భారతదేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, యువతే దేశానికి ఆత్మ అని బీజేపీ ఎంపీ, నటుడు రవి కిషన్ అన్నారు. యువత దేశభక్తి కలిగినవారని, వారికి అనేక విషయాలపై అవగాహన ఉందని ప్రశంసించారు. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో ఓటు చోరీ ఆరోపణలపై నిరసనలు కొనసాగుతున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ముంబైలో జరిగిన ఖిడ్కియాన్ థియేటర్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026లో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీతో కలిసి పాల్గొన్న రవి కిషన్.. యువతరంపై తన అభిప్రాయాలను వెల్లడించారు. యువతలో తనను తాను చూసుకుంటున్నానని చెప్పారు. “జెన్ జీ ఈ దేశానికి ఆత్మ” అని పేర్కొన్నారు.
“జెన్ జీ ఈ దేశ భవిష్యత్తు. మా తర్వాత దేశాన్ని అన్ని విధాలుగా వారే నడిపిస్తారు. పార్లమెంటు నుంచి వీధుల వరకు యువతదే ఆధిపత్యం” అని రవి కిషన్ అన్నారు. జూన్ 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి సీజేపీ నీట్-యూజీ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా నిరసన ప్రారంభించింది.
ఈ వ్యవహారంలో కేంద్రం బాధ్యత వహించాలని, అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. జులై 20న పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజున పార్లమెంటు వైపు భారీ ప్రదర్శన నిర్వహించింది. ఆందోళనకారులు పోలీసుల బారికేడ్లు, బాష్పవాయు ప్రయోగం, లాఠీచార్జీని ఎదుర్కొన్నారు. నిరసనలు కొనసాగిన నేపథ్యంలో జులై 25న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.
కొన్ని నెలల తర్వాత సీజేపీ మరోసారి నిరసనలకు దిగింది. ఈసారి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై (ఎస్ఐఆర్) ఎన్నికల అక్రమాలు జరిగాయంటూ ఆరోపించింది. ఎన్నికల ప్రక్రియ పారదర్శకతను కాపాడటంలో ఎన్నికల సంఘం విఫలమైందని పేర్కొంటూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
జెన్ జీ మొత్తాన్ని ముడిపెట్టడం సరికాదు
అయితే, జెన్ జీ మొత్తాన్ని సీజేపీ నిరసనలతో ముడిపెట్టడం సరికాదని రవి కిషన్ అభిప్రాయపడ్డారు. “ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్నదంతా ఒక ప్రత్యేక ప్రపంచం. జెన్ జీకి దానితో సంబంధం లేదు. యువత దేశభక్తి కలిగినవారు. దేశానికి అండగా నిలుస్తారు. సమీప భవిష్యత్తులో దేశాన్ని నడిపించేది వారే” అని అన్నారు. యువతకు ఎవరూ తమ అభిప్రాయాలను బలవంతంగా రుద్దకూడదని రవి కిషన్ సూచించారు.
“జెన్ జీకి ఇప్పటికే చాలా విషయాలపై అవగాహన ఉంది. వారికి అనేక విషయాలు తెలుసు. అందువల్ల ఎవరైనా వారికి బోధించాలని ప్రయత్నించడం మంచిది కాదు” అని వ్యాఖ్యానించారు. సీజేపీ నిరసనలు ఎన్నికల ప్రక్రియపై చర్చకు దారితీస్తున్న వేళ.. యువతపై రవి కిషన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యువత అభిప్రాయాలు, రాజకీయ నిరసనలపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో మరింత చర్చకు దారితీసే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: దసరా పోస్టర్.. రావణుడి పది ముఖాల్లో ఒకటిగా ఎలాన్ మస్క్


