
పాయింట్ తేడాతో పర్నీత్‌కు ‘పసిడి’ దూరం
ప్రపంచ వర్సిటీ క్రీడలు
రినె–రుర్ ఎసెన్ (జర్మనీ): ప్రపంచ యూనివర్సిటీ క్రీడల్లో భారత ఆర్చర్ సాహిల్ జాదవ్ స్వర్ణంపై పెట్టిన గురి కుదిరింది. పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో అతను బంగారు పతకం సాధించాడు. అయితే మహిళల కాంపౌండ్‌లో పర్నీత్ కౌర్‌కు తృటిలో పసిడి పతకం చేజారింది. ఆర్చర్లు ఐదు పతకాలతో ఈ పోటీలను ముగించారు. మిగతా మూడు పతకాలు టీమ్ ఈవెంట్‌లో వచ్చాయి. మిక్స్‌డ్ టీమ్ స్వర్ణం, పురుషుల టీమ్ రజతం, మహిళల టీమ్ కాంస్యం గెలుచుకుంది. ఒలింపిక్ క్రీడ అయిన రికర్వ్‌లో మాత్రం భారత ఆర్చర్లు నిరాశపరిచారు.
పురుషుల కాంపౌండ్ టైటిల్ పోరులో సాహిల్ జాదవ్ గురి అదిరింది. మొత్తం 15 బాణాలను సంధించగా... ఇందులో ఏకంగా 14 షాట్లు కచ్చితత్వంతో లక్ష్యాన్ని చేరాయి. దీంతో పదికి పది పాయింట్లు లభించగా, ఆఖరి బాణం 9 పాయింట్లు తెచ్చింది. దీంతో జాదవ్ 149–148 స్కోరుతో అజయ్ స్కాట్ (బ్రిటన్)పై గెలిచి బంగారం అందుకున్నాడు. అంతకుముందు భారతీయుల మధ్యే జరిగిన సెమీస్‌లో సాహిల్ 148–148తో కుశాల్ దలాల్‌తో సమంగా నిలిచాడు. అయితే షూటాఫ్‌లో సాహిల్ జాదవ్ మెరుగైన స్థితిలో ఉండటంతో ఫైనల్ చేరాడు.
మహిళల కాంపౌండ్‌లో ఆసియా క్రీడల టీమ్‌ఈవెంట్ స్వర్ణ పతక విజేత అయిన పర్నీత్ కౌర్ దాదాపు స్వర్ణంపైనే గురిపెట్టింది. కానీ ఆఖరి మెట్టుపై అనూహ్యంగా ఒత్తిడికి గురై తృటిలో పసిడి పట్టలేకపోయింది. చివరకు పాయింట్ తేడాతో బంగారాన్ని దూరం చేసుకున్న పర్నీత్ రజతంతో సరిపెట్టుకుంది. ఫైనల్లో ఆమె 146–147 స్కోరుతో మూన్ యీన్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడింది. అంతకుముందు క్వాలిఫికేషన్ రౌండ్‌లో టాపర్‌గా నిలిచింది. సెమీస్‌లో 145–144తో ఐదో సీడ్ కిమ్ సూయెన్ (దక్షిణ కొరియా)ను కంగుతినిపించింది.