
నేడు ఇంగ్లండ్‌తో భారత మహిళల జట్టు తొలి పోరు
సాయంత్రం గం. 5:30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
సౌతాంప్టన్: పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌లో పాల్గొనేందుకు వచ్చిన భారత మహిళల జట్టు మొదటి మిషన్‌ను విజయవంతంగా పూర్తిచేసింది. ఐదు టి20ల సిరీస్‌ను 3–2తో కైవసం చేసుకుంది. ఇప్పుడు రెండో మిషన్ కోసం శ్రమించేందుకు సిద్ధమైంది. భారత్, ఇంగ్లండ్‌ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు ఇక్కడ తొలి వన్డే జరుగుతుంది. పొట్టి సిరీస్ ఇచ్చిన విజయోత్సాహంతో హర్మన్‌ప్రీత్ బృందం ఆత్మవిశ్వాసంతో ఉండగా... సొంతగడ్డపై సిరీస్‌ను కోల్పోయామన్న కసితో ఇంగ్లండ్ ఉంది. ఈ నేపథ్యంలో వరుసగా వన్డే సిరీస్‌నూ కోల్పోయేందుకు ఏమాత్రం సిద్ధంగా లేని ఆతిథ్య జట్టు తొలి మ్యాచ్ నుంచి పట్టుబిగించాలని భావిస్తోంది.
జోరు మీదున్న టీమిండియా
ఇక్కడ తాజా టి20 సిరీస్‌లోనే కాదు... ఇటీవల శ్రీలంక గడ్డపై జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్‌లోనూ భారత్ విజేతగా నిలిచింది. దక్షిణాఫ్రికా, శ్రీలంకలను మట్టికరిపించింది. ఇప్పుడు ఇంగ్లండ్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లోనూ గెలిచి వన్డే ప్రపంచకప్‌కు ముందు పూర్తిస్థాయి సన్నద్ధతను చాటాలని హర్మన్‌ప్రీత్ బృందం ఆశిస్తోంది. షఫాలీ వర్మ స్థానంలో యువ ఓపెనర్ ప్రతీక రావల్, స్మృతి మంధాన భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారు.
ముక్కోణపు సిరీస్‌లో చెలరేగిన ప్రతీక, ఇక్కడ టి20 సిరీస్‌లో అదరగొట్టిన మంధాన వన్డేల్లో శుభారంభమిస్తే... జెమీమా, హర్మన్‌ప్రీత్, హర్లీన్, రిచా ఘోష్ మిడిలార్డర్‌ను చక్కబెట్టేస్తారు. ఇక బౌలింగ్ విషయానికొస్తే తెలుగుతేజం స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీచరణి మ్యాచ్ మ్యాచ్‌కి పురోగతి సాధిస్తోంది. ఇంగ్లండ్‌లాంటి పిచ్‌లపై స్పిన్ మ్యాజిక్‌తో ప్రత్యర్థుల్ని కట్టిపడేయడం భారత జట్టుకు అదనపు బలం కానుంది.
అనుభవజ్ఞులైన దీప్తి శర్మ, అరుంధతి రెడ్డిలతో కూడిన బౌలింగ్ దళం ఓవరాల్ పటిష్టంగా ఉంది. ఇక ఆతిథ్య జట్టు విషయానికొస్తే రెగ్యులర్ కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ అందుబాటులోకి రావడం జట్టుకు కాస్త లాభించే అంశం. అయితే 20 ఓవర్లనే సరిగ్గా ఎదుర్కోలేకపోయిన బాధ్యతలేని బ్యాటింగ్ దళంతో 50 ఓవర్ల వన్డేలో ఏమేరకు రాణిస్తుందో చూడాలి.
తుది జట్లు (అంచనా)
భారత్: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన, ప్రతీక, హర్లీన్, జెమీమా, రిచా ఘోష్, దీప్తిశర్మ, స్నేహ్ రాణా, శ్రీచరణి, అమన్‌జోత్, అరుంధతి.
ఇంగ్లండ్: నాట్ సీవర్ బ్రంట్ (కెప్టెన్), సోఫియా, టామీ బ్యూమోంట్, సోఫీ ఎకిల్‌స్టోన్, లారెన్ బెల్, బౌచియర్, క్యాప్సీ, కేట్ క్రాస్, చార్లీ డీన్, అమీ జోన్స్, లారెన్ ఫిలెర్.
76 భారత్, ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య ఇప్పటి వరకు 76 వన్డేలు జరిగాయి. 34 మ్యాచ్‌ల్లో భారత్, 40 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలిచాయి. మరో రెండు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు.
35 ఇంగ్లండ్ గడ్డపై ఇంగ్లండ్‌తో భారత జట్టు ఆడిన మ్యాచ్‌లు. ఇందులో 9 మ్యాచ్‌ల్లో భారత్ నెగ్గగా... 24 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ విజయం సాధించాయి. రెండు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు.