
భారత పర్యటనకు అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్
డిసెంబర్‌లో కోల్‌కతా, అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమాలు
ఈడెన్ గార్డెన్స్‌లో సెలెబ్రిటీలతో ‘సెవెన్–ఎ–సైడ్’ మ్యాచ్
కోల్‌కతా: ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా కెపె్టన్ లియోనెల్ మెస్సీ ఈ ఏడాది చివర్లో భారత్‌లో పర్యటించనున్నాడు. 2011లో చివరిసారిగా భారత్‌కు విచ్చేసిన మెస్సీ... రెండు రోజుల పర్యటనలో భాగంగా డిసెంబర్‌లో కోల్‌కతా, అహ్మదాబాద్, ముంబై, న్యూఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు సమాచారం. ఫుట్‌బాల్‌ను అమితంగా ఇష్టపడే కోల్‌కతా నుంచి మెస్సీ పర్యటన ప్రారంభం కానుంది.
అందకు తగ్గట్లే ఏర్పాట్లు సైతం జరుగుతున్నట్లు సమాచారం. అయితే భారత పర్యటనపై ఇప్పటి వరకు మెస్సీ నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అతి త్వరలో అది వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ‘మెస్సీ పర్యటన ఖరారైంది. అతడి నుంచి అధికారిక స్పందన రావడమే తరువాయి. అది సామాజిక మాధ్యమాల ద్వారా ఏ క్షణమైనా రావచ్చు’ అని నిర్వాహకులు వెల్లడించారు. ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ 12న మెస్సీ కోల్‌కతాలో అడుగు పెట్టనున్నాడు.
70 అడుగుల విగ్రహం...
ఫుట్‌బాల్‌ను విపరీతంగా అభిమానించే కోల్‌కతా వాసులు... మెస్సీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీఐపీ రోడ్‌లోని లేక్‌టౌన్ శ్రీభూమిలో మెస్సీ 70 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పర్యటనలో భాగంగా మెస్సీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నాడు. ప్రపంచంలో మెస్సీకి ఇదే అతి ఎత్తయిన విగ్రహం కానుంది. డిసెంబర్ 13 మధ్యాహ్నం ఈడెన్ గార్డెన్స్‌లో నిర్వహించే ‘గోట్ కాన్సెర్ట్’లో మెస్సీ పాల్గొననున్నాడు.
మెస్సీ ఘనతలను వివరించేలా సాగే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు. ‘అభిమానులను తప్పుదోవ పట్టించాలనుకోవడం లేదు. గోట్ కాన్సెర్ట్‌తో పాటు ఏడుగురు ప్లేయర్లతో కూడిన ‘సెవెన్–ఎ–సైడ్’ గోట్ కప్ మ్యాచ్‌లో మెస్సీ పాల్గొననున్నాడు.
ఇందులో భారత క్రికెట్ జట్టు మాజీ కెపె్టన్ సౌరవ్ గంగూలీ, టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్, భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా, ప్రముఖ నటుడు జాన్ అబ్రహం తదితరులు పాల్గొననున్నారు. ఇది మెస్సీ గౌరవార్ధం నిర్వహిస్తున్నాం. ఈడెన్ గార్డెన్స్‌లో నిర్వహించే ఈ మ్యాచ్ చూసేందుకు అభిమానులు ఎగబడే అవకాశం ఉండగా... టికెట్ ధరలు సైతం ఎక్కువగానే ఉండనున్నాయి. సుమారు గంటన్నర పాటు మెస్సీ మైదానంలో ఉంటాడు. అతడిని దగ్గర నుంచి చూసేందుకు స్టేడియం నిండిపోవడం ఖాయమే’ అని నిర్వాహకులు వెల్లడించారు. ఈ మ్యాచ్ అనంతరం బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మెస్సీని సత్కరించే అవకాశముంది.
ముంబైలో క్రికెట్ మ్యాచ్!
కోల్‌కతా పర్యటన అనంతరం మెస్సీ అహ్మదాబాద్, ముంబైలో జరగనున్న ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొననున్నాడు. డిసెంబర్ 14న ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో జరగనున్న ‘గోట్ కాన్సెర్ట్’, ‘గోట్ కప్’లో మెస్సీ పాల్గొననున్నాడు. దీని కోసం ఇప్పటికే మైదానాన్ని బుక్ చేసినట్లు సమాచారం. ముంబైలో మెస్సీ క్రికెట్ మ్యాచ్ ఆడనున్నట్లు వార్తలు వస్తుండగా... నిర్వాహకులు మాత్రం వాటిని ఖండించారు. ‘మెస్సీ ఎలాంటి క్రికెట్ మ్యాచ్ ఆడబోవడం లేదు.
భారత సెలెబ్రిటీలతో సరదాగా సాఫ్ట్‌బాల్ ఆడుతాడు’ అని వెల్లడించారు. అదే సమయంలో భారత ఫుట్‌బాల్ జట్టును సైతం మెస్సీ కలిసే అవకాశముంది. అనంతరం డిసెంబర్ 15న ఢిల్లీ చేరుకోనున్న మెస్సీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మర్యాద పూర్వకంగా భేటీ కానున్నాడు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రతి నగరంలో మెస్సీ చిన్నారులతో ప్రత్యేకంగా గడపనున్నాడు. ఈ టూర్‌లో మెస్సీ కేరళకు వెళ్లడం లేదని నిర్వాహకులు స్పష్టం చేశారు.
అప్పుడేం జరిగిందంటే...
2011 ఆగస్టు 31న మెస్సీ తొలిసారి భారత్‌లో పర్యటించాడు. వెనిజులాతో ఎగ్జిబిషన్ మ్యాచ్ కోసం కోల్‌కతాకు విచ్చేసిన మెస్సీకి అభిమానులు బ్రహ్మరథం పట్టారు. అర్జెంటీనా జట్టుతో పాటు వచి్చన మెస్సీ కోసం వేలాది మంది అభిమానులు ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలకగా... మ్యాచ్ జరుగుతున్నంత సేపు ‘సాల్ట్‌లేక్’ స్టేడియం మెస్సీ నామస్మరణతో మార్మోగిపోయింది. కోల్‌కతా నగరం మొత్తం ‘మెస్సీ మేనియా’తో ఊగిపోయింది. ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్ల తర్వాత... ప్రపంచ చాంపియన్ హోదాలో మెస్సీ భారత్‌లో అడుగుపెట్టనుండటంతో... ఈ సారి మరింత మంది అభిమానులు అర్జెంటీనా స్టార్‌ను చూసేందుకు ఎగబడటం ఖాయమే.