
సొంత గడ్డపై టీమిండియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ దుమ్ములేపుతున్నాడు. లార్డ్స్ టెస్టులో అద్బుతమైన సెంచరీతో చెలరేగిన రూట్.. ఇప్పుడు మాంచెస్టర్ వేదికగా జరగనున్న నాలుగో టెస్టులో కూడా సత్తాచాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు జూలై 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో జోరూట్ ఓ అరుదైన రికార్డుపై కన్నేశాడు.
డేంజర్‌లో పాంటింగ్ రికార్డు..
మాంచెస్టర్‌లో రూట్ మరో 119 పరుగులు సాధిస్తే..టెస్టు క్రికెట్‌లో అత్యధిక రన్స్ చేసిన రెండో ఆటగాడిగా రూట్ నిలుస్తాడు. రూట్ ఇప్పటివరకు 156 టెస్టులు 50.8 సగటుతో 13259 పరుగులు చేశాడు.టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రూట్ ప్రస్తుతం నాలుగో స్ధానంలో ఉన్నాడు.
రూట్ కంటే ముందు రాహుల్ ద్రవిడ్(13288), జాక్వస్ కల్లిస్(13289), రికీ పాంటింగ్(13378), సచిన్ టెండూల్కర్(15921) ఉన్నారు. ఈ మ్యాచ్‌లో గాని ఆఖరి టెస్టులో గాని ద్రవిడ్, కల్లిస్, పాంటింగ్‌ను రూట్ అధగమించే అవకాశముంది. ఇక అగ్రస్దానంలో కొనసాగుతున్న సచిన్‌ను ఆధిగమించేందుకు రూట్ ఇంకా 2,662 పరుగుల దూరంలో ఉన్నాడు.
అయితే 34 ఏళ్ల రూట్ మరి కొన్నాళ్ల పాటు టెస్టుల్లో కొనసాగితే సచిన్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. కాగా ఐదు టెస్టుల ఆండర్సన్- టెండూల్కర్ ట్రోఫీలో ఇంగ్లండ్ ప్రస్తుతం 1-2 ఆధిక్యంలో కొనసాగుతోంది.
చదవండి: WCL 2025: అన్నా.. నీవు ఇప్పటికి మారలేదా? పాక్ ఆటగాడిపై సెటైర్‌లు