
ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రైవేట్ క్రికెట్ లీగ్ ప్రారంభమైన ఐపీఎల్ ఫ్రాంచైజీల ఓనర్లు అక్కడ వాలిపోతారు. ప్రస్తుతం వరల్డ్లో సూపర్ హిట్ అయిన ప్రతి లీగ్లోనూ ఐపీఎల్ ఫ్రాంచైజీల ఓనర్లు పాతుకుపోయారు. వెస్టిండీస్లో జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్, యూఏఈలో జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్, సౌతాఫ్రికాలో జరిగే సౌతాఫ్రికా టీ20 లీగ్, అమెరికాలో జరిగే మేజర్ లీగ్ క్రికెట్.. ఇలా మెజార్టీ శాతం క్రికెట్ లీగ్‌ల్లో ఐపీఎల్ ఫ్రాంచైజీల ఓనర్ల హవా నడుస్తుంది.
తాజాగా ఐపీఎల్ ఫ్రాంచైజీల ఓనర్లు ఇంగ్లండ్లో జరిగే హండ్రెడ్ లీగ్లోనూ కాలు మోపారు. ఈ లీగ్లో వారు ఏకంగా నాలుగు ఫ్రాంచైజీలను కొనుగోలు చేశారు. ఇవాల్టి నుంచి (ఆగస్ట్ 5) హండ్రెడ్ లీగ్ ఐదో ఎడిషన్ ప్రారంభం కానుండగా.. ఏ ఫ్రాంచైజీలను ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీల ఓనర్లు కొనుగోలు చేశారో ఓ లుక్కేద్దాం.
ఓవల్ ఇన్విన్సిబుల్స్: ఈ ఫ్రాంచైజీని ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. ఇన్విన్సిబుల్స్‌లోని 49 శాతం వాటాను ముకేశ్ అంబానీ సామ్రాజ్యం రిలయన్స్ ఇండస్ట్రీస్ దక్కించుకుంది.
మిగతా 51 శాతం వాటాను సర్రే కౌంటీ క్లబ్ తమ వద్దనే ఉంచుకుంది. ఈ లీగ్లో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఇన్విన్సిబుల్స్‌కు సామ్ కర్రన్ నాయకత్వం వహించనున్నాడు.
సథరన్ బ్రేవ్: ఈ ఫ్రాంచైజీని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యమైన జీఎంఆర్ గ్రూప్ దక్కించుకుంది. ఇందులో 49 శాతం వాటాను డీసీ మేనేజ్మెంట్ సొంతం చేసుకుంది. మిగతా 51 శాతం వాటాను హ్యాంప్‌షైర్ కౌంటీ క్లబ్ రీటైన్ చేసుకుంది. ఈ ఫ్రాంచైజీకి కెప్టెన్గా జేమ్స్ విన్స్ వ్యవహరిస్తాడు.
నార్త్రన్ సూపర్ ఛార్జర్స్: ఈ ఫ్రాంచైజీని సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం అయిన సన్ గ్రూప్ కొనుగోలు చేసింది. ఈ ఫ్రాంచైజీలో మొత్తం వాటాను కావ్యా మారన్ సంస్థ రూ. 1,094 కోట్లకు చేజిక్కించుకుంది. ఈ జట్టుకు ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ నాయకత్వం వహిస్తున్నాడు. జట్టులో డేవిడ్ మిల్లర్, డేవిడ్ మలాన్ లాంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు.
మాంచెస్టర్ ఒరిజినల్స్: ఈ ఫ్రాంచైజీని లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గొయెంకా కొనుగోలు చేశాడు. అతని నేతృత్వంలోని ఆర్పీఎస్జీ గ్రూప్ మాంచెస్టర్ ఒరిజినల్స్లోని 70 శాతం వాటాను దక్కించుకుంది. ఈ జట్టుకు కెప్టెన్గా ఫిల్ సాల్ట్ వ్యవహరిస్తాడు.