
శరీరాకృతిపై మరింత శ్రద్ధ పెట్టిన మన్‌ప్రీత్ సింగ్
ఏడు కేజీల బరువు తగ్గిన భారత హాకీ స్టార్
కెరీర్‌ను పొడిగించుకునేందుకే ఈ కసరత్తులు
వచ్చే ఆసియా క్రీడల్లో పతకమే లక్ష్యంగా ముందుకు
న్యూఢిల్లీ: ఆటలో కొత్తగా వస్తున్న మార్పులను ఆహ్వానిస్తూ... ఫిట్‌నెస్ కాపాడుకోవడం ద్వారానే ఇంకా జాతీయ హాకీ జట్టుకు ప్రాతినిధ్యం వహించగలుగుతున్నానని మన్‌ప్రీత్ సింగ్ అన్నాడు. భారత్ తరఫున అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన జాబితాలో మన్‌ప్రీత్ 402 మ్యాచ్‌లతో రెండో స్థానంలో ఉండగా... మాజీ కెప్టెన్ , ప్రస్తుత హాకీ ఇండియా (హెచ్‌ఐ) అధ్యక్షుడు దిలీప్ టిర్కీ 412 మ్యాచ్‌లాడి అగ్రస్థానంలో ఉన్నాడు. త్వరలోనే టిర్కీని దాటేయనున్న మన్‌ప్రీత్... ప్రస్తుతానికి వచ్చే ఏడాది జరగనున్న ఆసియా క్రీడలపై దృష్టి సారించాడు.
కఠినమైన సాధనతో పాటు కఠోరమైన ఆహార నియమాలతో ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటున్నట్లు వెల్లడించాడు. 2020 టోక్యో ఒలింపిక్స్ కాంస్యం గెలిచిన భారత జట్టుకు సారథిగా వ్యవహరించిన మన్‌ప్రీత్... 2024 పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 14 ఏళ్లుగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న 32 ఏళ్ల మన్‌ప్రీత్ పంచుకున్న విశేషాలు అతడి మాటల్లోనే...
ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి...
2024 పారిస్ ఒలింపిక్స్ తర్వాత కెరీర్‌ను పొడిగించాలంటే ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నా. జట్టులోకి ఎప్పటికప్పుడు యువ ఆటగాళ్లు దూసుకొస్తున్నారు. వారితో పోటీపడి రేసులో నిలవాలంటే ఫిట్‌నెస్ తప్పనిసరి. అనుభవం మంచిదే కానీ, కేవలం అనుభవంతో జాతీయ జట్టులో కొనసాగే పరిస్థితి లేదు. టాలెంట్‌తో పాటు వేగం కూడా అవసరం. శరీరాకృతిని కాపాడుకునేందుకు కఠిన ఆహార నియమాలు పాటిస్తున్నా.
తీపి పదార్థాలు తినడం పూర్తిగా మానేయడంతో పాటు జంక్‌ఫుడ్‌కు స్వస్తి చెప్పా. ‘లో–కార్బ్’ డైట్ ఫాలో అవుతున్నా. వారంలో ఒక్కసారి చాలా తక్కువ మోతాదులో మాత్రమే స్వీట్స్ తీసుకుంటున్నా. కసరత్తులు కూడా క్రమపద్ధతిలో చేస్తున్నా. దీని వల్ల ఏడు కిలోల బరువు తగ్గా. ఆ మార్పు మైదానంలో స్పష్టంగా కనిపిస్తుంది. బరువు తగ్గిన తర్వాత వేగం పెరిగింది. యోయో పరీక్షల్లోనూ ఎంతో మెరుగయ్యా. అందుకే ఇక ముందు కూడా దీన్నే కొనసాగించాలనుకుంటున్నా.
క్రిస్టియానో రొనాల్డో నాకు స్ఫూర్తి...
19 ఏళ్ల వయసులో 2011లో తొలిసారి జాతీయ జట్టుకు ఆడే అవకాశం దక్కింది. అప్పటి నుంచి అంతే ఉత్సాహంతో ఆడుతున్నా. గత రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత జట్టులో భాగమైనందుకు ఆనందంగా ఉంది. ముఖ్యంగా 2020 టోక్యో ఒలింపిక్స్‌లో నా కెప్టెన్సీలో భారత జట్టు 41 ఏళ్ల తర్వాత పతకం గెలవడం ఎప్పటికీ మరచిపోలేనిది. 2028 లాస్‌ఏంజెలిస్ ఒలింపిక్స్ గురించి ఇప్పటినుంచి ఆలోచించడం లేదు.
