అఫ్గానిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. వివాదాస్పద 'డురాండ్ లైన్' వెంబడి అఫ్గాన్ బలగాలతో జరిగిన భీకర కాల్పులలో దాదాపు ఏడుగురు పాకిస్థాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. సరిహద్దు భద్రత, ఉగ్రవాద కదలికలపై ఇరు దేశాల మధ్య కొంతకాలంగా రాజుకుంటున్న ఉద్రిక్తతలే ఈ హింసాత్మక ఘర్షణకు దారితీశాయి.
ఎక్కడ జరిగిందంటే?
అఫ్గానిస్తాన్ పక్తియా ప్రావిన్స్ పరిధిలోని దండ్ పటాన్ జిల్లా, వ్యూహాత్మక ఖర్లాచీ గేట్, అలాగే టాప్ సార్, కొంజ్ అలీ ప్రాంతాలలో మధ్యాహ్నం సమయంలో ఈ భారీ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ భీకర పోరు కారణంగా ఇరు దేశాల మధ్య సరిహద్దు వాణిజ్యం పూర్తిగా నిలిచిపోయింది. సరిహద్దు గ్రామాల ప్రజలు ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చింది.
ఇరు దేశాల వాదనలు ఇవే..
పాకిస్థాన్ ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా సరిహద్దులో అక్రమంగా అవుట్పోస్టులను నిర్మిస్తోందని, తమ భూభాగం వైపు నుంచి వచ్చిన పాక్ కాల్పులను తిప్పికొట్టామని అఫ్గాన్ భద్రతా వర్గాలు స్పష్టం చేశాయి. ఈ ఎదురుకాల్పుల్లోనే పాక్ సైనికులు మృతి చెందినట్లు వెల్లడించాయి. మరోవైపు కుర్రమ్ జిల్లాలోని తమ చెక్పోస్టులపై అఫ్గాన్ సరిహద్దు గార్డులే తొలుత కాల్పులు జరిపారని పాక్ అధికారులు ఆరోపించారు.


