
కేటీఆర్, అర్వింద్‌కుమార్‌లపై అభియోగం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ–కారు రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిధుల బదలాయింపులో తీవ్ర ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని, హెచ్‌ఎండీఏ నిధులు దురి్వనియోగం అయ్యాయని అవినీతి నిరోధక శాఖ తేల్చినట్టు తెలిసింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలాంటి అనుమతులు లేకుండా, సంబంధం లేని విభాగం నుంచి నిధులను ఫార్ములా ఈ– కారు రేసుకు బదిలీ చేయడం వెనుక క్విడ్ ప్రో కో జరిగినట్టు అవినీతి నిరోధక శాఖ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో స్పష్టం చేసినట్టు విశ్వసనీయ సమాచారం.
రూ.55 కోట్ల హెచ్‌ఎండీఏ నిధుల దుర్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏసీబీ తుది నివేదిక అందించింది. ఈ కేసులో విధానపరమైన లోపాలు ఉన్నాయని వెల్లడించింది. హైదరాబాద్‌లో తొలిసారి 2023 ఫిబ్రవరిలో ఫార్ములా ఈ–కారు రేసు సంస్థ రేసును నిర్వహించిన విషయం తెలిసిందే. అప్పట్లో స్పాన్సర్లతో తొలి రేసు నిర్వహించినా, అందుకు మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించింది. తొలిసారి స్పాన్సర్లుగా వ్యవహరించిన సంస్థలకు ఆశించిన మేరకు ఆదాయం రాకపోవడంతో... 2024లో నిర్వహించాల్సిన రెండో రేసు నుంచి స్పాన్సర్లు తప్పుకున్నారు.
రేసు నిర్వహణకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో ఫార్ములా ఈ– కారు రేసు నిర్వాహకులు వెంటనే నిధులు ఇస్తే తప్ప.. 2024 ఫిబ్రవరిలో రేసు కేటాయించడం సాధ్యం కాదంటూ ఒత్తిడి తేవడం, స్పాన్సర్లు ముందుకు రాకపోవడంతో అప్పట్లో హెచ్‌ఎండీఏ నుంచి ఫార్ములా ఈ–కారు రేసు సంస్థకు విదేశీ కరెన్సీలోనే నిధులు చెల్లించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి కూడా తీసుకోలేదని, ఆర్థికశాఖ నుంచి కూడా అనుమతి తీసుకోలేదని తన నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. 2023 డిసెంబర్‌లో రాష్ట్రంలో అధికారం మారడంతో...ఫార్ములా ఈ– కారు రేసును రద్దు చేస్తున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
ఎన్నికల సమయంలో హెచ్‌ఎండీఏ నుంచి నిధులు విదేశాలకు తరలివెళ్లాయని తెలియడంతో.. అప్పటి పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్ ఈ నిధులు మళ్లింపుపై విచారణ చేయాలని అవినీతి నిరోధక శాఖకు లేఖ రాసిన సంగతి విదితమే. ఆ తర్వాత ఎసీబీ అధికారులు అప్పట్లో పురపాలకశాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌ను రెండుసార్లు, అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను మూడుసార్లు, హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్‌రెడ్డిలను మూడుసార్లు ప్రశ్నించింది.
ఎస్ నెక్స్ట్ జెన్‌తోపాటు ఫార్ములా ఈ–కారు రేసు ప్రతినిధులను కూడా ప్రశ్నించింది. ఈ మేరకు పూర్తిస్థాయిలో నివేదికను తయారు చేసిన ఏసీబీ అందులో ప్రధానంగా మాజీమంత్రి కేటీఆర్, అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరి్వంద్‌కుమార్‌లను ముద్దాయిలుగా పేర్కొన్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. వారిపై ప్రాసిక్యూషన్ అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్టు సమాచారం.