ఐపీఎల్-2026 సీజన్ వేలానికి ముందు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి మరో జట్టుకు ట్రేడ్ కానున్నాడని జోరుగా ప్రచారం సాగింది. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం రాహుల్‌ను తమతోనే అంటిపెట్టుకుని ట్రేడ్ ఊహాగానాలకు చెక్ పెట్టింది. అతడి అనుభవాన్ని మరోసారి ఉపయోగించుకోవాలని ఢిల్లీ నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు సుబ్రమణ్యం బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన బ్యాటింగ్ పొజిషన్ విషయంలో రాహుల్‌కు ఢిల్లీ మేనేజ్‌మెంట్‌కు మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయని బద్రీనాథ్ అభిప్రాయపడ్డాడు. తన బ్యాటింగ్ స్ధానాన్ని పదే పదే మార్చడంపై కేఎల్ రాహుల్ ఆసంతృప్తి వ్యక్తం చేసినట్లు అతడు తెలిపాడు.
కాగా గత సీజన్‌లో రాహుల్ కొన్ని మ్యాచ్‌లలో మిడిలార్డర్‌లోనూ, మరి కొన్ని మ్యాచ్‌లలో టాపార్డర్‌లోనూ బ్యాటింగ్‌కు వచ్చాడు. మ్యాచ్ మ్యాచ్‌కూ అతడి స్ధానం మరిపోయేది. అయినప్పటికి ఈ కర్ణాటక బ్యాటర్ దుమ్ములేపాడు. రాహుల్ గత సీజన్‌లో 150 స్ట్రైక్ రేట్‌తో 539 పరుగులు చేసి ఢిల్లీ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
'ప్రతీ సంవత్సరం కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు తలనొప్పిగా మారింది. అతడిని ఏ స్ధానంలో ఆడించాలో ఆ జట్టు సరిగా తేల్చుకోలేకపోతోంది. రాహుల్ ఓపెనింగ్ చేయడం ఇష్టం. కానీ టీమ్ మేనేజ్‌మెంట్ మాత్రం అతన్ని మిడిల్ ఆర్డర్‌లో ఆడించాలని చూస్తోంది.
ఈ విషయంలో టీమ్ మెనెజ్‌మెంట్, రాహుల్ మధ్య విభేదాలు ఉన్నట్లు కన్పిస్తోంది. కచ్చితంగా ఈ సమస్యను తప్పకుండా పరిష్కరించుకోవాలి. అసలు ఢిల్లీ జట్టులో కేఎల్ సంతోషంగా ఉన్నాడో, లేదో స్పష్టత లేదు' అని తన యూట్యూబ్ ఛానల్‌లో బద్రీనాథ్ పేర్కొన్నాడు. అయితే ఈ ఏడాది సీజన్‌లో రాహుల్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. అతడితో పాటు ఇంగ్లండ్ స్టార్ బెన్ డకెట్ ఢిల్లీ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నట్లు సమాచారం.
చదవండి: T20 WC: డీఎస్పీగా సంజూ శాంసన్!?


