
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో 700 మ్యాచ్‌లు ఆడిన ఏకైక ప్లేయర్‌గా వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. పొలార్డ్ ప్రస్తుతం అమెరికా మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2025లో ఎంఐ న్యూయర్క్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
మంగళవారం డల్లాస్ వేదికగా శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్, ఎంఐ న్యూయర్క్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ ఆడేందుకు మైదానంలోకి అడుగుపెట్టిన పొలార్డ్.. ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 38 ఏళ్ల పొలార్డ్ 2006లో ట్రినిడాడ్ & టొబాగో తరపున టీ20 క్రికెట్‌లో అడుగుపెట్టాడు.
ఆ తర్వాత వెస్టిండీస్‌తో పాటు ఐపీఎల్, సీపీఎల్, బీబీఎల్, బీపీఎల్, అబుదాబి టీ20, టీ10 వంటి ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌లో భాగమయ్యాడు. ఐపీఎల్‌లో 2010 నుంచి 2022కు ముంబై ఇండియన్స్‌కు ఈ కరేబియన్ దిగ్గజం ప్రాతనిథ్యం వహించాడు.
2023 సీజన్‌కు ముందు రిటైర్మెంట్ ప్రకటించిన పొలార్డ్.. ముంబై ఇండియన్స్ కోచింగ్ స్టాప్‌లో చేరాడు. ఇప్పటివరకు 700 టీ20లు ఆడిన పొలార్డ్.. 13,634 పరుగులతో పాటు 326 వికెట్లు పడగొట్టాడు. కాగా అత్యధిక టీ20లు ఆడిన జాబితాలో పొలార్డ్ తర్వాత స్ధానంలో డ్వైన్ బ్రావో(582), షోయబ్ మాలిక్(557) ఉన్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఎంఐ న్యూయర్క్‌పై 47 పరుగుల తేడాతో శాన్ ఫ్రాన్సిస్కో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శాన్ ఫ్రాన్సిస్కో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 246 పరుగుల భారీ స్కోర్ చేసింది.
శాన్ ఫ్రాన్సికో కెప్టెన్ మాథ్యూ షార్ట్ (43 బంతుల్లో 91 పరుగులు), జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ (26 బంతుల్లో 64 పరుగులు) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. అనంతరం భారీ లక్ష్య చేధనలో న్యూయర్క్ 199 పరుగులకే పరిమితమైంది.
చదవండి: IND vs ENG: 'అతడిని ఎందుకు తీసుకున్నారు.. నితీశ్ రెడ్డి వంద రెట్లు బెటర్'