
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం బాబ్ సింప్సన్ (Bob Simpson) కన్నుమూశాడు. క్రికెట్ ఆస్ట్రేలియా (Cricket Australia) శనివారం ఈ విషయాన్ని వెల్లడించింది. 89 ఏళ్ల బాబ్ సింప్సన్ మరణ వార్తను ధ్రువీకరిస్తూ నివాళులు అర్పించింది. కాగా ఆస్ట్రేలియా క్రికెట్ నిర్మాణంలో బాబ్ సింప్సన్‌ది కీలక పాత్ర.
కెప్టెన్‌గా, కోచ్‌గా
ఆటగాడిగా, కెప్టెన్‌గా, కోచ్‌గా సేవలు అందించిన బాబ్ సింప్సన్.. అన్ని పాత్రల్లోనూ అత్యుత్తమంగా రాణించాడు. ఆసీస్ బెస్ట్ ఓపెనర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన ఆయన.. 1957- 1978 మధ్య అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. మొత్తంగా 62 టెస్టుల్లో 4500కు పైగా పరుగులు సాధించాడు. అత్యుత్తమ బ్యాటర్‌గా రాణించడంతో పాటు.. బెస్ట్ స్లిప్ ఫీల్డర్‌గా, పార్ట్‌టైమ్ లెగ్ స్పిన్నర్‌గానూ బాబ్ సింప్సన్ గుర్తింపు పొందాడు.
యాషెస్ ట్రిపుల్ సెంచరీ వీరుడు
ఇక ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో సాధించిన ట్రిపుల్ సెంచరీ బాబ్ సింప్సన్ కెరీర్‌లోనే అత్యుత్తమమైనది. 1964లో మాంచెస్టర్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో బాబ్ 311 పరుగులతో సత్తా చాటాడు. కాగా 1968లోనే రిటైర్మెంట్ ప్రకటించిన బాబ్ సింప్సన్.. దశాబ్ద కాలం తర్వాత మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చాడు. వరల్డ్ సిరీస్ సందర్భంగా రీఎంట్రీ ఇచ్చాడు.
దిగ్గజాల రూపకల్పనలో
ఇక 1986లో కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన బాబ్ సింప్సన్.. యువ ఆటగాళ్లను మెరికల్లా తీర్చిదిద్దాడు. క్రమశిక్షణ, ఫిట్‌నెస్, ప్రొఫెషనలిజంలో నిక్కచ్చిగా ఉంటూ.. జట్టు దిశను మార్చివేశాడు.
స్టీవ్ వా, షేన్ వార్న్, గ్లెన్ మెగ్రాత్ వంటి ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో బాబ్‌ది కీలక పాత్ర. ఆయన నేతృత్వంలో ఆస్ట్రేలియా 1987 వరల్డ్‌కప్ గెలవడంతో పాటు 1989లో యాషెస్ సిరీస్‌ను నిలబెట్టుకుంది. అదే విధంగా.. 1995లో వెస్టిండీస్‌పై సిరీస్ విజయం సాధించింది.
కొందరికి చండశాసనుడు
ఇక బాబ్ సింప్సన్ తన సేవలకు గానూ 1965లో విజ్డన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియన్ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాల్లోనూ చోటు దక్కించుకున్నాడు. కోచ్‌గా ఉన్న సమయంలో కఠినంగా వ్యవహరించిన బాబ్ సింప్సన్ కొందరికి చండశాసనుడైతే.. మరికొందరికి మాత్రం తమను సరైన మార్గంలో నడిపించిన మెంటార్. కాగా బాబ్ సింప్సన్ సిడ్నీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది.
చదవండి: ENG vs SA: వన్డే, టీ20లకు ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. ఆ సిరీస్‌కు కెప్టెన్‌గా జేకబ్