breaking news
Katie ledecky
-
800 మీటర్లలో సప్త స్వర్ణం
సింగపూర్: ఒకటి కాదు...రెండు కాదు... మూడు కాదు... నాలుగు కాదు... వరుసగా ఏడోసారి కేటీ లెడెకీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. లాంగ్ డిస్టెన్స్ స్విమ్మింగ్‌లో తనకు తిరుగులేదని అమెరికా మహిళా స్టార్ స్విమ్మర్ నిరూపించుకుంది. ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ 800 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో 7వసారి లెడెకీ చాంపియన్‌గా నిలిచింది. 28 ఏళ్ల లెడెకీ 800 మీటర్ల విభాగంలో 7వసారి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. శనివారం హోరాహోరీగా సాగిన 800 మీటర్ల ఫైనల్ రేసును లెడెకీ 8 నిమిషాల 05.62 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ చాంపియన్‌షిప్‌లో నాలుగో స్వర్ణంపై గురి పెట్టిన సమ్మర్ మెకింటోష్ కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. మెకింటోష్ 8 నిమిషాల 07.29 సెకన్లలో రేసును ముగించి మూడో స్థానంలో నిలిచింది. లానీ పాలిస్టర్ (ఆస్ట్రేలియా; 8 నిమిషాల 05.98 సెకన్లు) రజత పతకాన్ని కైవసం చేసుకుంది. 700 మీటర్లు ముగిశాక మెకింటోష్ 0.14 సెకన్ల ఆధిక్యంలో ఉండగా... చివరి 100 మీటర్లలో లెడెకీ జోరు పెంచడంతో చివరకు మెకింటోష్ మూడో స్థానంతో, లానీ పాలిస్టర్ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచి్చంది. 16 ఏళ్ల ప్రాయంలో 2013 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 800 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో తొలిసారి స్వర్ణ పతకాన్ని గెల్చుకున్న లెడెకీ... 2015లో, 2017లో, 2019లో, 2022లో, 2023లోనే బంగారు పతకాలు సొంతం చేసుకోవడం విశేషం. ఇప్పటి వరకు ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో లెడెకీ 23 స్వర్ణాలు, 6 రజతాలు, 1 కాంస్యం సాధించింది. ఒలింపిక్స్‌లో 9 స్వర్ణాలు, 4 రజతాలు, 1 కాంస్యం కైవసం చేసుకుంది. ఓవరాల్‌గా లెడెకీ 44 ప్రపంచ, ఒలింపిక్ పతకాలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది.మిక్స్డ్ రిలేలో ప్రపంచ రికార్డుమరోవైపు మిక్స్డ్ ఫ్రీస్టయిల్ 4్ఠ100 రిలేలో జాక్ అలెక్సీ, ప్యాట్రిక్ సామన్, కేట్ డగ్లస్, టోరి హుస్కీలతో కూడిన అమెరికా జట్టు కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు పసిడి పతకాన్ని హస్తగతం చేసుకుంది. అమెరికా బృందం 3 నిమిషాల 18.48 సెకన్లలో రేసును ముగించి 2023లో 3 నిమిషాల 18.83 సెకన్లతో ఆ్రస్టేలియా బృందం నెలకొలి్పన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. మహిళల 50 మీటర్ల బటర్‌ఫ్లయ్ విభాగంలో గ్రెట్చెన్ వాల్‡్ష (అమెరికా; 24.83 సెకన్లు) బంగారు పతకాన్ని దక్కించుకుంది. పురుషుల 50 మీటర్ల ఫ్రీస్టయిల్లో పారిస్ ఒలింపిక్స్ చాంపియన్ కామెరాన్ మెక్ఇవోయ్ (ఆ్రస్టేలియా; 21.14 సెకన్లు) స్వర్ణ పతకాన్ని సాధించాడు. 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో డిఫెండింగ్ చాంపియన్ కేలీ మెక్కియోవన్ (ఆ్రస్టేలియా; 2ని:03.33 సెకన్లు) విజేతగా నిలిచి టైటిల్ నిలబెట్టుకున్నాడు. నేటితో ముగియనున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ప్రస్తుతం అమెరికా 8 స్వర్ణాలు, 11 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి మొత్తం 26 పతకాలతో నంబర్‌వన్ స్థానంలో ఉంది. -
