
తొలి టి20లో భారత్ జయభేరి
97 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చిత్తు
ఇంగ్లండ్ పర్యటనలో భారత మహిళల జట్టు అదరగొట్టింది. టాప్ బ్యాటర్ స్మృతి మంధాన టి20ల్లో తొలి శతకంతో చెలరేగడంతో ఈ ఫార్మాట్‌లో రెండో అత్యధిక స్కోరు చేసిన టీమిండియా... అనంతరం బౌలింగ్‌లోనూ ఇంగ్లండ్‌ను కట్టిపడేసి సిరీస్ ఆరంభ పోరులో భారీ విజయం ఖాతాలో వేసుకుంది. ఆంధ్రప్రదేశ్ స్పిన్నర్ శ్రీచరణి అరంగేట్రం టి20లోనే నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.
నాటింగ్‌హామ్: ఇంగ్లండ్ పర్యటనలో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన తొలి పోరులో టీమిండియా 97 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఈ ఫార్మాట్‌లో టీమిండియాకు ఇది రెండో అత్యధిక స్కోరు కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో భారత జట్టుకు సారథ్యం వహించిన స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (62 బంతుల్లో 112; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో విజృంభించింది.
టి20ల్లో స్మృతికి ఇదే తొలి శతకం కాగా... హర్లీన్ డియోల్ (23 బంతుల్లో 43; 7 ఫోర్లు) రాణించింది. చాన్నాళ్ల తర్వాత జాతీయ జట్టులోకి వచి్చన ఓపెనర్ షఫాలీ వర్మ (20) ఫర్వాలేదనిపించగా... రిచా ఘోష్ (12), జెమీమా రోడ్రిగ్స్ (0) విఫలమయ్యారు. తొలి వికెట్‌కు షఫాలీతో కలిసి 77 పరుగులు జోడించిన స్మృతి... రెండో వికెట్‌కు హర్లీన్‌తో 94 పరుగులు జోడించి భారీ స్కోరుకు బాటలు వేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో లౌరెన్ బెల్ 3 వికెట్లు పడగొట్టింది.
అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 14.5 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. దీంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు 1–0తో ఆధిక్యంలో నిలిచింది. మరోవైపు టి20ల్లో పరుగుల పరంగా ఇంగ్లండ్‌కు ఇదే అతిపెద్ద పరాజయం. నటాలియా సీవర్ బ్రంట్ (42 బంతుల్లో 66; 10 ఫోర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా... టామీ బ్యూమౌంట్ (10), ఎమ్ అర్లాట్ (12) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. డానీ వ్యాట్ (0), డాంక్లీ (7), అమీ జోన్స్ (1), కాప్సీ (5), ఎకెల్‌స్టోన్ (1) విఫలమయ్యారు.
భారత బౌలర్లలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి శ్రీ చరణి 4 వికెట్లతో అదరగొట్టింది. ఇప్పటికే జాతీయ జట్టు తరఫున 5 వన్డేలు ఆడిన శ్రీచరణి... అరంగేట్ర టి20లోనే తన స్పిన్‌తో ప్రత్యరి్థని ఉక్కిరిబిక్కిరి చేసింది. దీప్తి శర్మ, రాధా యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మంధానకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య మంగళవారం బ్రిస్టల్ వేదికగా రెండో టి20 జరగనుంది.
స్కోరు వివరాలు
భారత మహిళల ఇన్నింగ్స్: షఫాలీ వర్మ (సి) ఎకిల్‌స్టోన్ (బి) అర్లాట్ 20; స్మృతి (సి) సీవర్ బ్రంట్ (బి) ఎకెల్‌స్టోన్ 112; హర్లీన్ (సి) అర్లాట్ (బి) బెల్ 43; రిచా (సి) డాంక్లీ (బి) బెల్ 12; జెమీమా (సి) సీవర్ బ్రంట్ (బి) బెల్ 0; అమన్‌జ్యోత్ (నాటౌట్) 3; దీప్తి శర్మ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 210. వికెట్ల పతనం: 1–77, 2–171, 3–186, 4–190, 5–202. బౌలింగ్: లౌరెన్ బెల్ 4–0–27–3; అర్లాట్ 4–0–38–1; లౌరెన్ ఫిలెర్ 4–0–35–0; లిన్సీ స్మిత్ 3–0–41–0; సోఫీ ఎకెల్‌స్టోన్ 3–0–43–1; కాప్సీ 2–0–21–0.
ఇంగ్లండ్ మహిళల ఇన్నింగ్స్: డాంక్లీ (సి) రిచా (బి) అమన్‌జ్యోత్ 7; డానీ వ్యాట్ (సి) హర్లీన్ (బి) దీప్తి 0; నటాలియా సీవర్ బ్రంట్ (సి) రిచా (బి) శ్రీచరణి 66; బ్యూమౌంట్ (బి) దీప్తి 10; అమీ జోన్స్ (స్టంప్డ్) రిచా (బి) రాధ 1; కాప్సీ (సి) అరుంధతి (బి) శ్రీచరణి 5; అర్లాట్ (సి) స్మృతి (బి) రాధ 12; ఎకెల్‌స్టోన్ (సి) జెమీమా (బి) శ్రీచరణి 1; లౌరెన్ ఫిలెర్ (సి) రిచా (బి) అరుంధతి 2; లిన్సీ స్మిత్ (నాటౌట్) 0; లౌరెన్ బెల్ (సి) జెమీమా (బి) శ్రీచరణి 2; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (14.5 ఓవర్లలో ఆలౌట్) 113. వికెట్ల పతనం: 1–9, 2–9, 3–58, 4–62, 5–70, 6–88, 7–102, 8–111, 9–111, 10–113. బౌలింగ్: అమన్‌జ్యోత్ కౌర్ 2–0–22–1; దీప్తి శర్మ 3–0–32–2; శ్రీచరణి 3.5–0–12–4; అరుంధతి రెడ్డి 2–0–18–1; రాధా యాదవ్ 2–0–15–2; స్నేహ్ రాణా 2–0–13–0.
1 టి20ల్లో స్మృతి మంధానకు ఇదే తొలి సెంచరీ కాగా... మూడు ఫార్మాట్లలో శతకాలు చేసిన తొలి భారత మహిళా ప్లేయర్‌గా స్మృతి చరిత్ర సృష్టించింది.
2 టి20 ఫార్మాట్‌లో టీమిండియాకు ఇది (210/5) రెండో అత్యధిక స్కోరు. గతేడాది వెస్టిండీస్‌పై 217/4 స్కోరు సాధించింది.