source: X
అబుదాబీ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 346 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్‌కు ధీటుగా బదులిస్తుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్, కెప్టెన్ రహ్మత్ షా (84 నాటౌట్) సెంచరీ దిశగా సాగుతున్నాడు.
అతడికి జతగా వికెట్‌కీపర్ ఇక్రమ్ అలీఖిల్ (26 నాటౌట్) బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. అంతకుముందు ఓపెనర్ అబ్దుల్ మలిక్ (62) అర్ద సెంచరీతో రాణించారు. సెదికుల్లా అటల్ 17, షాహిదుల్లా కమల్ 20, సీనియర్ బ్యాటర్ హష్మతుల్లా షాహిది డకౌటయ్యారు. బంగ్లా బౌలర్లలో ఎబాదత్ హొసేన్ 2, హసన్ మహముద్, మెహిది హసన్ మిరాజ్ తలో వికెట్ పడగొట్టారు.
ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు షద్మాన్ ఇస్లాం (67), తంజిద్ హసన్ (83)తో పాటు వికెట్‌కీపర్ లిట్టన్ దాస్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. మొమినుల్ హక్ (39), కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో (29), మెహిది హసన్ మిరాజ్ (24), నయీమ్ హసన్ (35 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
వెటరన్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం, ఎబాదత్ హొసేన్ డకౌట్లు కాగా.. హసన్ మహముద్ 2, తైజుల్ ఇస్లాం 9 పరుగులు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో మొహమ్మద్ సలీం సఫీ 4, యమిల్ అహ్మద్‌జాయ్ 3, ఇస్మత్ ఆలం 2, ఖైస్ అహ్మద్ ఒక వికెట్ తీశారు.
ఇదీ చదవండి: రెన్షా వీరోచిత పోరాటం.. తృటిలో డబుల్ సెంచరీ మిస్