లెడెకీ పసిడి ‘సిక్సర్’
సింగపూర్: సంవత్సరాలు గడుస్తున్నాయి.... ప్రత్యర్థులు మారుతున్నారు... కానీ ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో మాత్రం విజేత పేరు మారడం లేదు. 2013 నుంచి 2025 వరకు ఏడు ప్రపంచ చాంపియన్‌షిప్‌లు జరిగాయి. ఇందులో ఆరింటిలో (2013, 2015, 2017, 2022, 2023, 2025) కేటీ లెడెకీకే స్వర్ణ పతకం లభించింది. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో లెడెకీ ఫైనల్ చేరుకున్నా అనారోగ్యం కారణంగా ఫైనల్ రేసు నుంచి వైదొలిగింది. లేదంటే లెడెకీ ఖాతాలోనే స్వర్ణం చేరేది. ప్రస్తుతం సింగపూర్‌లో జరుగుతున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మంగళవారం జరిగిన 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో లెడెకీ తన సత్తా చాటుకుంది. ఇంతకుముందు 400 మీటర్ల ఫ్రీస్టయిల్లో కాంస్యం నెగ్గిన లెడెకీ... 1500 మీటర్లలో పసిడి పతకం కైవసం చేసుకుంది. 15 నిమిషాల 26.44 సెకన్లలో రేసును ముగించిన ఆమె అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఇతర ఈవెంట్ల సంగతి పక్కన పెడితే... 1500 మీటర్లలో తనకు తిరుగులేదని లెడెకీ మరోసారి నిరూపించింది. ఈ విభాగంలో ప్రపంచ అత్యుత్తమ స్విమ్మర్‌గా గుర్తింపు సాధించిన లెడెకీ... దశాబ్ద కాలంగా 1500 మీటర్లలో అత్యుత్తమ మహిళా స్విమ్మర్‌గా కొనసాగుతోంది. ఈ ఈవెంట్లో ప్రపంచ 26 అత్యుత్తమ ప్రదర్శనల్లో 25 ఆమె పేరిట ఉన్నాయంటే... 1500 మీటర్లలో ఆమె ఆధిపత్యం ఎలా సాగుతోందో అర్థంచేసుకోవచ్చు. ‘నాకు ఈ రేసు అంటే చాలా ఇష్టం. 2013లో మొదటిసారి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టినప్పటి నుంచి 1500 మీటర్ల రేసును ప్రేమిస్తున్నా. ఇన్నేళ్లలో ఎన్నో గొప్ప విజయాలు దక్కడం ఆనందంగా ఉంది. కొలనులో అడుగు పెట్టిన ప్రతిసారి అత్యుత్తమ ప్రదర్శన చేయాలనే భావిస్తా. అందుకు తగ్గట్లే కష్టపడతా. ప్రస్తుత టైమింగ్‌తో సంతోషంగా ఉన్నా’ అని లెడెకీ వెల్లడించింది. మంగళవారం పోటీలో ఒకానొక దశలో ప్రపంచ రికార్డు వేగం కంటే ముందున్న లెడెకీ చివర్లో కాస్త వెనుకబడింది. మహిళల స్విమ్మింగ్‌లో ఏకఛత్రాధిపత్యం కనబరుస్తున్న లెడెకీకి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఇది 22వ స్వర్ణం కాగా... ఓవరాల్‌గా 28వది. ఒలింపిక్స్‌లో సాధించిన 9 పసిడి పతకాలు, మొత్తంగా 14 మెడల్స్ కలుపుకుంటే... ఓవరాల్‌గా ఆమె పతకాల సంఖ్య 42. అందులో 31 స్వర్ణాలు ఉండటం విశేషం. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షురాలు, 2004, 2008 ఒలింపిక్స్ 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ స్వర్ణ పతక విజేత క్రిస్టీ కొవెంట్రీ సమక్షంలో లెడెకీ పతకం నెగ్గింది. పోటీల మూడో రోజు మంగళవారం ఐదు అంశాల్లో ఫైనల్స్ నిర్వహించగా... పురుషుల 200 మీటర్ల ఫ్రీ స్టయిల్లో రొమేనియాకు చెందిన డేవిడ్ పొపొవిక్ వరుసగా రెండో సారి స్వర్ణ పతకం సాధించగా... పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో దక్షిణాఫ్రికాకు చెందిన పీటర్ కోట్జీ పసిడి పతకం ఖాతాలో వేసుకున్నాడు. మహిళల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో జర్మనీకి చెందిన అన్నా ఎలెన్ సంచలనం సృష్టించింది. అమెరికా స్టార్ స్విమ్మర్ కేట్ డగ్లస్‌ను వెనక్కి నెడుతూ బంగారు పతకం కైవసం చేసుకుంది. పురుషుల 200 మీటర్ల ఫ్రీస్టయిల్లో ల్యూక్ హబ్సన్ విజేతగా నిలిచాడు. భారత స్విమ్మర్లకు నిరాశ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత స్విమ్మర్ల నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు భారత స్విమ్మర్లు హీట్స్ దాటి ముందడుగు వేయలేకపోయారు. పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ విభాగంలో సజన్ ప్రకాశ్ 24వ స్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు దూరమయ్యాడు. ఈ విభాగంలో తొలి 16 స్థానాల్లో నిలిచిన వాళ్లు సెమీస్‌కు అర్హత సాధించారు. భారత్ నుంచి నేరుగా ఒలింపిక్స్ (టోక్యో 2020)కు అర్హత సాధించిన తొలి స్విమ్మర్‌గా రికార్డు సృష్టించిన 31 ఏళ్ల సజన్ ప్రకాశ్... ఈ టోర్నీ 200 ఫ్రీస్టయిల్లో 43వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.ఇక 800 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో ఆర్యన్ నెహ్రా 23వ స్థానంలో నిలిచాడు. మంగళవారం పోటీలో ఆర్యన్ 8 నిమిషాల 21.30 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు. తొలి 8 స్థానాల్లో నిలిచిన వాళ్లు ఫైనల్‌కు చేరారు. మరోవైపు 50 మీటర్ల బటర్‌ఫ్లయ్ విభాగంలోనూ ఆర్యన్ 57వ స్థానంతో సరిపెట్టుకోగా... ఎస్పీ లికిత్ 50వ స్థానంలో నిలిచాడు. -
కేటీ... 13 పతకాలతో మేటి
పారిస్: అమెరికా మహిళా స్విమ్మర్ కేటీ లెడెకీ విశ్వ క్రీడల్లో మరోసారి మెరిసింది. 4్ఠ200 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో కేటీ లెడెకీ, క్లెయిర్ వీన్‌స్టెన్, పెయిజ్ మాడెన్, ఎరిన్ గిమెల్లతో కూడిన అమెరికా బృందం రజత పతకం (7ని:40.86 సెకన్లు) సాధించింది. తాజా ఒలింపిక్స్‌లో ఇప్పటికే మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్లో స్వర్ణం, మహిళల 400 మీటర్ల ఫ్రీస్టయిల్లో కాంస్యం గెలిచిన లెడెకీకిది మూడో పతకం కాగా... 800 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో ఆమె బరిలోకి దిగాల్సి ఉంది. తాజా పతకంతో లెడెకీ రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. ఒలింపిక్స్ చరిత్రలో అత్యధికంగా 13 పతకాలు గెలిచిన మహిళా స్విమ్మర్‌గా చరిత్ర లిఖించింది. 12 పతకాలతో జెన్నీ థాంప్సన్ (అమెరికా) పేరిట ఉన్న రికార్డును లెడెకీ సవరించింది. వరుసగా నాలుగో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న లెడెకీ ఇప్పటి వరకు విశ్వక్రీడల్లో 8 స్వర్ణాలు, 4 రజతాలు, ఒక కాంస్యం సాధించింది. ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో అమెరికా మాజీ స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ అత్యధికంగా 28 పతకాలు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. 13 పతకాలతో లెడెకీ మహిళల విభాగంలో అగ్రస్థానంలో, ఓవరాల్‌గా రెండో స్థానంలో ఉంది. ‘విశ్వక్రీడల్లో ఒత్తిడి సహజమే. అయితే నా వరకు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడమే లక్ష్యంగా పెట్టుకుంటా. ఆ క్రమంలో రికార్డులు నమోదైతే అది మరింత ఆనందం. స్వదేశంలో జరిగే 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లోనూ పాల్గొంటా’ అని లెడెకీ పేర్కొంది. -
చరిత్ర సృష్టించిన కేటీ.. మైఖేల్ ఫెల్ప్స్ రికార్డు బద్ధలు
26 ఏళ్ల అమెరికా మహిళా స్విమ్మర్ కేటీ లెడెకీ చరిత్ర సృష్టించింది. జపాన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో 16 స్వర్ణ పతాకాలు సాధించి, ప్రపంచ రికార్డు నెలకొల్పింది. గతంలో వరల్డ్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో అత్యధిక స్వర్ణ పతకాలు సాధించిన రికార్డు దిగ్గజ స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్ (15) పేరిట ఉండేది. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో కేటీ.. ఫెల్ప్స్ రికార్డు బద్దలు కొట్టి వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. ఇవాళ (జులై 30) జరిగిన 800 మీటర్ల ఫ్రీస్టైల్ ఫైనల్లో స్వర్ణం గెలవడం ద్వారా లెడెకీ ఈ ఘనత సాధించింది. 800 మీటర్ల ఈవెంట్లో స్వర్ణం కైవసం చేసుకున్న లెడెకీ మరో రికార్డును కూడా బద్దలు కొట్టింది. వరల్డ్ ఛాంపియన్షిప్ మహిళల 800 మీటర్ల ఫ్రీస్టైల్ ఈవెంట్స్‌లో అత్యధిక స్వర్ణ పతకాలు (6) సాధించిన స్విమ్మర్‌గా రికార్డు నెలకొల్పింది. అలాగే ఒకే ఈవెంట్లో అత్యధిక ప్రపంచ ఛాంపియన్షిప్స్ బంగారు పతకాలు (6) సాధించిన స్విమ్మర్‌గానూ రికార్డుల్లోకెక్కింది. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో 1500 మీటర్ల ఫ్రీస్టైల్‌లోనూ స్వర్ణంతో మెరిసిన కేటీ.. ఇప్పటివరకు తన కెరీర్లో 20 వరల్డ్ ఛాంపియన్షిప్స్ స్వర్ణాలు, 7 ఒలింపిక్స్ గోల్డ్ మెడల్స్ సాధించింది. మహిళల స్విమ్మింగ్ చరిత్రలో ఏ సిమ్మర్ కేటీ సాధించినన్ని గోల్డ్ మెడల్స్ సాధించలేదు. -
లెడెకీ మరో ప్రపంచ రికార్డు
స్విమ్మింగ్‌లో 19 ఏళ్ల అమెరికా స్టార్ కేటీ లెడెకీ దూసుకుపోతోంది. 800 మీటర్ల ఫ్రీ స్టయిల్ విభాగంలో ఆమె కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పి స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. 8 ని. 4.79 సెకన్లతో మీట్ పూర్తి చేసిన లెడెకీ తన పేరిటే ఉన్న రికార్డు (8 ని. 6.68 సె.)ను సవరించింది. తాజా ఫలితంతో ఆమె 48 ఏళ్ల తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో 200 మీ., 400 మీ., 800 మీ. ఫ్రీ స్టయిల్ పోటీలు నెగ్గిన అరుదైన స్విమ్మర్‌గా రికార్డు సృష్టించింది. 1968లో డెబీ మేయర్ ఈ ఘనత సాధించింది. ఈ ఈవెంట్లో జాజ్ కార్లిన్ (బ్రిటన్- 8 ని. 16.17 సె.), బొగ్లార్కా కపస్ (హంగేరీ - 8 ని. 16.37 సె.) రజత, కాంస్యాలు నెగ్గారు. -
లెడెకీ ప్రపంచ రికార్డు
రియో డీ జనీరో :రియో ఒలింపిక్స్‌లో అమెరికాకు ప్రాతినిథ్యం వహిస్తున్న 19 ఏళ్ల మహిళా స్విమ్మర్ కేటీ లెడెకీ సరికొత్త వరల్డ్ రికార్డును నమోదు చేసింది. ఇప్పటికే 200, 400 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో స్వర్ణపతకాలను కైవసం చేసుకున్న లెడెకీ.. తాజాగా జరిగిన 800 మీటర్ల ఫ్రీ స్టయిల్ పోరులో కూడా పసిడిని ఒడిసి పట్టుకుంది. ఈ రేసును 8:04.79 నిమిషాల్లో పూర్తి చేసి గత జనవరిలో నెలకొల్పిన తన రికార్డును మరోసారి సవరించుకుంది. మరోవైపు 48 ఏళ్ల తరువాత ఈ మూడు విభాగాల్లో స్వర్ణ పతకాలను సాధించిన అమెరికా స్విమ్మర్‌గా చరిత్ర సృష్టించింది. 1968లో అమెరికా మాజీ స్విమ్మర్ డెబీ మెయర్ మాత్రమే ఈ ఫీట్‌ను సాధించింది. కాగా, ఒలింపిక్స్ 800 మీటర్ల ఫ్రీ స్టయిల్లో రెండోసారి స్వర్ణాన్ని సాధించిన మూడో అమెరికా స్విమ్మర్‌గా సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. గత లండన్ ఒలింపిక్స్‌లో లెడెకీ ఈ విభాగంలో బరిలోకి దిగి పసిడి పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. 15 ఏళ్ల ప్రాయంలోనే లెడెకీ 800 మీటర్ల ఫ్రీ స్టయిల్లో స్వర్ణాన్ని సాధించి దిగ్గజాలను సైతం నివ్వెరపరిచేలా చేసింది. రియో ఒలింపిక్స్ లో లెడెకీ ఇప్పటివరకూ నాలుగు పసిడి పతకాలను సాధించింది. 4x200 మీటర్ల రిలేలో స్వర్ణం సాధించిన అమెరికా జట్టులో లెడెకీ ప్రధాన పాత్ర పోషించింది. ఓవరాల్ గా లెడెకీఖాతాలో ఐదు పతకాలుండగా, అందులో ఒకటి మాత్రమే రజతం ఉంది. -
లిడెకీ మరో ప్రపంచ రికార్డు
గోల్డ్‌కోస్ట్ (ఆస్ట్రేలియా): పాన్ పసిఫిక్ చాంపియన్‌షిప్‌లో సంచలనాలు సృష్టిస్తున్న అమెరికా టీనేజ్ స్విమ్మర్ కేటీ లిడెకీ మరో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఆదివారం జరిగిన 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ రేసును 17 ఏళ్ల లిడెకీ 15ని. 28.36 సెకన్లలోనే పూర్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. గత జూన్‌లో 15ని. 34.23 సెకన్లతో తానే నెలకొల్పిన రికార్డును దాదాపు ఆరు సెకన్ల తేడాతో లిడెకీ అధిగమించింది. దీంతో ఒకే టోర్నీలో మూడు ప్రపంచ రికార్డులు నమోదు చేయడంతోపాటు ఐదు స్వర్ణాలను తన ఖాతాలో వేసుకుంది. ఈ టోర్నీలో లిడెకీ 200 మీ., 400., 800 మీ., ఫ్రీస్టయిల్ రేసుల్లో స్వర్ణం సాధించడంతోపాటు 4ఁ200 మీ., ఫ్రీస్టయిల్ రిలే రేసులో పసిడి పతకం సొంతం చేసుకున్న జట్టులో సభ్యురాలు.