్స్) భాగంగా ఉన్నాడు.
లక్నో, డర్బన్ సూపర్ జెయింట్స్ లోగోల్లోని బ్రాండింగ్‌కి భిన్నంగా మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ లోగోలో ఏనుగు ప్రతీక ఉండటం గమనించదగ్గ విషయం. మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ లోగో ఆవిష్కరణ సందర్భంగా ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయంకా మాట్లాడుతూ.. మాంచెస్టర్ ఒక గొప్ప క్రీడా నగరం. సూపర్ జెయింట్స్ కుటుంబంలో భాగమవ్వడం గర్వకారణం. జోస్ బట్లర్ వంటి ఆటగాళ్లు మా జట్టులో ఉండటం ఆనందదాయకమిని పేర్కొన్నారు.
మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ బట్లర్, ఎక్లెస్టోన్‌తో పాటు మరికొంత మందిని కూడా రీటైన్ చేసుకుంది. పురుషుల విభాగంలో హెన్రిచ్ క్లాసెన్, నూర్ అహ్మద్‌ను తిరిగి దక్కించుకుంది. కొత్తగా పురుషుల విభాగంలో లియామ్ డాసన్.. మహిళల విభాగంలో మెగ్ లాన్నింగ్, స్మృతి మంధనను జట్టులోకి తీసుకుంది.
కాగా, మాంచెస్టర్ ఒరిజినల్స్ మాంచెస్టర్ సూపర్ జెయింట్స్‌గా రూపాంతరం చెందక ముందు మరో రెండు హండ్రెడ్ లీగ్ ఫ్రాంచైజీల పేర్లు మారాయి. ముంబై ఇండియన్స్ ఓనర్షిప్‌లో నడిచే ఓవల్ ఇన్విన్సిబుల్స్ ఎంఐ లండన్‌గా, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్షిప్‌లో నడిచే నార్తర్న్ సూపర్‌చార్జర్స్ సన్‌రైజర్స్ లీడ్స్‌గా రూపాంతరం చెందాయి.
జులై 21 నుంచి ప్రారంభం
ది హండ్రెడ్ లీగ్ 2026 పురుషులు, మహిళల విభాగాల్లో జులై 21 నుంచి ప్రారంభం కానుంది. అన్ని ఫ్రాంచైజీలకు జనవరి చివరి వరకు నాలుగు ప్రీ-ఆక్షన్ సైనింగ్‌లకు అవకాశం ఉంది. ప్రధాన ఆక్షన్ మార్చిలో జరగనుంది.


