
Photo Courtesy: BCCI
ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారి చెన్నై సూపర్ కింగ్స్‌పై ఇంటా బయటా (ఒకే సీజన్‌లో) విజయాలు సాధించింది. ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 3) హోం గ్రౌండ్‌లో సీఎస్‌కేపై విక్టరీ సాధించిన ఆర్సీబీ.. ఈ సీజన్ అవే మ్యాచ్‌లోనూ (సీఎస్‌కే హోం గ్రౌండ్‌లో) సీఎస్‌కేను చిత్తు చేసింది.
బెంగళూరులో సీఎస్‌కేపై 2 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందిన ఆర్సీబీ.. మే 28న చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐపీఎల్ ప్రారంభం నుండి ఆర్సీబీ సీఎస్‌కేపై ఎప్పుడూ ఒకే సీజన్‌లో ఇంటా బయటా విజయాలు సాధించలేదు.
ప్రస్తుత సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆర్సీబీ, నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. జేకబ్ బేతెల్ (33 బంతుల్లో 55; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లి (33 బంతుల్లో 62; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), రొమారియో షెపర్ట్ (14 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) అర్ద సెంచరీలతో చెలరేగారు.
ఆఖరి రెండు ఓవర్లలో షెపర్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగి రికార్డు స్థాయిలో 54 పరుగులు రాబట్టాడు. ఐపీఎల్ చరిత్రలో ఇన్నింగ్స్ 19, 20 ఓవర్లలో సాధించిన అత్యధిక పరుగులు ఇవే. ఖలీల్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో 4 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 33 పరుగులు పిండుకున్న షెపర్డ్.. పతిరణ వేసిన చివరి ఓవర్‌లో 2 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 21 పరుగులు రాబట్టాడు.
సీఎస్‌కే బౌలర్లలో పతిరణ (4-0-36-3), నూర్ అహ్మద్ (4-0-26-1) అద్భుతంగా బౌలింగ్ చేయగా.. ఖలీల్ అహ్మద్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు (3-0-65-0).
అనంతరం 214 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్‌కే.. చివరి బంతి వరకు పోరాడి నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులకే పరిమితమైంది. జడేజా (45 బంతుల్లో 77 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆయుశ్ మాత్రే (48 బంతుల్లో 94; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ద సెంచరీలతో చెలరేగినా ఆర్సీబీ చేతిలో సీఎస్‌కే 2 పరుగుల స్వల్ప తేడాతో ఓడింది.
సీఎస్‌కే గెలుపుకు చివరి ఓవర్‌లో 15 పరుగులు అవసరం కాగా.. యశ్ దయాల్ అద్భుతంగా బౌలింగ్ చేసి 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆర్సీబీ బౌలర్లలో ఎంగిడి 3 వికెట్లు తీయగా.. దయాల్, కృనాల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించిన సీఎస్‌కే ఈ ఓటమితో చివరి స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. ఈ గెలుపుతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్ దాదాపుగా ఖరారైనట్లే.