కీవ్: ఉక్రెయిన్‌తో రష్యా సాగిస్తున్న భీకర యుద్ధంలో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ అనుసరిస్తున్న యుద్ధ విధానాలపై సొంత సైన్యంలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్త మవుతోందనడానికి నిదర్శనంగా ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రష్యా సైన్యంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ లెఫ్టినెంట్ స్థాయి ఆఫీసర్ ఏకంగా తన దేశానికే వెన్నుపోటు పొడిచాడు. రహస్య సమాచారాన్ని, వ్యూహాత్మక వివరాలను ఉక్రెయిన్‌కు చేరవేయడం ద్వారా ఏకంగా 300 మందికి పైగా రష్యన్ సైనికులు ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యాడు. అంతర్జాతీయ మీడియా సంస్థ వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
సెయింట్ పీటర్స్ బర్గ్‌లోని బుడ్యోన్నీ మిలటరీ అకాడమీ ఆఫ్ ది సిగ్నల్ కార్ప్స్ గ్రాడ్యుయేట్ స్టుప్నికోవ్.. ఉక్రెయిన్‌లోని డాన్బాస్ ప్రాంతంలో కీలకమైన వ్యూహాత్మక స్థానమైన వూహ్లెడార్ను స్వాధీనం చేసుకునే బాధ్యతలు చేపట్టిన రష్యా బెటాలియన్‌కు చీఫ్ సిగ్నల్స్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. కమాండర్లకు, యూనిట్లకు మధ్య కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను కాపాడడం ఆయన ప్రధాన విధి. కానీ, ఆయన తన అధికారాన్ని దుర్వినియోగం చేసి, ఉక్రెయిన్ మిలటరీ ఇంటెలిజెన్స్‌కు రష్యా సైనిక స్థానాలు, కదలికలకు సంబంధించిన ఖచ్చితమైన వివరాలను రహస్యంగా అందించడం ప్రారంభించారు.
యుద్ధమే అతని ఆలోచనలను మార్చేసింది!
2022 ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించినప్పుడు ..రష్యన్ హెలికాప్టర్లు ఉక్రెయిన్ నగరాలపై బాంబులు వర్షం కురిపించడం చూసి స్టుప్నికోవ్ తీవ్రంగా చలించిపోయారు. ఇది పూర్తిగా దుర్మార్గం అని భావించిన ఆయన, రష్యాలో పుతిన్ వ్యతిరేక వీడియోలు, ఉక్రెయిన్ చెరలో ఉన్న రష్యా యుద్ధ ఖైదీల ఇంటర్వ్యూలను రోజూ రాత్రి పూట తన భార్య లీజాతో కలిసి చూసేవారు.
తల్లి సహాయంతో ఉక్రెయిన్ నెట్‌వర్క్‌తో కనెక్షన్
స్టుప్నికోవ్ తల్లి తటియానా యాంట్సెన్ (49) కూడా పుతిన్ పాలనను తీవ్రంగా వ్యతిరేకించారు. 2024 ఫిబ్రవరిలో ఆమె ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్‌కు అనుసంధానంగా పనిచేస్తున్న డిమిట్రో కార్పెంకో అనే కంప్యూటర్ ప్రోగ్రామర్‌ను సంప్రదించారు. రష్యా సైనికులు ఎవరైనా సైనిక సమాచారం అందిస్తే నెలకు 4వేల డాలర్లు (సుమారు రూ.3.3 లక్షలు) నగదు బహుమతి ఇస్తామని ఆఫర్ ప్రకటించడంతో, స్టుప్నికోవ్ ఈ నెట్వర్క్ ద్వారా సమాచారం చేరవేయడం మొదలుపెట్టారు.
ఒకే ఒక్క దాడిలో 68 మంది మృతి..
ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో చలికాలం ఉదయం పూట..స్టుప్నికోవ్ కడుపునొప్పిగా నటిస్తూ తన సహచర సైనికుల నుంచి దూరంగా వెళ్లి, రష్యా బలగాలు సమావేశమైన ప్రాంతాల కోఆర్డినేట్లను ఉక్రెయిన్‌కు చేరవేశాడు. వెంటనే ఉక్రెయిన్ సైన్యం మెరుపు క్షిపణి దాడికి పాల్పడింది. ఈ దాడుల్లో ఓ కల్నల్‌తో సహా ఏకంగా 68 మంది రష్యా సైనికులు అక్కడికక్కడే మరణించగా, మరో 60 మంది గాయపడ్డారు.
ఈ దాడి తర్వాత ఉక్రెయిన్ కాంటాక్ట్ స్టుప్నికోవ్కు మెసేజ్ చేస్తూ.. ‘పేలుళ్లు జరిగాయా? ఫోటో పంపు’ అనగా, దానికి ఆయన కూల్‌గా.. ‘ఇక్కడ కేవలం మాంసం ముక్కలే మిగిలాయి’ అని బదులిచ్చారు. ఈ సమాచారం ద్వారా మొత్తం 300 మందికి పైగా రష్యన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారని డబ్ల్యూఎస్‌జే నివేదించింది.
ఫ్రంట్‌లైన్ దాటి ఉక్రెయిన్‌లోకి పరారీ
2024 జూలైలో ఓ రాత్రి సమయంలో స్టుప్నికోవ్ తన రష్యన్ యూనిట్ నుంచి తప్పించుకుని ఉత్తరం వైపు ఉక్రెయిన్ స్థావరాల వైపు పరుగెత్తారు. ఉక్రెయిన్ 72వ బ్రిగేడ్ సైనికులు అడిగిన ‘పాస్‌కోడ్’ ‘పీనట్ షాప్’ అని చెప్పి వారి అదుపులోకి వెళ్లారు. ఆ తర్వాత ఆయన పుతిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న రష్యన్ వాలంటీర్ కార్ప్స్లో చేరారు. ప్రస్తుతం ఆయన అదే యూనిట్లో కమ్యూనికేషన్ స్పెషలిస్ట్‌గా సేవలందిస్తున్నారు.
నేను నా ప్రమాణాన్ని విచ్ఛిన్నం చేశానా? స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, రాజ్యాంగ వ్యవస్థను కాపాడుతానని నేను ప్రతిజ్ఞ చేశాను. కానీ, పుతిన్ ఆ మూడింటిని పూర్తిగా నాశనం చేశారు అంటూ స్టుప్నికోవ్ వాపోయారు. అయితే ఈ పరిణామాల కారణంగా ఆయన తన కుటుంబాన్ని దూరం చేసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన ఫ్రంట్‌లైన్ ప్రాంతాల్లో శత్రు డ్రోన్ల నుంచి కమ్యూనికేషన్ పరికరాలను కాపాడుకుంటూ అత్యంత సాదాసీదా జీవితం గడుపుతున్నారు.


