పెళ్లైన పదిరోజులకే ఫుట్‌బాల్‌ స్టార్‌ దుర్మరణం | Liverpool Star Diogo Jota Dies 10 Days After Wedding | Sakshi
Sakshi News home page

పెళ్లైన పదిరోజులకే ఫుట్‌బాల్‌ స్టార్‌ దుర్మరణం

Jul 3 2025 2:39 PM | Updated on Jul 3 2025 4:45 PM

Liverpool Star Diogo Jota Dies 10 Days After Wedding

లివర్‌పూల్‌ ఫుట్‌బాలర్‌, పోర్చుగీస్‌కు చెందిన డియోగో జోటా (Diogo Jota) దుర్మరణం చెందాడు. అతడు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్పెయిన్‌లోని జమోరా ప్రావిన్స్‌లో గురువారం ఈ ప్రమాదం జరిగింది. ఈ మేరకు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి.

కాగా ప్రమాద సమయంలో జోటాతో పాటు అతడి సోదరుడు ఆండ్రీ కూడా కారులోనే ఉన్నాడు. అతడు కూడా ప్రొఫెషనల్‌ ఫుట్‌బాలరే!.. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. కారు రోడ్డును ఢీకొట్టిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో అందులోని వారు సజీవ దహనం అయ్యారని తెలుస్తోంది.

కాగా 28 ఏళ్ల జోటా పదిరోజుల క్రితమే పెళ్లి బంధంలో అడుగుపెట్టాడు. తన చిరకాల ప్రేయసి, జీవిత భాగస్వామి అయిన రూటే కార్డెసోను వివాహమాడాడు. ఇంతలోనే అతడు ప్రాణాలు కోల్పోవడం విషాదం. కాగా జోటాకు భార్య రూటేతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇక ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కీలక విజయాల్లో పాత్ర
పోర్టోలో జన్మించిన జోటా.. 2016లో అట్లెటికో మాడ్రిడ్‌ క్లబ్‌లో చేరాడు. ఆ తర్వాత ప్రీమియర్‌ లీగ్‌, వోల్వర్‌హాంప్టన్‌ వాండరర్స్‌ తరఫున సత్తా చాటిన జోటా.. లివర్‌పూల్‌తో జట్టు కట్టిన తర్వాత తన కెరీర్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు.  

జర్గన్‌ క్లాప్‌ నాయకత్వంలో ఎఫ్‌ఏ కప్‌, లీగ్‌ కప్‌ టైటిల్స్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే లివర్‌పూల్‌ అటాకింగ్‌ విభాగంలో ప్రధాన ఆటగాడిగా ఎదిగాడు. ఇక 2024-25 సీజన్‌లో లివర్‌పూల్‌ ప్రీమియర్‌ లీగ్‌ గెలవడంలోనూ జోటాది కీలక పాత్ర. ఇక పోర్చుగల్‌ జట్టు తరఫున కూడా అతడు రాణించాడు.

రొనాల్డో సంతాపం
జోటా మృతిపై పోర్చుగల్‌ దిగ్గజ ఫుట్‌బాలర్‌ క్రిస్టియానో రొనాల్డో స్పందించాడు. నువ్వులేని లోటు ఎవరూ తీర్చలేరని.. నీ భార్యా, పిల్లలు, కుటుంబానికి ఆ దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. మరోవైపు.. లివర్‌పూల్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ జోటా మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ విషాదకర విషయాన్ని నమ్మలేకపోతున్నామంటూ సంతాపం వ్యక్తం చేసింది.
చదవండి: ఇకపై మళ్లీ ఆడగలనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement