
బుడాపెస్ట్ (హంగేరి): ఎట్టకేలకు ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్‌లోని 14వ రేసులో ఐదో కొత్త ‘పోల్ పొజిషన్’ డ్రైవర్ అవతరించాడు. గత 13 రేసుల్లో లాండో నోరిస్ (మెక్‌లారెన్), ఆస్కార్ పియాస్ట్రి (మెక్‌లారెన్), మాక్స్ వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్), జార్జి రసెల్ (మెర్సిడెస్) ‘పోల్ పొజిషన్స్’ దక్కించుకున్నారు.
శనివారం జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌లో ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్‌లెర్క్ ‘పోల్ పొజిషన్’ సాధించాడు. తాజా సీజన్‌లో మెక్‌లారెన్ డ్రైవర్లు నోరిస్, పియాస్ట్రి జోరు సాగుతుండగా... వారిద్దరినీ వెనక్కి నెట్టి లెక్‌లెర్క్ ఈ ఏడాది తొలి ‘పోల్ పొజిషన్’ దక్కించుకున్నాడు.
క్వాలిఫయింగ్ సెషన్‌లో లెక్‌లెర్క్ అందరికంటే వేగంగా 1 నిమిషం 15.372 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి ‘టాప్’లో నిలిచాడు. ఆదివారం జరగనున్న ప్రధాన రేసును లెక్‌లెర్క్ అగ్రస్థానం నుంచి నుంచి ప్రారంభిస్తాడు. పియాస్ట్రి (1 నిమిషం 15.398 సెకన్లు; మెక్‌లారెన్), నోరిస్ (1 నిమిషం 15.413 సెకన్లు; మెక్‌లారెన్) వరుసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచారు.
‘మాటలు రావడం లేదు. ఏమాత్రం ఊహించలేదు. అందుకే ఇది నా ప్రదర్శనల్లో అత్యుత్తమమైన వాటిలో ఒకటి. ఎలా జరిగిందో అర్థం కావడం లేదు. అగ్రస్థానంలో నిలిచేందుకు చేయాల్సిందంతా చేశాను’ అని కెరీర్‌లో 27వసారి పోల్ పొజిషన్ పొందిన లెక్‌లెర్క్ పేర్కొన్నాడు.
ఓవర్‌టేక్ చేయడం చాలా కష్టమైన హంగేరి ట్రాక్‌పై పోల్ పొజిషన్ సాధించడం ప్రధాన రేసులో ఫెరారీ డ్రైవర్‌కు ఎంతో సహకరించనుంది. డిఫెండింగ్ చాంపియన్ వెర్‌స్టాపెన్ (1 నిమిషం 15.728 సెకన్లు; రెడ్‌బుల్) 8వ స్థానంలో నిలవగా.... ఫెరారీకే చెందిన మరో డ్రైవర్, ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (1 నిమిషం 15.702 సెకన్లు) 12వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.