డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడు పర్వీందర్ సింగ్ హత్యపై జనం ఆగ్రహం
చండీగఢ్: పంజాబ్‌లో మాదక ద్రవ్యాల వ్యతిరేక ఉద్యమకారుడు పర్వీందర్ సింగ్ అలియాస్ జోటాను ఓ మెడికల్ స్టోర్ యజమాని కాల్చిచంపడం పట్ల జనం తీవ్ర ఆగ్రహావేశాలతో రలిగిపోయారు. బుధవారం మాన్సా పట్టణం నిరసనలతో అట్టుడికింది. వీర్ నగర్లో నిందితుడు అశ్వనీ కుమార్ ఇంటిలో కొంత భాగాన్ని ప్రభుత్వ అధికారులు బుల్డోజర్తో కూల్చివేశారు. అది అక్రమ నిర్మాణమని గుర్తించారు. ఆ ఇంటికి సమీపంలోని అశ్వనీ కుమార్ మెడికల్ స్టోర్‌పై ప్రజలు విరుచుకుపడ్డారు. తొలుత కత్తులు, కర్రలు, రాళ్లతో ధ్వంసం చేశారు.
ఫర్నిచర్‌ను బయటపడేసి దహనం చేశారు. తర్వాత మెడికల్ స్టోర్‌కు నిప్పుపెట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని తేల్చిచెప్పారు. మెడికల్ స్టోర్‌లో డ్రగ్స్ ఎందుకు విక్రయిస్తున్నారని ప్రశ్నించినందుకు పర్వీందర్ సింగ్‌ను మంగళవారం పట్టపగలే జనం చూస్తుండగానే దుకాణం యజమాని అశ్వనీ కుమార్ కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం నిందితుడు రాజస్తాన్‌లోని సలాసర్‌కు పరారయ్యాడు. అతడిని అక్కడ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పర్వీందర్ సింగ్ హత్యోదంతం పంజాబ్‌ను కుదిపేసింది. రాజకీయ దుమారం సృష్టించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ వ్యవహారం రాజకీయ ప్రచార అంశంగా మారింది.


