ఇంగ్లండ్‌ సిరీస్‌కు ముందు సూపర్‌ సెంచరీ.. తుది జట్టులో చోటు ఖాయమేనా? | Sakshi
Sakshi News home page

ENG vs IND: ఇంగ్లండ్‌ సిరీస్‌కు ముందు సూపర్‌ సెంచరీ.. తుది జట్టులో చోటు ఖాయమేనా?

Published Sat, Jan 20 2024 7:19 PM

KS Bharat gets lifeline before IND vs ENG Test series with stunning century for India A - Sakshi

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భారత వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ శ్రీకర్‌ భరత్‌ సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఓ ప్రాక్టీస్‌ మ్యాచ్‌, మూడు అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌ల కోసం ఇంగ్లండ్‌ లయన్స్‌ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అహ్మదాబాద్‌ వేదికగా ఇంగ్లండ్‌ లయన్స్‌తో జరిగిన తొలి అనధికారిక టెస్ట్‌లో  శ్రీకర్‌ భరత్‌ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.

ఈ మ్యాచ్‌లో సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఆజేయ శతకం సాధించాడు. ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన భరత్‌.. 165 బంతుల్లో 15 ఫోర్లతో 116 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఇంగ్లండ్‌ లయన్స్ తొలి ఇన్నింగ్స్‌ను 553/8 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది.

అనంతరం భారత్‌-ఏ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 227 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో రజిత్‌ పాటిదార్‌(151) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌-ఎ జట్టు పుంజుకుంది.  డ్రాగా ముగిసే సమయానికి సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఇండియా-ఎ జట్టు 5 వికెట్ల నష్టానికి 426 పరుగులు చేసింది. భారత సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో భరత్‌తో పాటు సాయిసుదర్శన్‌(97), మనవ్‌ సుతార్‌(89) సత్తాచాటారు.

తుది జట్టులో చోటు ఖాయమేనా?
ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఇదివరకే ప్రకటించిన తొలి రెండు టెస్టుల సిరీస్‌లో స్పెషలిస్టు వికెట్‌ కీపర్‌ కోటాలో భరత్‌ చోటు దక్కించుకున్నాడు. అతడితో పాటు యువ వికెట్‌ కీపర్‌ దృవ్‌ జురల్‌కు కూడా జట్టులో ఛాన్స్‌ లభించింది. అయితే దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు వికెట్‌ కీపర్‌గా వ్యవహరించిన కేఎల్‌ రాహుల్‌.. ఈ సిరీస్‌లో కేవలం స్పెషలిస్టు బ్యాటర్‌గానే ఆడనున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో అనాధికారిక టెస్టులో సెంచరీతో చెలరేగిన భరత్‌కు వికెట్‌ కీపర్‌గా తుది జట్టులో చోటు దక్కడం ఖాయమని క్రికెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య టెస్టు సిరీస్‌ జనవరి 25 నుంచి హైదరాబాద్‌ వేదికగా ప్రారంభం కానుంది.
 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement