
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 27) జరిగిన ఉత్కంఠ పోరులో లక్నోపై ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో భారీ స్కోర్ (227/3) చేసింది. రిషబ్ పంత్ (61 బంతుల్లో 118 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు.
మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో అలరించాడు. లక్నో ఇన్నింగ్స్‌లో మాథ్యూ బ్రీట్జ్కీ 14, పూరన్ 13 పరుగులు చేసి ఔటయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో తుషార, భువనేశ్వర్ కుమార్, షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీ విజయవంతమైంది. ఆ జట్టు 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జితేశ్ శర్మ (33 బంతుల్లో 85 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరోచితమైన ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీని గెలిపించాడు. అతనికి మయాంక్ అగర్వాల్ (23 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు) సహకరించాడు.
అంతకుముందు విరాట్ కోహ్లి (30 బంతుల్లో 54; 10 ఫోర్లు), ఫిల్ సాల్ట్ (19 బంతుల్లో 30; 6 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి ఆర్సీబీ గెలుపుకు పునాది వేశారు. లక్నో బౌలర్లలో విలియమ్ ఓరూర్కీ 2, ఆకాశ్ సింగ్, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో ఆర్సీబీ టేబుల్ సెకెండ్ టాపర్‌గా నిలిచి ప్లే ఆఫ్స్‌కు చేరింది.
మే 29న జరిగే క్వాలిఫయర్-1లో ఆర్సీబీ.. పంజాబ్‌తో తలపడనుంది. మే 30న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకుంటాయి.