కేఎల్‌ రాహుల్‌ను ఫాలో అవుతున్న ఆఫ్ఘనిస్తాన్‌ యువ ఆటగాడు | KL Rahul And Omarzai Have Been 2 Best Batters At Number 5 In Recent ODIs | Sakshi
Sakshi News home page

కేఎల్‌ రాహుల్‌ను ఫాలో అవుతున్న ఆఫ్ఘనిస్తాన్‌ యువ ఆటగాడు

Feb 14 2024 6:41 PM | Updated on Feb 14 2024 7:15 PM

KL Rahul And Omarzai Have Been 2 Best Batters At Number 5 In Recent ODIs - Sakshi

ఆఫ్ఘనిస్తాన్‌ యువ ఆటగాడు అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ టీమిండియా మిడిలార్డర్‌ స్టార్‌ కేఎల్‌ రాహుల్‌ను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది. ఒమర్‌జాయ్‌ ట్రాక్‌ రికార్డు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్దమవుతుంది. రాహుల్‌లాగే వన్డేల్లో ఐదో స్థానంలో బరిలోకి దిగే ఒమర్‌జాయ్‌.. ఇంచుమించు అతనిలాగే పరుగులు సాధిస్తున్నాడు.

గత కొంతకాలంగా ఈ ఇద్దరు వన్డేల్లో కీలకమైన ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతూ జట్టుకు ఉపయోగపడే కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారు. ఇటీవలికాలంలో మిడిలార్డర్‌లో చూసిన బెస్ట్‌ బ్యాటర్లు వీరేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ ఇద్దరూ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడటమే కాకుండా అవసరమైతే బ్యాట్‌ను ఝులిపిం​చగల సమర్దులు కూడా.

గత కొన్ని ఇన్నింగ్స్‌ల్లో వీరి బ్యాటింగ్‌ శైలే ఇందుకు నిదర్శనం. వరల్డ్‌కప్‌-2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్‌ చేసిన మెరుపు సెంచరీ.. కొద్ది రోజుల కిందట శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఒమర్‌జాయ్‌ చేసిన విధ్వంసకర శతకం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.

రాహుల్‌ విషయానికొస్తే.. అతను ఈ ఏడాది ఇంకా వన్డేల్లో బరిలోకి దిగలేదు. గతేడాది చివర్లో సౌతాఫ్రికా పర్యటనలో ఆడిన మ్యాచ్‌లే రాహుల్‌కు వన్డేల్లో చివరివి.

ఒమర్‌జయ్‌ విషయానికొస్తే.. ఈ 23 ఏళ్ల బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ ఈ ఏడాది ఇప్పటికే తన మార్కును చూపించాడు. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఇతను చెలరేగిపోతున్నాడు.

ఈ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో 115 బంతుల్లో 149 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన ఒమర్‌జాయ్‌.. ఇవాళ జరుగుతున్న మూడో మ్యాచ్‌లో అర్దసెంచరీతో (54) రాణించాడు.

ఈ మ్యాచ్‌లో ఒమర్‌జాయ్‌.. రహ్మత్‌ షాతో (65) కలిసి కీలక ఇన్ని​ంగ్స్‌ ఆడకపోయుంటే ఆఫ్ఘనిస్తాన్‌ కష్టాల్లో పడేది. ఒమర్‌జాయ్‌, రహ్మత్‌ షా, రహ్మనుల్లా గుర్బాజ్‌ (48), ఇక్రమ్‌ (32) రాణించడంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌ 48.2 ఓవర్లలో 266 పరుగులు చేసి ఆలౌటైంది. లంక బౌలర్లలో మధుషన్‌ 3, అషిత ఫెర్నాండో, దునిత్‌ వెల్లలగే, అఖిల ధనంజయ తలో 2 వికెట్లు పడగొట్టారు. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన శ్రీలంక సిరీస్‌ను ఇదివరకే కైవసం చేసుకుంది. 

  • గత 10 వన్డే ఇన్నింగ్స్‌ల్లో కేఎల్‌ రాహుల్‌ స్కోర్లు.. 21, 56, 66, 39, 102, 8, 21, 39, 27
  • గత 10 వన్డే ఇన్నింగ్స్‌ల్లో ఒమర్‌జాయ్‌ స్కోర్లు.. 54, 3, 149 నాటౌట్‌, 97 నాటౌట్‌, 22, 31 నాటౌట్‌, 73 నాటౌట్‌, 27, 19, 62

పై గణాంకాలు చూస్తే రాహుల్‌ కంటే ఒమర్‌జాయ్‌ ఇంకా మెరుగ్గా కనిపిస్తున్నాడు. 


 

Advertisement
 
Advertisement
Advertisement