వాషింగ్టన్: అమెరికా రాజకీయాల్లో ప్రతిష్టాత్మకమైన వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ పదవిలో ఊహించని నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. నూతన ప్రెస్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన కేటీ జకారియా కేవలం ఐదు రోజులకే తన పదవిని కోల్పోయారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం ఆమెను అత్యంత వేగంగా బాధ్యతల నుండి తప్పించడం హాట్ టాపిక్‌గా మారింది.
శుక్రవారం ఉదయం ఎప్పటిలాగే విధులకు హాజరైన జకారియా.. రూజ్వెల్ట్ రూమ్‌లో కమ్యూనికేషన్స్ టీమ్‌తో జరిగిన కీలక సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వెస్ట్ వింగ్‌లోని తన కార్యాలయంలో కూర్చుని ది వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రతినిధులకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తున్నారు. తన భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడుతున్నారు.
సరిగ్గా అదే సమయంలో ట్రంప్ సీనియర్ సలహాదారు జేసన్ మిల్లర్ ఆమె ఆఫీస్ తలుపు తట్టారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మనతో ఒకసారి మాట్లాడాలనుకుంటున్నారు. కాస్త పక్కకు వస్తారా అని మిల్లర్ కోరారు. దాంతో ఇంటర్వ్యూను మధ్యలోనే ఆపేసి వెన్స్ని కలవడానికి వెళ్లిన జకారియా.. తిరిగి ఆ గదిలోకి రాలేదు. తన ఉద్యోగంలోనూ కొనసాగలేకపోయారు. వాన్స్ భేటీ జరిగిన కొద్ది క్షణాల్లోనే ఆమెపై వేటు పడింది.
ట్రంప్ ముందే హెచ్చరించారా?
ఈ పరిణామంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. అదే రోజు ఉదయం తాను జకారియాతో మాట్లాడినట్లు గుర్తుచేసుకున్నారు. నేను ఆమెతో అన్నాను.. కేటీ, ఈ ఉద్యోగం నిజంగా నీకు అవసరమా? నిజాయితీగా చెప్పాలంటే ఈ పదవి నీకు అనవసరం అని చెప్పాను. నేను గనుక ఆమె స్థానంలో ఉంటే ఈ ఉద్యోగం గురించి మరోసారి ఆలోచించుకునేవాడినని అన్నాను అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
కోల్పోయిన తర్వాత తర్వాత జకారియా ఫోన్ ద్వారా వాల్ స్ట్రీట్ జర్నల్‌తో మాట్లాడారు. నాకు ఉన్న పరిమిత సమయం, సమాచారంతో ప్రెస్ బ్రీఫింగ్ను సమర్థవంతంగా నిర్వహించడానికి నా శక్తినంతటినీ ధారపోశాను. ట్రంప్‌కు, అమెరికా ప్రజలకు నా శ్రేష్ఠమైన సేవలు అందించడమే నా లక్ష్యంగా పనిచేశాను అని పేర్కొన్నారు.
వేటుకు దారితీసిన కారణాలు ఇవే..
కేటీ జకారియా ప్రెస్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆమె నిర్వహించిన మొదటి ప్రెస్ బ్రీఫింగ్ ఏమాత్రం ఆకట్టు కోలేకపోయింది. దీనికి తోడు ఆమె విద్యార్హతలు, నేపథ్యంపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. తాను సుదీర్ఘకాలంగా న్యాయవాదిగా పని చేస్తున్నట్లు జకారియా చెప్పుకొచ్చారు. అయితే, ఆమె అమెరికాలోని ఏ రాష్ట్రంలోనైనా లేదా గతంలో తాను పనిచేసిన చైనాలోని భారీ లా ఫామ్లోనైనా బార్ ఎగ్జామ్ పాసయ్యారా? లేదా? అనే విషయాన్ని స్పష్టం చేయడంలో విఫలమయ్యారు. చివరికి, ఆమె అసలు బార్ ఎగ్జామ్ పాస్ కాలేదని వాల్ స్ట్రీట్ జర్నల్ ఆధారాలతో సహా నిరూపించింది.
కొత్త బాధ్యతల్లోకి జకారియా?
జకారియా తొలగింపుపై వస్తున్న రకరకాల ఊహాగానాలను వైట్‌హౌస్ కొట్టిపారేసింది. ఆమె ట్రంప్ ప్రభుత్వంలోనే కొనసాగుతారని, అయితే ఆమెకు కేటాయించే కొత్త బాధ్యతలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి.
ఇదీ చదవండి : కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది సైనికుల మృతికి కారణమయ్యాడు?


