
బ్యాటింగ్ ఆర్డర్‌లో టీమిండియా యాజమాన్యం తరచూ మార్పులు చేయడం సరికాదని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నిక్ కాంప్టన్ (Nick Compton) అన్నాడు. మేనేజ్‌మెంట్ నిలకడలేమితనం కారణంగా ఆటగాళ్లు ఇబ్బంది పడతారని.. ఇది వారి ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నాడు. ఇందుకు కేఎల్ రాహుల్ నిదర్శనం అని కాంప్టన్ తెలిపాడు.
కాగా టెస్టుల్లో కేఎల్ రాహుల్ (KL Rahul) గత కొన్నాళ్లుగా వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే కొన్నిసార్లు ఓపెనర్‌గా.. మరికొన్నిసార్లు మిడిలార్డర్ బ్యాటర్‌గా బరిలోకి దిగాడు. ముఖ్యంగా రోహిత్ శర్మ గైర్హాజరీలో ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (Border- Gavaskar Trophy)లో ఓపెనర్‌గా వచ్చిన అతడు.. రోహిత్ రాకతో మళ్లీ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేశాడు.
రోహిత్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో
ఇక ఇంగ్లండ్ పర్యటనకు ముందే రోహిత్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో.. ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ స్థానం సుస్థిరమైంది. యశస్వి జైస్వాల్‌తో కలిసి ఇంగ్లండ్ గడ్డ మీద అద్భుత ఆట తీరుతో ఈ కర్ణాటక బ్యాటర్ ఆకట్టుకుంటున్నాడు.
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ నిక్ కాంప్టన్ మాట్లాడుతూ.. రాహుల్ పట్ల టీమిండియా మేనేజ్‌మెంట్ వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టాడు. ‘‘ఇంగ్లండ్ జట్టును చూడండి. జో రూట్ ఎల్లప్పుడూ నాలుగో స్థానంలోనే బ్యాటింగ్ చేస్తాడు.
ఓపెనర్లు కూడా మారరు. కానీ టీమిండియాలో శుబ్‌మన్ గిల్ ఓసారి మూడో స్థానంలో ఆడతాడు. ఇంకోసారి మరెవరో.. మళ్లీ గిల్ తిరిగి వస్తాడు. ఇలాంటి నిర్ణయాల వల్ల ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది.
అందుకే రాహుల్ వరుసగా విఫలమయ్యాడు
ఇక కేఎల్ రాహుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో అతడిని అటూ.. ఇటూ మారుస్తూనే ఉన్నారు. ఫలితంగా అతడి ప్రదర్శన ప్రభావితం అయింది. రాహుల్ వరుసగా విఫలమయ్యాడు.
నిజానికి అతడు ప్రతిభావంతుడైన ఆటగాడు. ఇప్పుడు సత్తా చాటుతున్నాడు. అయినా కరుణ్ నాయర్ వంటి ఆటగాళ్ల విషయంలో టీమిండియా త్వరత్వరగా నిర్ణయాలు మార్చేసుకోవడం సరికాదు. ఇంగ్లండ్ జట్టులో ఎవరిపై అంత తేలికగా వేటు వేయరు.
సాయి సుదర్శన్ టాలెంట్ ప్లేయర్. కానీ అతడిని తప్పించి కరుణ్ నాయర్‌ను తీసుకురావడం.. మళ్లీ కోసం కరుణ్ నాయర్‌పై వేటు వేసి అతడిని తప్పించడం సరికాదు. సెలక్షన్‌లో నిలకడ లేకపోవడం వల్ల జట్టు నిర్మాణం దెబ్బతింటుంది’’ అని అభిప్రాయపడ్డాడు. కాంప్టన్ రెవ్‌స్పోర్ట్స్‌తో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
రెండు శతకాలు
కాగా ఇంగ్లండ్‌తో టెస్టుల్లో తిరిగి ఓపెనర్‌గా వస్తున్న కేఎల్ రాహుల్ ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు చేసిన పరుగులు వరుసగా.. 42, 137, 2, 55, 100, 39, 46, 90.
ఇక ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియాపై ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు 2-1తో ఆధిక్యంలో ఉంది. ఆఖరిదైన ఐదో టెస్టులో గెలిస్తేనే గిల్ సేన సిరీస్‌ను 2-2తో సమం చేయగలుగుతుంది. ఇదిలా ఉంటే.. తొలి టెస్టులో సాయి సుదర్శన్‌ను మూడో స్థానంలో ఆడించిన యాజమాన్యం.. రెండు, మూడో టెస్టుల్లో ఆ స్థానంలో కరుణ్ నాయర్‌ను పంపింది.
ఇక నాలుగో టెస్టులో తిరిగి సాయిని పిలిపించిన సెలక్టర్లు.. కరుణ్‌పై వేటు వేశారు. మరోవైపు.. విరాట్ కోహ్లి రిటైర్మెంట్ నేపథ్యంలో కొత్త కెప్టెన్ శుబ్‌మన్ గిల్ టెస్టుల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్నాడు. అంతకుముందు అతడు వన్‌డౌన్‌లో వచ్చేవాడు.
చదవండి: WCL 2025: స్టువర్ట్ బిన్నీ విధ్వంసం, యువీ, పఠాన్ మెరుపులు.. సెమీస్‌లో ఇండియా