పంజాబ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని 8 మంది కూలీలు మృతి | 8 Mgnrega workers run over by speeding car in Punjab, all dead | Sakshi
Sakshi News home page

పంజాబ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని 8 మంది కూలీలు మృతి

Oct 18 2026 11:48 PM | Updated on Oct 19 2026 12:08 AM

8 Mgnrega workers run over by speeding car in Punjab, all dead

పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లాలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. రహదారిపై పనులు చేసుకుంటున్న ఉపాధి హామీ కూలీలను అతివేగంగా దూసుకొచ్చిన కారు రూపంలో మృత్యువు కబళించింది. ఈ ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

ఆదివారం సాయంత్రం సంగ్రూర్ జిల్లాలోని లెహ్రాగగా-జాఖల్ రోడ్డుపై దాదాపు 23 మంది కార్మికులు పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఆ సమయంలో అటుగా వచ్చిన అతి వేగంతో వ‌చ్చిన‌ కారు వారిపైకి దూసుకెళ్లంది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించగా.. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే ఆంబులెన్స్‌లు, పోలీసు సహాయం సమయానికి అందలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారిని కరమ్‌జిత్ కౌర్, జీవన్ సింగ్, నిక్కీ, సరబ్‌జిత్ కౌర్, రంజీత్ కౌర్, కరమ్‌జిత్, రాణి కౌర్, దేశరాజ్‌లుగా పోలీసులు ధ్రువీకరించారు. మృతులంతా లెహ్రాగాగా సమీపంలోని అలీషర్ గ్రామానికి చెందిన వారే. దీంతో ఆ గ్రామంలో తీవ్ర శోకసంద్రం అలుముకుంది.

ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను రైధ్రానా గ్రామానికి చెందిన పర్గత్ సింగ్ అలియాస్ కాలాగా పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన వెంటనే అతడు పరారయ్యాడని, అతడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని సంగ్రూర్ ఎస్పీ పల్విందర్ చీమా తెలిపారు. నిందితుడిని త్వరలోనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement