సాక్షి,కృష్ణా: విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డులో సోమవారం సాయంత్రం ఘోర విషాదం చోటు చేసుకుంది. ఎలక్ట్రిక్ కారు (ఈవీ) రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఢీకొట్టిన మరుక్షణమే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి, క్షణాల్లోనే వాహనం పూర్తిగా కాలిబూడిదైంది. ఈ ఘోర అగ్నిప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు.
నంబూరులో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై తిరుగు ప్రయాణంలో విజయవాడ వైపు వస్తుండగా ఈ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలపాలైన బాధితుణ్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో మరణించిన వారిని నున్న, నంబూరు గ్రామాల వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో నున్నకు చెందిన కొమ్మారెడ్డి రాందేవ్ (39), ఆయన తల్లి అరుణ, ఒక చిన్నారితో పాటు నంబూరుకు చెందిన తిగురు విజయ ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల పూర్తి వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


