MI: బుమ్రా, హార్దిక్‌ను వదిలేద్దామంటే.. రోహిత్‌ శర్మనే అడ్డుకున్నాడు!

MI Were To Release Bumrah Hardik: Parthiv Patel Spills Beans Before IPL 2024 - Sakshi

‘‘రోహిత్‌ శర్మ తన జట్టులోని ఆటగాళ్లకు ఎల్లప్పుడూ అండగా ఉంటాడు. అందుకు జస్‌ప్రీత్‌ బుమ్రా, హార్దిక్‌ పాండ్యా సరైన ఉదాహరణలు. 2014లో బుమ్రా తొలిసారి ముంబై ఇండియన్స్‌తో చేరాడు.

అయితే, 2015లో అతడికి ఆడే అవకాశం వచ్చింది. కానీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఫలితంగా అతడిని సీజన్‌ మధ్యలోనే రిలీజ్‌ చేస్తారనే చర్చ నడిచింది. 

అప్పుడు రోహిత్‌ శర్మ కలుగుజేసుకుని.. బుమ్రా జట్టుతో ఉండేలా యాజమాన్యాన్ని ఒప్పించాడు. రోహిత్‌ నమ్మకాన్ని నిలబెడుతూ 2016లో బుమ్రా తన ప్రదర్శనను తారస్థాయికి తీసుకువెళ్లడం తెలిసిందే.

హార్దిక్‌ పాండ్యా విషయంలోనూ ఇలాగే జరిగింది. 2015లో అతడు జట్టుతో చేరినపుడు పర్లేదనిపించాడు. కానీ 2016లో అతడి కెరీర్‌ చెత్తగా సాగింది. అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌ ప్రదర్శన ఇలా ఉన్నపుడు ఫ్రాంఛైజీ కచ్చితంగా అతడిని వదిలించుకోవాలని భావించడం సహజం. 

తర్వాత దేశవాళీ క్రికెట్‌లో ప్రదర్శన ఆధారంగా మళ్లీ తిరిగి తీసుకోవాలా వద్దా అనేది నిర్ణయించుకుంటుంది. అయితే, పాండ్యా విషయంలో రోహిత్‌ శర్మ ఇలా జరుగనివ్వలేదు. ఇప్పుడు వాళ్లిద్దరు ఏ స్థాయిలో ఉన్నారో చూస్తూనే ఉన్నాం కదా’’ అని టీమిండియా మాజీ క్రికెటర్‌ పార్థివ్‌ పటేల్‌ అన్నాడు.

జస్‌ప్రీత్‌ బుమ్రా, హార్దిక్‌ పాండ్యాల కెరీర్‌ ఆరంభంలో ముంబై ఇండియన్స్‌ సారథిగా ఉన్న రోహిత్‌ శర్మ వారికి అండగా నిలబడ్డాడని గుర్తు చేసుకున్నాడు. ముంబై ఫ్రాంఛైజీ ఈ ఇద్దరినీ వదిలివేయాలని భావించినపుడు రోహిత్‌ అడ్డుచెప్పాడని తెలిపాడు. అతడు జోక్యం చేసుకోవడం వల్లే బుమ్రా, పాండ్యా ముంబైతో కొనసాగారని పేర్కొన్నాడు.

జియో సినిమా షోలో భాగంగా మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ పార్థివ్‌ పటేల్‌.. మరో మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా.. 2015- 17 వరకు పార్థివ్‌ పటేల్‌ కూడా ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే.

కాగా ముంబై ఇండియన్స్‌కు ఐదుసార్లు ట్రోఫీ అందించిన ఘనత రోహిత్‌ శర్మ సొంతం. అయితే, ఐపీఎల్‌-2024 ఆరంభానికి ముందే అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించిన ఫ్రాంఛైజీ.. గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి ట్రేడ్‌ చేసుకున్న హార్దిక్‌ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది.

ఈ నేపథ్యంలో పార్థివ్‌ పటేల్‌ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే.. మార్చి 22న ఐపీఎల్‌ తాజా సీజన్‌ ఆరంభం కానుండగా.. 24న ముంబై తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. గుజరాత్‌ టైటాన్స్‌తో అహ్మదాబాద్‌ వేదికగా పోటీ పడనుంది.

చదవండి: రిటైర్మెంట్‌ ప్రకటించిన స్టార్‌ క్రికెటర్‌.. ఇకపై

Election 2024

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top