ప్రస్తుతానికి వచ్చే ఏడాది జరగనున్న ఆసియా క్రీడలపై దృష్టి సారించా. ఇదే ఫిట్‌నెస్ కొనసాగిస్తే అది పెద్ద కష్టం కాదు. నేను ఫిట్‌గా లేనని అనుకుంటే తక్షణమే తప్పుకొని మరో ఆటగాడికి జట్టులో అవకాశమిస్తా. పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోను అభిమానిస్తా. అతడు నలభై ఏళ్ల వయసులోనూ చాలా ఫిట్‌గా ఉంటాడు. అతడే నాకు స్ఫూర్తి. 14 ఏళ్లుగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నా... దీన్ని మరింత పొడిగించేందకు నిరంతరం ప్రత్యేక కసరత్తులు చేస్తున్నా.
ప్రతి మ్యాచ్ ఆడాలనుకుంటా...
ప్రస్తుత భారత జట్టు నైపుణ్యం, ఫిట్‌నెస్, తీవ్రత విషయంలో అగ్రజట్లకు ఏమాత్రం తీసిపోదు. టోక్యో ఒలింపిక్స్ ముందు నుంచే ఆ్రస్టేలియా, నెదర్లాండ్స్, జర్మనీ వంటి జట్లపై నిలకడగా విజయాలు సాధిస్తున్నాం. అయితే వ్యూహాలను అమలు చేసే విషయంలో ఇంకాస్త మెరుగు పడాల్సిన అవసరముంది. మేం దానిపై దృష్టి సారించాం.
జాతీయ జట్టు, భారత్ ‘ఎ’, భారత్ అండర్–19 ఇలా ఎందరో ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు. యువ ఆటగాళ్లకు కూడా అవకాశాలు లభిస్తాయి. వర్క్‌లోడ్ నిర్వహణను జాగ్రత్తగా చూసుకుంటారు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం ప్రతిఒక్కరికీ రాదు. అలాంటి దాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోను.
నా వరకైతే జాతీయ జట్టు ఆడే ప్రతి మ్యాచ్‌లో నేను ఉండాలనుకుంటా. దేశానికి ప్రాతినిధ్యం వహించడం కంటే గొప్ప గౌరవం ఏముంటుంది. టోర్నమెంట్ అనంతరం తిరిగి ఎలా కోలుకోవాలో తెలుసు. దానిపై దృష్టి పెట్టి కొత్త ఉత్సాహాన్ని నింపుకుంటా అంతేకాని మ్యాచ్‌లకు దూరంగా ఉండాలని అనుకోను.
హాకీ వరల్డ్‌కప్‌లో సత్తా చాటుతాం...
వచ్చే ఏడాది జరగనున్న హాకీ ప్రపంచకప్‌నకు భారత జట్టు అర్హత సాధించడం ఖాయమే. 1975లో జరిగిన టోర్నీలో టీమిండియా చాంపియన్‌గా నిలిచింది. 2023లో భువనేశ్వర్ వేదికగా జరిగిన మెగా టోరీ్నలో ఆతిథ్య భారత జట్టు తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది. టోక్యో ఒలింపిక్స్‌కు ముందు 41 ఏళ్లుగా విశ్వక్రీడల్లో మన ప్రదర్శన నామమాత్రమే. అలాంటి ఒక సందర్భం వస్తుంది. ఈసారి ప్రపంచకప్‌లో మెరుగైన ఆటతీరు కనబరుస్తాం.
గత వరల్డ్‌కప్‌లో జరిగిన తప్పిదాలను పునరావృతం కాకుండా చూసుకుంటూ సత్తాచాటేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆధునిక హాకీలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఫేవరెట్ అంటూ ఎవరూ లేరు. ఎవరు ఎవరినైనా ఓడించవచ్చు. ఒలింపిక్స్‌లో జర్మనీపై దక్షిణాఫ్రికా గెలుపొందింది. అనూహ్య ఫలితాలు అంటూ ఏమీ ఉండవు.
మా వరకైతే ప్రత్యర్థుల గురించి పట్టించుకోము... మా బలాలను పెంచుకొని మెరుగైన ఫలితాలు సాధిస్తాం. ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్ యూరప్ అంచె పోటీల్లో వరస పరాజయాలు ఎదురైన మాట వాస్తవమే. అయితే ఓడిన మ్యాచ్‌ల్లో సైతం మేం ఎంతో పోరాడాం. చివరి నిమిషంలో ప్రత్యరి్థకి ఆధిక్యం సమర్పించుకునే అలవాటును దూరం చేసుకోవాల్సి ఉంది. డిఫెన్స్‌లో మరింత రాటుదేలుతాం. ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్ యువ ఆటగాళ్ల సత్తాకు పరీక్ష కానుంది.