
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో టీమిండియా యువ బ్యాటర్లు ఇషాన్ కిషన్, తిలక్ వర్మ దుమ్మురేపుతున్నారు. కొద్ది రోజుల కిందటే కౌంటీ అరంగేట్రం చేసిన ఈ ఇద్దరు.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అదరగొట్టారు. కౌంటీ ఛాంపియన్‌షిప్ కోసం హ్యాంప్‌షైర్‌తో ఒప్పందం చేసుకున్న తిలక్ వర్మ అరంగేట్రం మ్యాచ్‌లో అద్బుతమైన సెంచరీతో (241 బంతుల్లో 100) కదంతొక్కగా.. ఇదే టోర్నీ కోసం నాటింగ్హమ్‌షైర్‌తో ఒప్పందం చేసుకున్న ఇషాన్ కిషన్ అరంగేట్రం మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీ (98 బంతుల్లో 87) చేశాడు.
తాజాగా ఈ ఇద్దరు తమతమ రెండో మ్యాచ్‌ల్లో కూడా సత్తా చాటారు. సోమర్‌సెట్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ (128 బంతుల్లో 77; 8 ఫోర్లు, 2 సిక్సర్లు).. వార్సెస్టర్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తిలక్ వర్మ (171 బంతుల్లో 56; 7 ఫోర్లు, సిక్స్) అర్ద సెంచరీలతో రాణించారు. కౌంట్లీ ఈ ఇద్దరు యువ బ్యాటర్లు చెలరేగడం చూస్తుంటే టీమిండియా టెస్ట్ బెర్త్‌ల కోసం పోటీ మరింత తీవ్రతరమయ్యేలా కనిపిస్తుంది.
తాజా కౌంటీ ఛాంపియన్‌షిప్‌లోనే మరో టీమిండియా ఆటగాడు కూడా అరంగేట్రం చేశాడు. భారత లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఖలీల్ అహ్మద్ ఎసెక్స్‌తో ఒప్పందం చేసుకున్నాడు. ఖలీల్ తన తొలి మ్యాచ్‌లోనే (యార్క్‌షైర్) ఆకట్టుకున్నాడు. ఖలీల్ స్టార్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టోతో జరిగిన పోటీలో పైచేయి సాధించాడు. తొలుత బెయిర్‌స్టో ఖలీల్ బౌలింగ్‌లో బౌండరీలు బాదగా.. ఆతర్వాత ఖలీల్ అతన్ని ఔట్ చేసి రివెంజ్ తీర్చుకున్నాడు.
కాగా, ఈ కౌంటీ సీజన్‌లో ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, ఖలీల్ అహ్మద్‌తో పాటు మరో ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు కూడా ఆడుతున్నారు. యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ యార్క్‌షైర్‌కు.. స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ నార్తంప్టన్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.