రిటైర్మెంట్‌ ప్రకటించిన స్టార్‌ క్రికెటర్‌.. ఇకపై | Matthew Wade to Retire From First Class Cricket Targets T20 WC 2024 | Sakshi
Sakshi News home page

రిటైర్మెంట్‌ ప్రకటించిన స్టార్‌ క్రికెటర్‌.. ఇకపై

Published Fri, Mar 15 2024 1:40 PM | Last Updated on Fri, Mar 15 2024 3:32 PM

Matthew Wade to Retire From First Class Cricket Targets T20 WC 2024 - Sakshi

ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ మాథ్యూ వేడ్‌ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. టెస్టు ఫార్మాట్‌ నుంచి తాను వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు. అయితే, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం కొనసాగుతానని వేడ్‌ స్పష్టం చేశాడు.

‘‘సంప్రదాయ ఫార్మాట్‌లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడాన్ని ఎంతగానో ఆస్వాదించాను. వైట్‌బాల్‌ క్రికెట్‌లో కొనసాగినా.. బ్యాగీ గ్రీన్‌తో దేశం తరఫున బరిలోకి దిగడమే నా కెరీర్‌లో ఎప్పటికైనా హైలైట్‌గా నిలుస్తుంది’’ అని మాథ్యూ వేడ్‌ ఉద్వేగపూరిత ప్రకటన చేశాడు. 

ఆస్ట్రేలియా తరఫున టెస్టులు ఆడటం అంతర్జాతీయ కెరీర్‌లో తనకు అత్యంత ప్రత్యేకమైందని పేర్కొన్నాడు. ది షెఫీల్డ్‌ షీల్డ్‌ టోర్నీలో టాస్మానియా- వెస్టర్న్‌ ఆస్ట్రేలియా మధ్య మార్చి 21న మొదలుకానున్న ఫైనల్‌ మ్యాచ్‌ తన రెడ్‌ బాల్‌ క్రికెట్‌లో ఆఖరిదని వేడ్‌ వెల్లడించాడు. 

కాగా 2012లో ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో అడుగుపెట్టిన వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మాథ్యూ వేడ్‌.. 2021లో తన చివరి మ్యాచ్‌ ఆడాడు. అలెక్స్‌ క్యారీ రాకతో అతడికి అవకాశాలు సన్నగిల్లాయి.

ఈ క్రమంలో టీమిండియాతో గాబా మైదానంలో ఆఖరిగా టెస్టు మ్యాచ్‌ బరిలో దిగాడు. ఇక కెరీర్‌లో మొత్తంగా 36 టెస్టులు ఆడిన మాథ్యూ వేడ్‌.. 1613 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. 

ఇక పరిమిత ఓవర్ల క్రికెట్‌ విషయానికొస్తే.. టీ20 ఫార్మాట్లో ఫినిషర్‌గా వేడ్‌ గుర్తింపు పొందాడు. టీ20 వరల్డ్‌కప్‌ 2021 టోర్నీలో ఆస్ట్రేలియా టైటిల్‌ గెలవడంలో అతడిదే కీలక పాత్ర. పాకిస్తాన్‌తో సెమీ ఫైనల్లో కేవలం 17 బంతుల్లోనే 41 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును ఫైనల్‌కు చేర్చాడు. కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోయే ఇన్నింగ్స్‌ అది!

ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌కు మాథ్యూ వేడ్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే, తాజా ఎడిషన్‌ ఆరంభ మ్యాచ్‌లకు మాత్రం అతడు దూరం కానున్నాడు. ఇక టీ20 వరల్డ్‌కప్‌-2024లో సత్తా చాటడమే లక్ష్యంగా పెట్టుకున్న మాథ్యూ వేడ్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.

చదవండి: హార్దిక్‌ రిటైర్‌ అవ్వటమే బెటర్‌: భారత మాజీ పేసర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement