
Photo Courtesy: BCCI
ఐపీఎల్-2025 (IPL 2025) రసవత్తరంగా సాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS) ఊహించని రీతిలో ముందుకు సాగుతుంటే.. ఐదేసి సార్లు ట్రోఫీలు గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మాత్రం రాజస్తాన్ రాయల్స్ (RR)తో కలిసి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానం కోసం పోటీపడుతున్నాయి.
ఇక డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కూడా సవాళ్లకు ఎదురీతుండగా.. గతేడాది రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కేకేఆర్ ఇప్పటికి ఆరింట మూడు గెలిస్తే.. రైజర్స్ ఆరింట రెండే గెలిచి చివరన ఉంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా సన్‌రైజర్స్ కొనసాగుతోంది.
గతేడాది బెంగళూరు జట్టుపై 287/3 స్కోరు నమోదు చేసింది. ఈ ఏడాది తమ ఆరంభ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో తలపడ్డ సన్‌రైజర్స్.. ఈ రికార్డు స్కోరు కంటే ఒక్క పరుగు తక్కువ చేసి.. తమ రికార్డును తామే బద్దలుకొడుతుందా అనిపించింది.
అయితే, ఇప్పటికి ఆ రికార్డు మాత్రం పదిలంగానే ఉండిపోయింది. ఐపీఎల్ చరిత్రలో ఇలాంటి చెక్కు చెదరని రికార్డులు ఎన్నో ఉన్నాయి. అవేంటో ఓసారి గమనిద్దామా?!
రికార్డుల రారాజుకే సాధ్యమైంది
రన్‌మెషీన్ పేరొందిన టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి ఐపీఎల్‌లో ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు. 2008 నుంచి ఆర్సీబీకే ఆడుతున్న ఈ రికార్డుల రారాజు 2016 సీజన్‌లో నాలుగు శతకాల సాయంతో ఏకంగా 973 పరుగులు సాధించాడు. గత ఎనిమిదేళ్లుగా ఈ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు.
ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు
2013లో యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ పుణె వారియర్స్‌పై 66 బంతుల్లో 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. కేవలం 30 బంతుల్లోనే సెంచరీ చేశాడు. తద్వారా ఫాస్టెస్ట్ సెంచరీతో పాటు అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా క్రిస్ గేల్ కొనసాగుతున్నాడు.
అత్యధిక వరుస విజయాలు
ఐపీఎల్ చరిత్రలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటికి మూడుసార్లు చాంపియన్‌గా నిలిచిన కేకేఆర్.. 2014, 2015 సీజన్లలో అరుదైన ఘనత సాధించింది.
గౌతం గంభీర్ సారథ్యంలో 2014లో వరుసగా తొమ్మిది విజయాలు సాధించింది కేకేఆర్. ఆ మరుసటి ఏడాది వరుసగా పది మ్యాచ్‌లు గెలిచి సత్తా చాటింది. ఇంత వరకు ఏ జట్టుకు ఇలాంటి వరుస విజయాల ఘనత సాధ్యం కాలేదు.
పార్ట్‌నర్స్
ఐపీఎల్‌లో అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన జోడీగా విరాట్ కోహ్లి- ఏబీ డివిలియర్స్ కొనసాగుతున్నారు. 2016లో ఆర్సీబీ తరఫున ఈ దిగ్గజ బ్యాటర్లు గుజరాత్ లయన్స్‌పై 229 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. గతంలో ముంబై ఇండియన్స్‌పై తాము సాధించిన 215 (నాటౌట్) పరుగుల భాగస్వామ్య రికార్డును వారే బ్రేక్ చేశారు.
హ్యాట్రిక్ వీరుడు
ఐపీఎల్‌లో అత్యధిక హ్యాట్రిక్‌లు నమోదు చేసిన బౌలర్‌గా రైటార్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కొనసాగుతున్నాడు. 2008లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున దక్కన్ చార్జర్స్‌పై, 2011లో దక్కన్ చార్జర్స్ తరఫున కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై.. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున 2011లో పుణె వారియర్స్‌పై అమిత్ మిశ్రా ఈ ఫీట్ నమోదు చేశాడు.
అరంగేట్రంలోనే అదరగొట్టి
వెస్టిండీస్ స్టార్ అల్జారీ జోసెఫ్ ఏప్రిల్ 6, 2019లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ సందర్భంగా 6/12 గణాంకాలు నమోదు చేశాడు. తద్వారా డెబ్యూలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
డివిలియర్స్ పేరిటే..
ఒక సీజన్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఆటగాడిగా ఆర్సీబీ లెజెండ్ ఏబీ డివిలియర్స్ కొనసాగుతున్నాడు. 2016 సీజన్‌లో అతడు మొత్తంగా 19 క్యాచ్‌లు అందుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ (17), రియాన్ పరాగ్ (17) అతడికి చేరువగా వచ్చినా ఈ రికార్డును మాత్రం బద్దలు కొట్టలేకపోయారు.
చదవండి: మాట నిలబెట్టుకున్న టీమిండియా దిగ్గజం.. కాంబ్లీకి జీవితాంతం నెలకు..