సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసు కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చారు. దీంతో, ఈ-కారు రేసు కేసులో కేటీఆర్‌పై ఛార్జ్‌షీట్ వేసేందుకు ఏసీబీకి గవర్నర్ అనుమతి లభించినట్టు అయ్యింది. అయితే, కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ అనుమతి కోరుతూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఈ నేపథ్యంలో తాజాగా గవర్నర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
కాగా, ఫార్ములా ఈ-కారు రేసులో క్విడ్ ప్రోకో జరిగినట్టు ఏసీబీ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. రూ.54.88 కోట్ల నిధులు దారి మళ్లింపుపై ఆరోపణలు చేసింది. ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ ఇప్పటికే పలుమార్లు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. రెండు సార్లు ఏసీబీ విచారణకు, ఒకసారి ఈడీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. ఇక, ఫార్ములా-ఈ కార్ రేసింగ్ వ్యవహారంపై 2024 డిసెంబరు 18న ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అర్వింద్‌కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిపై కేసు నమోదైంది.
ఇక, తాజా పరిణామంతో త్వరలోనే కేటీఆర్‌పై అభియోగాలు నమోదు చేసేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. విచారణ తర్వాతే ఛార్జ్‌షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా, అటు కేసులో కీలక నిందితులైన ఐఏఎస్ అరవింద్ కుమార్‌పై డోపీటీ (DOPT)కి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఒకవేళ కేంద్రం అనుమతి ఇస్తే ఆయనపై కూడా ఏసీబీ అభియోగాలు నమోదు చేసేందుకు సిద్ధంగా ఉంది.

ఫార్ములా ఈ కారు రేసు టైమ్‌లైన్..
- డిసెంబరు 18, 2024న ఎఫ్‌ఐఆర్ నమోదు
- డిసెంబర్ 28, 2024 ఈడీ సమన్లు.
- జనవరి 2, 2025న అర్వింద్ కుమార్ విచారణ.
- జనవరి 3, 2025న బీఎల్‌ఎన్ రెడ్డి విచారణ.
- జనవరి 7, 2025న కేటీఆర్ విచారణ.
- జూన్ 2025లో ఏసీబీ రెండో దశ విచారణ.
- జూన్ 16న కేటీఆర్ మరోసారి విచారణకు హాజరు.


