పాకిస్తాన్‌ హెడ్‌ కోచ్‌గా ఆర్సీబీ మాజీ కోచ్‌ | Mike Hesson Named Pakistan New White Ball Coach | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ హెడ్‌ కోచ్‌గా ఆర్సీబీ మాజీ కోచ్‌

May 13 2025 4:45 PM | Updated on May 13 2025 5:27 PM

Mike Hesson Named Pakistan New White Ball Coach

పాకిస్తాన్‌ పరిమిత ఓవర్ల జట్ల హెడ్‌ కోచ్‌గా ఆర్సీబీ మాజీ హెడ్‌ కోచ్‌ మైక్‌ హెస్సన్‌ (న్యూజిలాండ్‌) నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు మొహిసిన్‌ నఖ్వీ ఇవాళ (మే 13) వెల్లడించారు. 50 ఏళ్ల హెస్సెన్‌ మే 26న బాధ్యతలు చేపడతారు. పాకిస్తాన్‌ హెడ్‌ కోచ్‌గా హెస్సన్‌ కాంట్రాక్ట్‌ ఎంత వరకు ఉంటుందో తెలియరాలేదు.

కోచ్‌గా హెస్సన్‌కు ఘనమైన ట్రాక్‌ రికార్డు ఉంది. 2012 నుండి 2018 వరకు అతను న్యూజిలాండ్‌ జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు. హెస్సన్‌ కోచ్‌గా ఉండగా న్యూజిలాండ్‌ అద్భుత విజయాలు సాధించి మూడు ఫార్మాట్లలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. హెస్సన్‌కు ఐపీఎల్‌లోనూ మంచి ట్రాక్‌ రికార్డే ఉంది. 2019 నుంచి 2023 సీజన్‌ వరకు అతను ఆర్సీబీ హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు నిర్వహించాడు.

ప్రస్తుతం హెస్సన్‌ పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇస్లామాబాద్‌ యునైటెడ్‌కు హెడ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. హెస్సన్‌కు ముందు పాక్‌ పరిమిత ఓవర్ల హెడ్‌ కోచ్‌గా ఆకిబ్‌ జావిద్‌ వ్యవహరించాడు. గతేడాది అక్టోబర్‌లో అప్పటి హెడ్‌ కోచ్‌ గ్యారీ కిర్‌స్టన్‌ ఆకస్మికంగా రాజీనామా చేయడంతో ఆకిబ్‌ జావిద్‌ తాత్కాలిక హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు నిర్వహించాడు. 

హెస్సన్‌ కొత్త కోచ్‌గా నియమితుడు కావడంతో తాత్కాలిక కోచ్‌ ఆకిబ్‌ జావిద్‌ పాక్‌ క్రికెట్‌ జట్టు హై పెర్ఫార్మెన్స్‌ డైరెక్టర్‌గా నియమితుడయ్యాడు. ఈ హోదాలో అతను పాక్‌ సెలెక్షన్‌ కమిటీలోనూ భాగస్తుడు కావచ్చు.

పాక్‌ పరిమిత ఓవర్ల జట్లకు హెడ్‌ కోచ్‌గా హెస్సన్‌ ప్రయాణం త్వరలో బంగ్లాదేశ్‌తో జరుగబోయే సిరీస్‌ నుంచి ప్రారంభమవుతుంది. అయితే భారత్‌, పాక్‌ మధ్య యుద్దం, తదనంతర పరిస్థితుల కారణంగా ఈ సిరీస్‌ షెడ్యూల్‌ మారే అవకాశం ఉంది. 

ప్రస్తుతమున్న సమాచారం​ మేరకు పాక్‌, బంగ్లాదేశ్‌ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ మే 25, 27, 30, జూన్‌ 1, 3 తేదీల్లో జరుగనుంది. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌లు ఫైసలాబాద్‌, మిగతా మూడు మ్యాచ్‌లు లాహోర్‌లో జరుగనున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement