
LSG (File Photo), Pc: Ipl/bcci
ఐపీఎల్-2025లో లక్నోసూపర్ జెయింట్స్ ఎట్టకేలకు మరో విజయాన్ని నమోదు చేసింది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా గురువారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో లక్నో విజయం సాధించింది. 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 202 పరుగులకు పరిమితమైంది.
టైటాన్స్ బ్యాటర్లలో షారుఖ్ ఖాన్(57) టాప్ స్కోరర్‌గా నిలవగా.. షెర్ఫన్ రూథర్‌ఫర్డ్(38),బట్లర్(33), శుబ్‌మన్ గిల్(35) తమవంతు ప్రయత్నం చేశారు. లక్నో బౌలర్లలో విలియం ఓ రూర్క్ మూడు వికెట్లు పడగొట్టగా.. బదోని రెండు, ఆకాష్ మహారాజ్ సింగ్,అవేష్ ఖాన్ తలా వికెట్ సాధించారు.
మార్ష్ సూపర్ సెంచరీ..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ సాధించింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. 64 బంతులు ఎదుర్కొన్న మార్ష్.. 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో 117 పరుగులు చేశాడు. అతడితో పాటు నికోలస్ పూరన్(56), మార్‌క్రమ్(36) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. గుజరాత్ బౌలర్లలో ఆర్షద్ ఖాన్, సాయి కిషోర్ తలా వికెట్ సాధించారు.