డబ్ల్యూపీఎల్ 2026 ఎడిషన్ డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌కు పెద్దగా కలిసొస్తున్నట్లు కనిపించడం లేదు. ఈ సీజన్‌లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో రెండే విజయాలు సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్నా, మరో రెండు జట్లు కూడా సమాంతర పాయింట్లు కలిగి ఉండటంతో ఈ స్థానానికి గ్యారెంటీ లేదు.
యూపీ వారియర్జ్, గుజరాత్ జెయింట్స్ కూడా ఐదు మ్యాచ్‌ల్లో చెరో రెండు విజయాలు సాధించి, ముంబై ఇండియన్స్‌తో పాటు 4 పాయింట్లు ఖాతాలో కలిగి ఉన్నాయి. ఆడిన 5 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటంతో పాటు, మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగానే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. మరో జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ 4 మ్యాచ్‌ల్లో ఒకే ఒక విజయంతో చివరి స్థానంలో ఉంది.
ఈ ఎడిషన్‌లో ఆశించిన విజయాలు సాధించలేకపోతున్న ముంబై ఇండియన్స్‌కు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు వికెట్‌కీపింగ్ బ్యాటర్ జి కమిలిని గాయం బారిన పడి ఎడిషన్ మొత్తానికి దూరమైంది. ఆమె స్థానాన్ని ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ ఎడమచేతి వాటం స్పిన్నర్ వైష్ణవి శర్మతో భర్తీ చేసింది.
17 ఏళ్ల కమిలిని ఈ సీజన్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, ముంబై ఇండియన్స్‌కు నమ్మదగిన బ్యాటర్‌గా ఉండింది. ఆమె లేని లోటు ఎంఐ బ్యాటింగ్ ఆర్డర్‌ను ప్రభావితం చేయవచ్చు.
వైష్ణవి శర్మతో భర్తీ
20 ఏళ్ల వైష్ణవి శర్మను ముంబై ఇండియన్స్ రూ.30 లక్షలతో జట్టులోకి తీసుకుంది. వైష్ణవి 2025 అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాలో కీలక సభ్యురాలు. ఇటీవలే ఆమె టీమిండియా తరఫున కూడా అరంగేట్రం చేసింది. డబ్ల్యూపీఎల్‌కు ముందు శ్రీలంకతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వైష్ణవి ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపించింది.
డబ్ల్యూపీఎల్ తర్వాత జరిగే ఆస్ట్రేలియా పర్యటనకు సైతం వైష్ణవి ఎంపికైంది. వైష్ణవి చేరికతో ముంబై ఇండియన్స్ బౌలింగ్ విభాగం బలపడనుంది. ముంబై ఇండియన్స్ ఇవాళ (జనవరి 20) ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.ప్లే ఆఫ్స్ నేపథ్యంలో ఈ మ్యాచ్ ఆ జట్టుకు చాలా కీలకం.


