
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 27) జరిగిన లక్నో-ఆర్సీబీ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ కీలక దశలో సాగుతుండగా లక్నో స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీ మన్కడింగ్‌కు (నాన్ స్ట్రయికర్ ఎండ్‌లోని బ్యాటర్ బంతి వేయకముందే క్రీజ్‌ను దాటిన సమయంలో బౌలర్ వికెట్లను గిరాటు వేయడం) పాల్పడ్డాడు.
ఈ విషయమై రాఠీ అప్పీల్ చేసినప్పటికీ.. లక్నో కెప్టెన్ పంత్ దాన్ని విత్‌డ్రా చేసుకున్నాడు. రీప్లే పరిశీలించిన అనంతరం థర్డ్ అంపైర్ దీన్ని నాటౌట్‌గా ప్రకటించాడు.
టెక్నికల్‌గా (రాఠీ ఫ్రంట్ ఫుట్ ల్యాండ్ అయ్యే సమయానికి నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న జితేశ్ శర్మ క్రీజ్‌లోనే ఉన్నాడు) ఇది నాటౌటే అయినప్పటికీ.. రూల్స్‌కు విరుద్దం అయితే కాదు. గతంలో చాలా సందర్భాల్లో బౌలర్లు మన్కడింగ్ చేసి బ్యాటర్లను ఔట్ చేశారు. తాజాగా అదే ప్రయత్నం జరిగింది. అయితే ఇక్కడ కెప్టెన్ బౌలర్‌ను సమర్థించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
అ విషయమై క్రికెట్ సర్కిల్స్‌లోభిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు రాఠీ చర్యను సమర్దిస్తుంటే.. మరికొందరు పంత్ అప్పీల్‌ను వెనక్కు తీసుకోవడాన్ని తప్పుబడుతున్నారు.
రాఠీ చర్యను సమర్దించిన వారిలో సీఎస్‌కే వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఉన్నాడు. యాష్ ఓ పక్క రాఠీ చర్యను సమర్దిస్తూనే, అప్పీల్‌ను విత్‌డ్రా చేసుకున్న పంత్‌ను తప్పుబట్టాడు. పంత్ అప్పీల్‌ను విత్‌డ్రా చేసుకోవడం వల్ల రాఠీ కోట్లాది మంది అభిమానుల ముందు ఫూల్ అయ్యాడని అభిప్రాయపడ్డాడు. పంత్ రాఠీని జీవితంలో ఇంకోసారి మన్కడింగ్‌కు పాల్పడకుండా చేశాడని మండిపడ్డాడు.
మన్కడింగ్ విషయంలో బౌలర్లంటే ఎందుకు అంత చిన్న చూపని ప్రశ్నించాడు. ఓ రకంగా బౌలర్‌కు ఇది అవమానమని అన్నాడు. పంత్ తీసుకున్న నిర్ణయం వల్ల రాఠీ భయపడి ఉంటాడని తెలిపాడు. బౌలర్ చర్యను వెనకేసుకురావడం కెప్టెన్ బాధ్యత అని గుర్తు చేశాడు.
ఔటైనా, నాటౌటైనా మన్నడింగ్ అనేది ఆటలో భాగమని అన్నాడు. మ్యాచ్ కీలక దశలో సాగుతుండగా బౌలర్ ఇలాంటి ప్రయత్నం చేయడం తప్పేది కాదని అభిప్రాయపడ్డాడు.
కాగా, ఆర్సీబీ 228 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తుండగా ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో (ఆఖరి బంతికి) ఇది జరిగింది. రాఠీ మన్కడింగ్‌కు పాల్పడే సమయానికి ఆర్సీబీ 19 బంతుల్లో 29 పరుగులు చేయాలి. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. అప్పటకే జితేశ్ శర్మ జోరు మీదున్నాడు. ఒకవేళ జితేశ్ మన్కడింగ్ ద్వారా ఔటయ్యుంటే ఆర్సీబీ కష్టాల్లో పడేది. మ్యాచ్‌ను కూడా కోల్పోవాల్సి వచ్చేది.
ఇలాంటి సందర్భంలో పంత్ బౌలర్ అప్పీల్‌ను ఉపసంహరించుకుని ఆర్సీబీకి ఫేవర్ చేశాడు. క్రీడా స్పూర్తి అని పెద్దపెద్ద మాటలు అనుకోవచ్చు కానీ, మ్యాచ్‌ను కాపాడుకునే ప్రయత్నంలో బౌలర్ చేసింది కరెక్టే అని చెప్పాలి. రాఠీ అప్పీల్‌ను పంత్ చిన్నచూపు చూసి తన వ్యక్తిగత ఇమేజ్‌ను పెంచుకున్నాడు. అంతటితో ఆగకుండా అప్పీల్ విత్‌డ్రా చేసుకున్న తర్వాత జితేశ్‌ను కౌగించుకుని సొంత బౌలర్‌ను అవమానించాడు. మన్కడింగ్ తర్వాత మరింత రెచ్చిపోయిన జితేశ్ కొద్ది బంతుల్లోనే మ్యాచ్‌ను లక్నో చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు.