
మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్‌లో ఆరోసారి స్వర్ణ పతకం సొంతం
సింగపూర్: సంవత్సరాలు గడుస్తున్నాయి.... ప్రత్యర్థులు మారుతున్నారు... కానీ ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో మాత్రం విజేత పేరు మారడం లేదు. 2013 నుంచి 2025 వరకు ఏడు ప్రపంచ చాంపియన్‌షిప్‌లు జరిగాయి. ఇందులో ఆరింటిలో (2013, 2015, 2017, 2022, 2023, 2025) కేటీ లెడెకీకే స్వర్ణ పతకం లభించింది. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో లెడెకీ ఫైనల్ చేరుకున్నా అనారోగ్యం కారణంగా ఫైనల్ రేసు నుంచి వైదొలిగింది. లేదంటే లెడెకీ ఖాతాలోనే స్వర్ణం చేరేది.
ప్రస్తుతం సింగపూర్‌లో జరుగుతున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మంగళవారం జరిగిన 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో లెడెకీ తన సత్తా చాటుకుంది. ఇంతకుముందు 400 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో కాంస్యం నెగ్గిన లెడెకీ... 1500 మీటర్లలో పసిడి పతకం కైవసం చేసుకుంది. 15 నిమిషాల 26.44 సెకన్లలో రేసును ముగించిన ఆమె అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఇతర ఈవెంట్ల సంగతి పక్కన పెడితే... 1500 మీటర్లలో తనకు తిరుగులేదని లెడెకీ మరోసారి నిరూపించింది.
ఈ విభాగంలో ప్రపంచ అత్యుత్తమ స్విమ్మర్‌గా గుర్తింపు సాధించిన లెడెకీ... దశాబ్ద కాలంగా 1500 మీటర్లలో అత్యుత్తమ మహిళా స్విమ్మర్‌గా కొనసాగుతోంది. ఈ ఈవెంట్‌లో ప్రపంచ 26 అత్యుత్తమ ప్రదర్శనల్లో 25 ఆమె పేరిట ఉన్నాయంటే... 1500 మీటర్లలో ఆమె ఆధిపత్యం ఎలా సాగుతోందో అర్థంచేసుకోవచ్చు. ‘నాకు ఈ రేసు అంటే చాలా ఇష్టం. 2013లో మొదటిసారి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టినప్పటి నుంచి 1500 మీటర్ల రేసును ప్రేమిస్తున్నా. ఇన్నేళ్లలో ఎన్నో గొప్ప విజయాలు దక్కడం ఆనందంగా ఉంది.
కొలనులో అడుగు పెట్టిన ప్రతిసారి అత్యుత్తమ ప్రదర్శన చేయాలనే భావిస్తా. అందుకు తగ్గట్లే కష్టపడతా. ప్రస్తుత టైమింగ్‌తో సంతోషంగా ఉన్నా’ అని లెడెకీ వెల్లడించింది. మంగళవారం పోటీలో ఒకానొక దశలో ప్రపంచ రికార్డు వేగం కంటే ముందున్న లెడెకీ చివర్లో కాస్త వెనుకబడింది. మహిళల స్విమ్మింగ్‌లో ఏకఛత్రాధిపత్యం కనబరుస్తున్న లెడెకీకి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఇది 22వ స్వర్ణం కాగా... ఓవరాల్‌గా 28వది. ఒలింపిక్స్‌లో సాధించిన 9 పసిడి పతకాలు, మొత్తంగా 14 మెడల్స్ కలుపుకుంటే... ఓవరాల్‌గా ఆమె పతకాల సంఖ్య 42. అందులో 31 స్వర్ణాలు ఉండటం విశేషం.
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షురాలు, 2004, 2008 ఒలింపిక్స్ 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ స్వర్ణ పతక విజేత క్రిస్టీ కొవెంట్రీ సమక్షంలో లెడెకీ పతకం నెగ్గింది. పోటీల మూడో రోజు మంగళవారం ఐదు అంశాల్లో ఫైనల్స్ నిర్వహించగా... పురుషుల 200 మీటర్ల ఫ్రీ స్టయిల్‌లో రొమేనియాకు చెందిన డేవిడ్ పొపొవిక్ వరుసగా రెండో సారి స్వర్ణ పతకం సాధించగా... పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో దక్షిణాఫ్రికాకు చెందిన పీటర్ కోట్జీ పసిడి పతకం ఖాతాలో వేసుకున్నాడు.
మహిళల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో జర్మనీకి చెందిన అన్నా ఎలెన్ సంచలనం సృష్టించింది. అమెరికా స్టార్ స్విమ్మర్ కేట్ డగ్లస్‌ను వెనక్కి నెడుతూ బంగారు పతకం కైవసం చేసుకుంది. పురుషుల 200 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో ల్యూక్ హబ్సన్ విజేతగా నిలిచాడు.
భారత స్విమ్మర్లకు నిరాశ
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత స్విమ్మర్ల నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు భారత స్విమ్మర్లు హీట్స్ దాటి ముందడుగు వేయలేకపోయారు. పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ విభాగంలో సజన్ ప్రకాశ్ 24వ స్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు దూరమయ్యాడు. ఈ విభాగంలో తొలి 16 స్థానాల్లో నిలిచిన వాళ్లు సెమీస్‌కు అర్హత సాధించారు. భారత్ నుంచి నేరుగా ఒలింపిక్స్ (టోక్యో 2020)కు అర్హత సాధించిన తొలి స్విమ్మర్‌గా రికార్డు సృష్టించిన 31 ఏళ్ల సజన్ ప్రకాశ్... ఈ టోర్నీ 200 ఫ్రీస్టయిల్‌లో 43వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.
ఇక 800 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో ఆర్యన్ నెహ్రా 23వ స్థానంలో నిలిచాడు. మంగళవారం పోటీలో ఆర్యన్ 8 నిమిషాల 21.30 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు. తొలి 8 స్థానాల్లో నిలిచిన వాళ్లు ఫైనల్‌కు చేరారు. మరోవైపు 50 మీటర్ల బటర్‌ఫ్లయ్ విభాగంలోనూ ఆర్యన్ 57వ స్థానంతో సరిపెట్టుకోగా... ఎస్పీ లికిత్ 50వ స్థానంలో నిలిచాడు.