source: X
ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్, ఆ జట్టు టెస్ట్ కెప్టెన్ కూడా అయిన రహ్మత్ షా ఓ అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్ కెప్టెన్సీ అరంగేట్రంలోనే సెంచరీ సాధించిన అతి కొద్ది మంది ఆటగాళ్ల సరసన చేరాడు. ఈ జాబితాలో టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి, స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ లాంటి వారు ఉన్నారు. అబుదాబీ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో షా ఈ ఘనత సాధించాడు.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అతడు 216 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 105 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఓ పక్క వికెట్లు పడుతున్నా, షా పట్టుదలగా బ్యాటింగ్ చేసి తన సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.
షా సెంచరీ సాయంతో ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 240 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో షాతో పాటు ఓపెనర్ అబ్దుల్ మాలిక్ (62) మాత్రమే రాణించాడు. బంగ్లా పేసర్ హసన్ మహ్ముద్ హ్యాట్రిక్ సహా 5 వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. అతడికి ఎబాదత్ హొసేన్ (4-56), మెహిది హసన్ మిరాజ్ (1-41) కూడా సహకరించారు. వీరి ధాటికి ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లయ్యారు.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ మూడో రోజు రెండో సెషన్ సమయానికి 3 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. షద్మాన్ ఇస్లాం (13), తంజిద్ హసన్ (31), మొమినుల్ హక్ (7) ఔట్ కాగా.. కెప్టెన్ నజ్ముల్ హసన్ (14), ముష్ఫికర్ రహీం (37) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ 210 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
అంతకుముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 346 పరుగులకు ఆలౌటైంది. షద్మాన్ (67), తంజిద్ హసన్ (83), లిటన్ దాస్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఆఫ్ఘన్ బౌలర్లలో మొహమ్మద్ సలీమ్ సఫీ 4 వికెట్లతో రాణించాడు.
రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ చేస్తే..?
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన రహ్మత్ షా, రెండో ఇన్నింగ్స్‌లో కూడా సెంచరీ చేస్తే అత్యంత అరుదైన రికార్డు సాధిస్తాడు. టెస్టు కెప్టెన్సీ అరంగేట్రంలో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, గ్రెగ్ చాపెల్ సరసన నిలుస్తాడు.
2014లో ఆడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో కోహ్లీ 115, 141 పరుగులు చేశాడు. తాజా సెంచరీ రహ్మత్ షాకు టెస్ట్‌ల్లో నాలువది. షా ఇప్పటికే ఆఫ్ఘన్ తరఫున అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. షా తర్వాత అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ఆఫ్ఘన్ బ్యాటర్ హష్మతుల్లా షాహిది (2).
ఇదీ చదవండి: వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన స్టీవ్ స్మిత్


