ఆ పోలీస్‌ లుంగి ఎంగిడి ప్రాణాన్ని నిలబెట్టాడు! | IPL 2026 Sanjay Singh quick thinking saves Injured Lungi Ngidi real Hero | Sakshi
Sakshi News home page

ఆ పోలీస్‌ లుంగి ఎంగిడి ప్రాణాన్ని నిలబెట్టాడు!

Apr 28 2026 10:42 AM | Updated on Apr 28 2026 11:11 AM

IPL 2026 Sanjay Singh quick thinking saves Injured Lungi Ngidi real Hero

ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్‌ లుంగి ఎంగిడి కోలుకుంటున్నాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు వైద్యులు ఇటీవలే వెల్లడించారు. నిజానికి మైదానంలో ఎంగిడి పరిస్థితి చూసిన అభిమానులు మాత్రం వణికిపోయారు. ప్రాణాలతో బయటపడితే చాలు దేవుడా అంటూ ప్రార్థించారు. ఐపీఎల్‌-2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ శనివారం పంజాబ్‌ కింగ్స్‌తో తలపడ్డ సంగతి తెలిసిందే.

తల బలంగా నేలకు తాకి
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ రికార్డు స్థాయిలో 264 పరుగులు చేయగా.. పంజాబ్‌ లక్ష్య ఛేదనకు దిగింది. ఈ క్రమంలో పంజాబ్‌ ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో ఓపెనర్‌ ప్రియాన్ష్‌ ఆర్య కొట్టిన బంతిని అందుకునే క్రమంలో ఢిల్లీ ప్లేయర్‌ ఎంగిడి గాయపడ్డాడు. మిడాఫ్‌ ప్రాంతంలో బంతిని క్యాచ్‌ పట్టే క్రమంలో అతడు కిందపడ్డాడు.

దీంతో తల బలంగా నేలకు తాకి అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే వైద్య బృందం అతడిని పరీక్షించింది. అయితే అతడి పరిస్థితి దిగజారినట్లు కనిపించడంతో అంబులెన్స్‌ను మైదానంలోకి రప్పించి..  మెరుగైన చికిత్స కోసం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో ట్రాఫిక్‌ ఏసీపీ సంజయ్‌ సింగ్‌ చాకచక్యంగా వ్యవహరించి.. ఒ‍క రకంగా ఎంగిడి ప్రాణం నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు.

11 నిమిషాల్లోనే 
ఢిల్లీలో ట్రాఫిక్‌ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, మ్యాచ్‌ జరిగిన అరుణ్‌ జైట్లీ స్టేడియం నుంచి సాయంత్రం 6.16 గంటలకు బయల్దేరిన అంబులెన్స్‌.. రాజేంద్ర నగర్‌లో ఉన్న మాక్స్‌ ఆస్పత్రికి కేవలం 11 నిమిషాల్లోనే చేరుకుంది. సాధారణంగా ఈ ప్రయాణానికి 25-30 నిమిషాల సమయం పడుతుంది.

అయితే, సంజయ్‌ సింగ్‌ చొరవ వల్ల ఎంగిడిని తీసుకువెళ్తున్న అంబులెన్స్‌ త్వరితగతిన ఆస్పత్రికి చేరుకుంది. గూగుల్‌ మ్యాప్స్‌పై ఆధారపడకుండా.. మెయిన్‌ రోడ్డు నుంచే వెళ్లాలని సంజయ్‌ సింగ్‌ అంబులెన్స్‌ డ్రైవర్‌కు సూచించారట. మొత్తంగా 60 మంది పోలీసులు వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ ద్వారా సమన్వయం చేసుకుని.. ఎంగిడి వీలైనంత త్వరగా ఆస్పత్రికి చేరడంలో కీలక పాత్ర పోషించారు.

ఎవరీ సంజయ్‌ సింగ్‌?
ఢిల్లీలో ప్రస్తుతం ట్రాఫిక్‌ ఏసీపీగా పనిచేస్తున్నారు సంజయ్‌ సింగ్‌. ఆయనకు క్రికెట్‌ బ్యాగ్రౌండ్‌ ఉంది. గౌతం గంభీర్‌, విరాట్‌ కోహ్లి వంటి దిగ్గజాలతో ఆయన దేశీ క్రికెట్‌ ఆడారు.

ఇక ఎంగిడి గురించి మీడియా సంజయ్‌ సింగ్‌ను అడుగగా.. ‘‘నేనూ ఓ క్రికెటర్‌నే. మైదానంలో తగిలే గాయాలు ఎంతటి ప్రమాదానికి దారితీస్తాయో నాకు బాగా తెలుసు. ఎంగిడి అంతర్జాతీయ క్రికెటర్‌. అతడు కుప్పకూలిన విధానం చూస్తే గాయం ఎంత తీవ్రమైందో నాకు అర్థమైంది’’ అని సహానుభూతి ప్రదర్శించారు.

ఇదిలా ఉంటే.. ఢిల్లీ విధించిన 265 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్‌ ఊదేసింది. మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి పని పూర్తి చేసింది. ఇక తాజాగా ఢిల్లీకి మరో పరాజయం ఎదురైంది. ఆర్సీబీతో సోమవారం నాటి మ్యాచ్‌లో ఢిల్లీ తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది.

చదవండి: మీకసలు బుద్ధుందా?.. వైభవ్‌ గురించి ఆమెను ఎందుకు అడిగారు?

Advertisement
 
Advertisement
Advertisement