
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో అనూహ్య ఓటమిచవిచూసిన భారత జట్టు.. మరో కీలక పోరుకు సిద్దమవుతోంది. జూలై 23 నుంచి మాంచెస్టర్ వేదికగా ప్రారంభం కానున్న నాలుగో టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్‌తో టీమిండియా అమీతుమీ తెల్చుకోనుంది.
ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేయాలని గిల్ సేన పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ ఊరట లభించింది. మాంచెస్టర్‌లో జరిగే నాలుగో టెస్టులో భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఆడనున్నాడు.
వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా బుమ్రా ఇంగ్లండ్ పర్యటనలో కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడతాడని బీసీసీ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ జట్టును ఎంపిక చేసిన సమయంలోనే స్పష్టం చేశారు. దీంతో తొలి టెస్టులో ఆడిన బుమ్రా.. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్టుకు విశ్రాంతి తీసుకున్నాడు.
ఆ తర్వాత లార్డ్స్ టెస్టులో ఆడి అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ క్రమంలో బుమ్రా నాలుగో టెస్టులో ఆడుతాడా లేదా విశ్రాంతి తీసుకుంటాడా అన్నదానిపై సర్వాత్ర ఆసక్తి నెలకొంది.
నాలుగో టెస్టుకు బుమ్రా సై..
లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టుకు మాంచెస్టర్ టెస్టుకు దాదాపు ఎనిమిది రోజుల విరామం లభించింది. రేవ్‌స్పోర్ట్స్ రిపోర్ట్ ప్రకారం.. బుమ్రాకు తగినంత విశ్రాంతి దొరకవడంతో నాలుగో టెస్టులో ఆడించాలని టీమ్ మెనెజ్‌మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
అంతేకాకుండా సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే నాలుగో టెస్టులో టీమిండియా కచ్చితంగా గెలవాల్సిందే. అంతేకాకుండా ఈ మ్యాచ్ ఫలితం డబ్ల్యూటీసీ సైకిల్ 2025-27 పాయింట్ల పట్టికపై ప్రభావం చూపనుంది. ఇప్పటికే డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ నాలుగో స్ధానంలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే బుమ్రా కూడా నాలుగో టెస్టులో ఆడేందుకు సిద్దంగా ఉన్నాడు. బుమ్రా తన కెరీర్‌లో ఇప్పటివరకు మాంచెస్టర్‌లో ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదు.
ఇంగ్లండ్‌లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ గణాంకాలు (టెస్టులు)
మ్యాచ్‌లు: 11
ఇన్నింగ్స్: 21
మెయిడెన్స్: 102
వికెట్లు: 49
ఉత్తమ బౌలింగ్ ఇన్నింగ్స్: 5/64
ఉత్తమ బౌలింగ్ మ్యాచ్: 9/110
సగటు: 24.97
స్ట్రైక్ రేట్: 54.3
5-వికెట్ల హాల్స్: 4
చదవండి: బంగ్లా ప్లేయర్ సరికొత్త చరిత్ర.. భజ్జీ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు