వరుసగా రెండో మ్యాచ్‌లో శతక్కొట్టిన రింకూ | Rinku Singh back to back hundreds in Ranji Trophy | Sakshi
Sakshi News home page

వరుసగా రెండో మ్యాచ్‌లో శతక్కొట్టిన రింకూ

Oct 18 2026 3:55 PM | Updated on Oct 18 2026 4:16 PM

Rinku Singh back to back hundreds in Ranji Trophy

టీమిండియా డాషింగ్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ రింకూ సింగ్‌ దేశవాలీ క్రికెట్‌లో చెలరేగిపోతున్నాడు. రంజీ ట్రోఫీ 2026-27లో వరుసగా రెండో మ్యాచ్‌లో సెంచరీతో కదంతొక్కాడు. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో బిహార్‌పై (112 నాటౌట్‌) శతక్కొట్టిన రింకూ, గోవాతో ఇవాళ మొదలైన రెండో మ్యాచ్‌లోనూ శతకం (100 నాటౌట్‌) బాదాడు.

ఈ మ్యాచ్‌లో రింకూ జట్టు ఉత్తర్‌ప్రదేశ్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే ఆ జట్టు ఆదిలోనే తీవ్ర కష్టాల్లో చిక్కుకుంది. 90 పరుగులకే ఆ జట్టు టాప్‌-4 బ్యాటర్లు ఔటయ్యారు. ఈ దశలో బరిలోకి దిగిన రింకూ సింగ్‌ ఒంటరిపోరాటం చేశాడు. మరో ఎండ్‌లో వరుసగా వికెట్లు పడుతున్నా, ఏకాగ్రతతో బ్యాటింగ్‌ చేసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

137 పరుగుల వద్దే యూపీ తొమ్మిదో వికెట్‌ కోల్పోయినా, రింకూ వీరోచిత ప్రదర్శన చేసి సెంచరీ పూర్తి చేశాడు. వన్ష్‌ చౌదరితో చివరి వికెట్‌కు అజేయమైన 49 పరుగులు జోడించి మూడంకెల మార్కును అందుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 165 బంతులు ఎదుర్కొన్న రింరూ 10 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 102 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. వన్ష్‌ చౌదరి 4 పరుగులతో రింకూకు జతగా ఉన్నాడు. 

67 ఓవర్లు ముగిసే సమయానికి యూపీ స్కోర్‌ 186-9గా ఉంది. రింకూ మినహా యూపీ ఇన్నింగ్స్‌లో ఎవ్వరూ పెద్ద స్కోర్‌ చేయలేదు. ఓపెనర్‌ మాధవ్‌ కౌశిక్‌ (45) రింకూ తర్వాత టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు కెప్టెన్‌ ఆర్యన్‌ జుయల్‌ (14) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. గోవా బౌలర్లలో యశ్‌ కస్వంకర్‌ 4 వికెట్లతో చెలరేగాడు. రుత్విక్‌ నాయక్‌ 2, షుభమ్‌ తివారి, లలిత్‌ యాదవ్‌ తలో వికెట్‌ తీశారు.

ఇదిలా ఉంటే, రంజీ ట్రోఫీలో వరుస సెంచరీలు చేస్తున్న రింకూకు ప్రస్తుతం భారత జట్టు ఏ ఫార్మాట్‌లోనూ చోటు లేదు. కనీసం అతడికి న్యూజిలాండ్‌ పర్యటన కోసం ఎంపిక చేసిన భారత-ఏ జట్టులోనూ చోటు దక్కలేదు. తాజా ప్రదర్శనలతో రింకూ భారత సెలెక్టర్లకు సవాల్‌ విసురుతున్నాడు. టీ20లతో పాటు వన్డే, టెస్ట్‌ జట్టులో చోటుకు అర్హుడినంటూ చెప్పకనే చెప్పాడు. 

రింకూకు టీ20లతో పాటు ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లోనూ మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. 55 మ్యాచ్‌ల్లో అతడు 11 సెంచరీలు, 23 అర్ద సెంచరీల సాయంతో 60 సగటున పరుగులు చేశాడు. మిడిలార్డర్‌లో ఏ బ్యాటర్‌కైనా ఈ గణాంకాలు అత్యుత్తమమని చెప్పాలి. రింకూ ఇటీవలే ఫామ్‌లేమి కారణంగా భారత టీ20 జట్టులో స్థానం కోల్పోయిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: శ్రేయస్‌ అయ్యర్‌కు స్పెషల్‌ అవార్డు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement